Pass book
-
పాస్‌పుస్తకంలో ‘పాట్ ఖరాబ్’
సాక్షి, హైదరాబాద్: రికార్డుల పరంగా వ్యవసాయ భూమిగా నమోదై, సాగు భూమిలోనే ఉన్నప్పటికీ సాగు చేయకుండా, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల్లో ఉండి వ్యవసాయం జరగని భూమి విస్తీర్ణాన్ని ‘పాట్ ఖరాబ్’పేరుతో రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చనుంది. సేత్వార్ (గ్రామస్థాయి రికార్డు)/రెవెన్యూ రికార్డులే కాకుండా.. ఆ వివరాలను రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో, ధరణి పోర్టల్‌లో కూడా నమోదు చేయనుంది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కచ్చితంగా సాగు జరుగుతున్న విస్తీర్ణానికే ఇవ్వడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రైతుబంధు భారాన్ని కూడా కొంతమేర తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉత్తర్వులు వెలువరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని వివరాలూ నమోదు చేయాల్సిందే.. ♦తాజా ఉత్తర్వుల ప్రకారం.. సేత్వార్/రెవెన్యూ రికార్డుల్లో పాట్ ఖరాబ్‌గా రికార్డయిన వివరాలు పొందుపర్చాలి. ♦వ్యవసాయ భూముల్లో ఉన్న రాళ్లు, నీటి నిల్వ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, కట్టలు, సాగునీటి చానళ్లు, వాగు, వర్రెలను నమోదు చేయాలి. ♦ఎడ్ల కొట్టాలు, పేడ గొయ్యిలు, దిబ్బలున్న ప్రాంతాలు, భవనాలు, అనుబంధ ప్రదేశాల వివరాలను పొందుపర్చాలి. ఆ భూమిలో ఉన్న చెట్ల వివరాలను (ప్రైవేట్ ఫారెస్ట్) కూడా పేర్కొనాలి. ♦ట్రాక్టర్ షెడ్లుగా, నూర్పిడి ప్రాంతంగా ఎంత భూమిని వినియోగిస్తున్నారనేది కూడా తెలియజేయాలి. వరదలు, భూమి కోత, భూకంపాలు సంభవించినప్పుడు సాగుకు పనికిరాకుండా పోయిన భూముల వివరాలను పొందుపర్చాలి. అదే విధంగా వ్యవసాయ భూముల్లో ట్రాక్టర్లు, కోతయంత్రాలు వెళ్లే దారులు, వర్షపు నీటి గుంతల వివరాలను ఇవ్వాలి. ♦ఇలా అన్ని వివరాలతో స్థానిక ఆర్డీవోకు పట్టాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం వివరాలతో పాటు ఈ సమాచారాన్ని కూడా దరఖాస్తుల్లో పేర్కొనాలి. వీటిపై ఆర్డీవో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. సర్వే నిర్వహించి పాస్‌పుస్తకంలో వ్యవసాయ భూమిగా నమోదై ఉన్న భూమిలో.. ఎంత భూమి పాట్ ఖరాబ్ కిందకు వస్తుందో నిర్ధారిస్తారు. ఆ భూమిని ఎందుకు వినియోగిస్తున్నారనే వివరాలను కూడా సేకరిస్తారు. ఈ మేరకు ఆర్డీవో ఉత్తర్వులిచ్చిన తర్వాత పాట్ ఖరాబ్ వివరాలను పాస్‌పుస్తకంలో, ధరణి పోర్టల్‌లో పొందుపర్చనున్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
కృష్ణాజిల్లా, తిరువూరు: ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు.. తిరువూరు లయోలా స్కూలు సమీపంలో నివసిస్తున్న రాజుపేట వీఆర్వో పోతురాజు జయకృష్ణ, వావిలాల గ్రామ వీఆర్ఓగా ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. వావిలాల శివారు రాజుగూడెం గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి తన భార్య లక్ష్మి, కుమార్తె నాదెండ్ల రమ్యకృష్ణ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అడంగళ్ 1బీలో మార్పు చేర్పులు చేయకుండా వీఆర్‌లో జాప్యం చేస్తున్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాల జారీకి రూ.16వేలు వీఆర్ఓ డిమాండ్ చేయగా, చంద్రమౌళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓ ఇంటి వద్ద రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వీఆర్వో నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేశారు. గురువారం జయకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. -
పాస్‌బుక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్!
