సాక్షి, హైదరాబాద్: రికార్డుల పరంగా వ్యవసాయ భూమిగా నమోదై, సాగు భూమిలోనే ఉన్నప్పటికీ సాగు చేయకుండా, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల్లో ఉండి వ్యవసాయం జరగని భూమి విస్తీర్ణాన్ని ‘పాట్ ఖరాబ్’పేరుతో రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చనుంది. సేత్వార్ (గ్రామస్థాయి రికార్డు)/రెవెన్యూ రికార్డులే కాకుండా.. ఆ వివరాలను రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో, ధరణి పోర్టల్‌లో కూడా నమోదు చేయనుంది.
ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కచ్చితంగా సాగు జరుగుతున్న విస్తీర్ణానికే ఇవ్వడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రైతుబంధు భారాన్ని కూడా కొంతమేర తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉత్తర్వులు వెలువరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్ని వివరాలూ నమోదు చేయాల్సిందే..
♦తాజా ఉత్తర్వుల ప్రకారం.. సేత్వార్/రెవెన్యూ రికార్డుల్లో పాట్ ఖరాబ్‌గా రికార్డయిన వివరాలు పొందుపర్చాలి.
♦వ్యవసాయ భూముల్లో ఉన్న రాళ్లు, నీటి నిల్వ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, కట్టలు, సాగునీటి చానళ్లు, వాగు, వర్రెలను నమోదు చేయాలి.
♦ఎడ్ల కొట్టాలు, పేడ గొయ్యిలు, దిబ్బలున్న ప్రాంతాలు, భవనాలు, అనుబంధ ప్రదేశాల వివరాలను పొందుపర్చాలి. ఆ భూమిలో ఉన్న చెట్ల వివరాలను (ప్రైవేట్ ఫారెస్ట్) కూడా పేర్కొనాలి.
♦ట్రాక్టర్ షెడ్లుగా, నూర్పిడి ప్రాంతంగా ఎంత భూమిని వినియోగిస్తున్నారనేది కూడా తెలియజేయాలి. వరదలు, భూమి కోత, భూకంపాలు సంభవించినప్పుడు సాగుకు పనికిరాకుండా పోయిన భూముల వివరాలను పొందుపర్చాలి. అదే విధంగా వ్యవసాయ భూముల్లో ట్రాక్టర్లు, కోతయంత్రాలు వెళ్లే దారులు, వర్షపు నీటి గుంతల
వివరాలను ఇవ్వాలి.
♦ఇలా అన్ని వివరాలతో స్థానిక ఆర్డీవోకు పట్టాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం వివరాలతో పాటు ఈ సమాచారాన్ని కూడా దరఖాస్తుల్లో పేర్కొనాలి. వీటిపై ఆర్డీవో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. సర్వే నిర్వహించి పాస్‌పుస్తకంలో వ్యవసాయ భూమిగా నమోదై ఉన్న భూమిలో.. ఎంత భూమి పాట్ ఖరాబ్ కిందకు వస్తుందో నిర్ధారిస్తారు. ఆ భూమిని ఎందుకు వినియోగిస్తున్నారనే వివరాలను కూడా సేకరిస్తారు. ఈ మేరకు ఆర్డీవో ఉత్తర్వులిచ్చిన తర్వాత పాట్ ఖరాబ్ వివరాలను పాస్‌పుస్తకంలో, ధరణి పోర్టల్‌లో పొందుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment