పాస్‌పుస్తకాల కోసం పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఒకవేళ పాస్ పుస్తకం ఉన్నా టైటిల్ డీడ్ ఇచ్చేందుకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరి స్థితి ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివి జన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కొందరు రైతులు రెండేళ్ల క్రితం నుంచి టైటిల్‌డీడ్ కోసం వీఆర్వో ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను పలుమార్లు అడిగినా ‘ఆర్డీఓ సార్ సంతకం కాలేదు’ అనే సమాధానం వస్తోందని అంటున్నారు.
అడిగినంత ఇచ్చినా...
రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి అక్రమ ఆదాయ వనరు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయా గ్రామాలు, మండలాల్లో భూమి రేటును బట్టి ఎకరానికి ఇంత అని వీఆర్వోలు ధర ఖరారు చేసి మరీ వసూలు చేసుకుంటారు. ప్రస్తుతం హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, వర్ధన్నపేట తదితర మండలాల పరిధిలో కొన్నిచోట్ల పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు మార్కెట్ ధర ఉన్నచోట తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధికారులు అడిగినంత ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అయితే ఇంతచేసినా పనులు సకాలంలో కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాటాల్లో తేడాల వల్ల...?
సహజంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసే క్రమంలో రెండు పుస్తకాలు ఇస్తారు. ఇందులో ఒకటి స్థానిక తహసీల్దార్ సంతకంతో ఉంటుంది. రెండోది ఆర్డీఓ సంతకంతో ఉంటుంది. దీనినే టైటిల్ డీడ్ లేదా భూమి హక్కుపత్రం అంటారు. ఇది జారీ చేయడానికి అనధికారికంగా ఆర్డీఓ కార్యాల యాల్లో రూ.300 వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తం కూడా వీఆర్వోలు సంబంధిత రైతుల నుంచి వసూలు చేసి ఇచ్చేవారు. అయితే ముందుగా తహసీల్దార్ నుంచి వచ్చే పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చి టైటిల్ డీడ్ కోసం కొంత సమయం కేటాయించేవారు.
ఎందుకంటే.. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పుస్తకాలు ఆర్డీఓలు చూడాలి. కాబట్టి వారికి సందేహాలు ఉన్నచోట పరిశీలన చేసి మరీ జారీ చేసేవారు. ఇయితే క్రమంగా ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో కొన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో ఒక్కో పుస్తకానికి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వీఆర్వోలు ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వెరశి ఆర్డీఓ కార్యాలయానికి సంతకం కోసం వెళ్లిన పుస్తకాలు ఏళ్లు గడుస్తున్నా అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇదేమిటని నిలదీసిన రైతులకు ఏదో ఒక కొర్రీవేసి పనులు చేయకుండా వేధిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి.
బ్యాంకుల్లో అవస్థలు
రైతులు తమ పాస్‌పుస్తకాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటారు. గతంలో కేవలం ఒకే పుస్తకంతో రుణం ఇచ్చిన బ్యాంకర్లు కొంతకాలంగా టైటిల్ డీడ్ కూడా ఉంటేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు. అయితే వేల సంఖ్యలో పుస్తకాలు ఆర్డీఓ కార్యాలయాల్లో ఉండటంతో రైతులు రుణం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణం మంజూరు అయిన వారు కూడా టైటిల్ డీడ్ లేక పొందలేక పోతున్నామంటున్నారు.
వరంగల్ డివిజన్‌లోనే వేలల్లో...
జిల్లా మొత్తంగా సమస్య ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమస్య తీవ్రత ఎక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్ల నుంచి టైటిల్ డీడ్ కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల నుంచి మొత్తం 2వేల పుస్తకాల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఆర్‌ఓఆర్‌పై నిషేధం ఉన్న సాకుతో అధికారులు అన్నింటినీ అదేగాటన పెట్టి కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తిచేస్తే చేస్తే కనీసం బ్యాంకు రుణాలైనా పొందే అవకాశం ఉంటుంది.