సాక్షి, యాదగిరిగుట్ట(నల్గొండ) : పాస్‌పుస్తకాలు లేకుండానే తమ భూమిని వేరేవారి పేరుమీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన ఓ కుటుంబం సబ్ రిజిస్ట్రార్‌ను నిలదీశారు. ఈ సంఘటన మంగళవారం గుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన బైరా ఎల్లయ్య, సిద్ధమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు వెంకటేష్ ఇటీవల మరణించాడు. దీంతో పెద్ద కోడలు యాదమ్మ పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఎల్లయ్యకు గ్రామంలోని 267, 268, 269 సర్వేనంబర్లలో 4ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పంచాలని వృద్ధులైన ఎల్లయ్య–సిద్దమ్మ దంపతులను పెద్ద కోడలు అడగడంతో చిన్న కుమారుడు సిద్ధులుతో పాటు సమానంగా పంచి, మిగిలిన భూమిని తాము, ఆడ పిల్లలకు ఇస్తానని చెప్పారు. దర్శనానికి వచ్చి.. గతనెల రోజుల క్రితం వృద్ధుడైన ఎల్లయ్యను కోడలు యాదమ్మ హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. గత శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి తీసుకొచ్చింది. అక్కడ అతడి దగ్గర ఉన్న జీరాక్స్ భూమి పత్రాలను తీసుకొని, సబ్ రిజిస్ట్రేషన్ వద్ద ఓ డ్యాక్యుమెంట్ కార్యాలయంలో రిజిస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసింది. అనంతరం కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో 4.9 ఎకరాల్లో 2.5ఎకరాల భూమిని యాదమ్మ తన పేరున చేసుకుంది. రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టాలని వినతి.. ఇది తెలుసుకున్న ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, బిడ్డలు కనకమ్మ, రజిత, అనితలు అదే రోజు సాయంత్రం అధికారుల వద్దకు వచ్చి యాదమ్మ జీరాక్స్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని పెండింగ్‌లో పెట్టాలని, 4.9 ఎకరాలకు సంబంధించిన ఒరి జినల్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడీలు తమ వద్ద ఉ న్నాయని వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్న మరో సారి ఎల్లయ్య భార్య, కుమార్తెలు కార్యాలయానికి వచ్చి జీరాక్స్ పేపర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని, మీరు ఎంత లంచం తీసుకున్నారని, కార్యాలయంలో పని చేసే నవీన్ అనే వ్యక్తే డాక్యుమెంట్ దగ్గరుండి తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల వద్ద సమాచారం సేకరించి శాంతిపజేశారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ వివరణ అడగగా.. ఎల్లయ్య పెద్ద కొడలు యాదమ్మ గత శనివారం సర్వే నంబర్ 267, 268, 269లో ఉన్న 4.9 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ తీసుకువచ్చారని, అందులో జీరాక్స్ ఉన్న విషయాన్ని అంతగా గమనించలేదన్నారు. ఈ విషయమై ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, ముగ్గురు కూతుర్లు వచ్చారు. జిరాక్స్ పత్రాలతో, తమ నాన్నను మోసం చేసి యాదమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని నిలిపివేయాలని వినతి ఇచ్చారు. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
పాసుపుస్తకం కోసం ముగ్గురి ఆత్మహత్యాయత్నం
కేసముద్రం: తమకు వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయకపోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లాల రవికుమార్ తన తండ్రి చంద్రయ్య ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. వారసత్వంగా వచ్చిన భూమిలో కుమారుడు రవికుమార్ సాగు చేసుకుంటున్నాడు. భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు రాలేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తనకున్న 3.12 ఎకరాల భూమికి గాను రైతుబంధు ద్వారా రెండు విడతల్లో పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం నుంచి బాధితుడికి మూడెకరాలకు సంబంధించిన డబ్బులు అందాయి. మిగతా భూమిని రికార్డు ల్లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని అధికారులను కోరుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమ వారం రవికుమార్, తన చెల్లెళ్లు రాజమ్మ, లలిత కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో íఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ అక్కడున్న రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. అధికారులు స్పందించకపోగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా మాట్లాడటంతో రవికుమార్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగబోగా, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఆటోలో ఆ ముగ్గుర్ని ఇంటికి పంపించారు. డబ్బులు ఇవ్వటం లేదనే సాకుతోనే అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా రోజూ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు మనోవేదనకు గురయ్యారు. ఇంటికి చేరుకున్న అన్నా, ఇద్దరు చెల్లెళ్లు్ల తమ భూమి సమస్య పరిష్కారం కాదని మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు వారిని 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
ఏసీబీ వలలో రావులాపురం వీఆర్వో
ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. బొల్లాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటున్న రావులాపురం వీఆర్వో రాజును ఏసీబీ అధికారులు శుక్రవారం దాడిచేసి పట్టుకున్నారు. వ్యవసాయ భూమికి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి ముందస్తుగా రూ.20 వేలు తీసుకుంటుండగా అరెస్టు చేశారు. బొల్లాపల్లి: పొలం పాసు పుస్తకం మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడిన ఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్సీ ఎ.సురేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం మండలంలోని రావులాపురం గ్రామానికి చెందిన మారంరెడ్డి వెంకటరెడ్డి భార్య సరోజిని పేరుమీద 1.80 ఎకరా భూమికి పాసు పుస్తకాలు (టైటిల్ డీడ్, మ్యూటేషన్) కోసం లంచం రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఈ విషయం వెంకటరెడ్డి తన సోదరుడైన ఆదిరెడ్డికి పురమాయించాడు. తొలుత రూ.20 వేలు చెల్లిస్తే పనిచేసి పెడతామని వీఆర్వో బదులివ్వడంతో, ఆదిరెడ్డి ఈ నెల 26న ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనమేరకు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆదిరెడ్డి రూ.20 వేలు లంచాన్ని రావులాపురం వీఆర్ఏ కడియం రాజుకు ఇస్తుండగా దాడులు చేసినట్టు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకుని, వీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అడిషనల్ ఎస్సీ ఎ.సురేష్‌బాబు తెలిపారు. రూ.32 వేలు డిమాండ్ చేశారు బాధితుడు మారం రెడ్డి వెంకటరెడ్డి విలేకర్లు వద్ద తెలిపిన వివరాలు ప్రకారం మా స్వగ్రామమైన రావులాపురంలో నెల క్రితం 1.80 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. పాసుపుస్తకాల కోసం గత నెల 27న దరఖాస్తు చేశా. పాసుపుస్తకాల మంజూరుకు వీఆర్వో కడియం రాజు రూ.32 వేలు డిమాండ్ చేశారు. -
పసివాడే పట్టాదారుడు
జగదేవ్‌పూర్(గజ్వేల్): పదేళ్ల వయస్సు లేని బాలుడికి అధికారులు రైతుబంధు పథకం కింద పాస్‌పుస్తకం, పెట్టుబడి సాయం చెక్కు అందించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంతం కవిత, నరేశ్ దంపతులకు నిర్మల్ (8), నిరంజన్(10) అనే కుమారులు ఉన్నారు. వీరి తాత బాల్‌నర్సయ్య తన మనుమల పేరున ఒక్కొక్కరికి ఎకరా 5 గుంటల భూమిని రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేయించారు. పట్టాదారుకే సాయం అందించాలన్న నిబంధన మేరకు శనివారం అధికారులు నిర్మల్‌తోపాటు నిరంజన్‌కు పెట్టుబడి సాయం చెక్కులను అందించారు. -
పకడ్బందీగా పంపిణీ!
సాక్షి, హైదరాబాద్ : రైతులకు కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 58 లక్షల మందికి పంపిణీ చేయనున్నందున ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టదారులైన రైతులతోపాటు అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతర రైతులకూ కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల అధికార యంత్రాంగమంతా పూర్తి శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించి.. మే 10 నుంచి వారం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి.. ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. జాగ్రత్తగా వ్యవహరించాలి.. ‘‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం మనం ఎత్తుకున్నాం. భూరికార్డులను సర్వే చేసి, కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరూ నిర్వహించలేదు. ఈ కార్యక్రమాలను మనమే రచించుకుని, అమలు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. నెలాఖరు వరకు పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయి. వాటిని జిల్లాల్లో భద్రపరిచి, గ్రామాలకు చేర్చాలి. వెంటనే నగదు అందేలా ఏర్పాట్లు.. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశాం. పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం రూ.12 వేల కోట్లను బడ్జెట్లో పెట్టుకున్నాం. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రూ.6 వేల కోట్లు సమీకరించాం. ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయి. రైతులు చెక్కు ఇచ్చిన వెంటనే బ్యాంకులు నగదు చెల్లించాలి. ఇందుకోసం కలెక్టర్లు వెంటనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. చెక్కులిచ్చిన రైతులకు వెంటనే నగదు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు ముందుగానే స్పష్టం చేయాలి. పక్కా ప్రణాళిక ప్రకారం.. జిల్లాలకు వచ్చే పాస్ పుస్తకాలు, చెక్కులను కలెక్టర్లు పరిశీలించాలి. అన్ని గ్రామాల బుక్కు లు, చెక్కులు వచ్చాయో లేదో సరి చూసుకోవాలి. ప్రతి 300 పాస్ పుస్తకాల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,762 బృందాలను ఏర్పాటు చేయాలి. ఆయా గ్రామ రైతుల సంఖ్య ఆధారంగా ఎన్ని బృందాలు వేయాలనే విషయాన్ని కలెక్టర్లు నిర్ధారించాలి. ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులుండాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. పంపిణీ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. ఏ రోజు ఏ గ్రామంలో పంపిణీ ఉంటుందో ముందే నిర్ణయించి.. ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పేపర్లలో ప్రకటనల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈ వివరాలు తెలపాలి. గ్రామంలో పంపిణీ చేపట్టినప్పుడు ఎవరైనా చెక్కులు, పాస్‌బుక్‌లు తీసుకోకుంటే వారు తహసీల్దార్ కార్యాలయంలో పొందేలా ఏర్పాట్లు చేయాలి. ఇబ్బందుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్.. పంపిణీ సందర్భంగా ఎక్కడైనా, ఏమైనా పొరపాట్లు జరిగినా, ఇబ్బందులు తలెత్తినా... వారి బాధ, సమస్య వినడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో పంపిణీ కార్య క్రమం నిర్వహించాలి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇక కొంత మంది రైతులు పెట్టుబడి సాయం వద్దని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. ఆ సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలి’’. రైతులందరికీ పెట్టుబడి చెక్కులు పట్టాదారులైన రైతులతోపాటు పేదలకు పంపిణీ చేసిన భూములను సాగుచేసుకుంటున్న రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి సాయం చెక్కులు అందివ్వాలి. ఎవరైనా రైతుకు రూ.50 వేలకన్నా ఎక్కువ సాయం అందించాల్సి వస్తే.. వారికి రెండు చెక్కులు ఇవ్వాలి. రూ.50 వేలలోపు మొత్తానికి ఒక చెక్కు, ఆపైన మొత్తానికి మరో చెక్కు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు, చెక్కులు పొందిన వారి నుంచి రసీదు తీసుకోవాలి. నిస్పృహలో ఉన్న రైతులను ఆదుకొనేందుకే.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. గిట్టు బాటు ధర రాక పంటలను రోడ్లపై పారబోసుకుంటున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టి లో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం అందరి ప్రశంసలు పొందుతున్నది. ప్రముఖ ఎకానమిస్ట్ అశోక్ గులాటి తెలంగాణ అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమని ప్రకటించారు. పంట పోయినా.. రైతులు నష్ట పోకుండా ఉంటా రు. కాబట్టే ఖర్చుకు వెనకాడకుండా రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున అందిస్తున్నాం. పంటల సాగులో అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర రావడానికి వీలుగా.. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. ఒక్కో క్లస్టర్లో ఒక రైతు వేదిక నిర్మిస్తున్నాం. వీటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. -
పట్టాదార్లకే పెట్టుబడి చెక్కులు
ఆదిలాబాద్‌అర్బన్ : రైతుబంధు పథకం కింద పెట్టుబడి చెక్కులను పట్టాదారులకే అందించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను గ్రామాల వారీగా భూములు కలిగిన పట్టాదారు రైతులకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి కదలలేని స్థితిలో ఉన్న పట్టాదారుని ఇంటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టాదారుల చెక్కులను సరి చేసుకోవాలని, వాటిని భద్రంగా పోలీస్‌స్టేషన్, పోస్టాఫీసు స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచాలని తెలిపారు. చెక్కుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని, ఇంగ్లిష్ అక్షర క్రమంలో తయారు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. గ్రామాల్లోని వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం చెక్కుల పంపిణీకి ఒక రోజు ముందే గ్రామాల్లో ఠాంఠాం విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. చెక్కుల పంపిణీ తీరును వీడియో చిత్రీకరణ చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా ఆ గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను తహసీల్దార్లు ఇవ్వాలని, రైతులు, సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రైతు నుంచి రోజుకు 2 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని రైతులకు వివరించాలని తెలిపారు. ఇచ్చోడ, బేల కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్డీవోలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌హెచ్‌వో నర్సింగ్‌దాస్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పుల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలి ఆదిలాబాద్‌అర్బన్: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం కలెక్టర్‌తన క్యాంప్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలను రిమ్స్, ఉట్నూర్‌లలో ఉన్న పౌష్టికాహార కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. గ్రామాల్లోని పిల్లలను పోషకాహార పునరావాస కేంద్రాలకు ఎక్కువ మందిని పంపించే ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకం అందించాలని పేర్కొన్నారు. ఆశలకు రూ.300 చొప్పున, అంగన్వాడీలకు రూ.100 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
పాస్‌బుక్, ఆధార్ ఉంటేనే.. పెట్టుబడి చెక్కు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి సాయం కింద చెక్కులు అందుకోవాలంటే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఉండాల్సిందే! గ్రామసభలకు వాటిని తీసుకొచ్చే రైతులకే చెక్కులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాస్ పుస్తకం రాని రైతులకు.. రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూరికార్డుల సమాచారం మేరకు పాస్ పుస్తకం మొదటి పేజీని ప్రింట్ తీసి కలెక్టర్ లేదా తహసీల్దార్ సంతకంతో అధికారులే అందిస్తారు. దాన్ని రైతులు గ్రామసభల్లో ఇస్తే సరిపోతుంది. ప్రతీ చెక్కును పట్టాదారుడికే అందజేయనున్నారు. వారి తరఫున ఇతరులు వచ్చి చెక్కు తీసుకోవడానికి వీల్లేదు. రైతు అనారోగ్యం పాలైనా, అంగ వైకల్యం కలిగి ఉన్నా అధికారులే వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తారు. రైతుబంధు పథకం అమలు మార్గదర్శకాల్లో ఈ మేరకు పేర్కొన్నారు. బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం రానున్న ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచే రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ సమయంలోనే రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. గ్రామసభల్లో ఏఈవో, వీఆర్వోలు రైతులను గుర్తించాల్సి ఉంటుంది. చెక్కులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం బ్యాంకులు రైతులకు నగదు అందజేస్తాయి. గ్రామసభల్లో పంపిణీ కాకుండా మిగిలిపోయిన చెక్కులు, సంబంధిత రైతుల జాబితాను ప్రత్యేకంగా రూపొందిస్తారు. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్ సంయుక్త ఆమోదంతో వాటిని నెల రోజుల్లోగా మళ్లీ రైతులకు అందజేయాల్సి ఉంటుంది. అయినా పంపిణీ కాని చెక్కులుంటే వెనక్కు పంపిస్తారు. రైతులు మూడు నెలల్లో చెక్కుల నుంచి నగదు తీసుకోవాలి. ఒకవేళ వాటి కాలపరిమితి ముగిసిపోతే గడువును పెంచే బాధ్యత రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు కల్పించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులకు రైతు పేరు, వయసు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌తోపాటు వారి కుల కేటగిరీతో కూడిన రిజిస్టర్‌ను అందజేస్తారు. ఏఈవోలు దానిపై చెక్కు అందుకున్న రైతుల సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. కలెక్టర్లకే పూర్తి బాధ్యత రైతుబంధు పథకం కింద అన్నదాతలకు అందజేసే పెట్టుబడి చెక్కుల పంపిణీ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారులు (డీఏవో)లు ఈ ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలివీ.. – జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. అందులో జాయింట్ కలెక్టర్, డీఏవో, ఎల్డీఎం తదితరులు కమిటీ సభ్యులుగా ఉంటారు. – కలెక్టర్ జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, ఆర్డీవో, ఏడీఏలు, తహశీల్దార్లు, ఎంఏవోలు, ఏఈవోలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి. బ్యాంకర్లతో మరో సమావేశం ఏర్పాటు చేయాలి. – కలెక్టర్‌ను సంప్రదించి చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ను గ్రామాల వారీగా ఖరారు చేయాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయాధికారులదే. – చెక్కుల పంపిణీ సక్రమంగా జరిగేందుకు మండలాల్లో ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించాలి. జిల్లా సహకారశాఖ అధికారులనూ ఉపయోగించుకోవాలి. – ముద్రించిన చెక్కులను హైదరాబాద్ నుంచి జిల్లా వ్యవసాయాధికారులు తీసుకెళ్లాలి. వాటిని మండలాల వారీగా తరలించాలి. ఎంఏవోలకు అప్పగించాలి. గ్రామాల వారీగా బండిళ్లను ఏఈవోలకు అప్పగించాలి. – ముద్రించిన చెక్కులను బ్యాంకుల నుంచి తీసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ కమిషనర్‌కు అప్పగించారు. కలెక్టర్లతో సంప్రదించి వాటిని పకడ్బందీ భద్రత మధ్య జిల్లాలకు, గ్రామాలకు తరలించాల్సిన బాధ్యత ఆయనదే. – గ్రామసభల్లో చెక్కుల పంపిణీ ప్రక్రియను గ్రామాల్లో చాటింపు ద్వారా వీఆర్వో/వీఆర్ఏలు ప్రజలకు తెలియజేయాలి. – చెక్కుల పంపిణీ సక్రమంగా జరిగేట్లు చూడాల్సిన బాధ్యత డీఏవో, ఏడీఏ, ఎంఏవోలకు అప్పగించారు. ఎలాంటి తప్పిదాలు జరిగినా, నిర్లక్ష్యం చవిచూసినా కఠిన చర్యలు తీసుకుంటారు. – రోజువారీ బ్యాంకుల్లో పెట్టుబడి నగదు సొమ్ము వివరాలను బ్యాంకులు ప్రభుత్వానికి అందజేస్తాయి. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ ఇదే... రాష్ట్రస్థాయిలో రైతుబంధు పథకం అమలుతీరును పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఆ శాఖ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎన్ఐసీ రాష్ట్ర సమాచార అధికారి సభ్యులుగా ఉంటారు. ఒక చెక్కుపై రూ.49,990 చెక్కులపై రైతుబంధు పథకం అని రాసి ఉంటుంది. పట్టాదారు పేరు, నంబర్ ఉంటుంది. జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం వివరాలు, రైతుకు ఇచ్చే సొమ్ము వివరాలు ఉంటాయి. ఆర్డర్ చెక్కులుగా వీటిని అందజేస్తారు. చెక్కు అందుకున్న రైతు తాను ఎంచుకున్న బ్యాంకులో ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. అయితే డ్రా చేసుకునే సమయంలో తప్పనిసరిగా పట్టాదార్ పాసు పుస్తకం లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి. రూ.50 వేలు దాటితే రెండు చెక్కులుగా ఇస్తారు. ఒక చెక్కుపై గరిష్టంగా రూ.49,990 మాత్రమే ఇస్తారు. అంతకుమించితే మరో చెక్కు ఇస్తారు. పథకం అమలులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శికి ఐదుగురు అధికారులు సాయం చేస్తారు. ఉద్యానశా>ఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మణికందన్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ సహకరిస్తారు. పథకం కోసం ప్రత్యేక పోర్టల్ రైతుబంధు పథకం కోసం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రోజువారీ చెక్కుల పంపిణీ సమాచారం ఉంటుంది. ఎంతమందికి చెక్కులు ఇచ్చారు, ఎంత సొమ్ము తీసుకున్నారన్న సమాచారం ఉంటుంది. అయితే సీఎంవో, వ్యవసాయ మంత్రి, కలెక్టర్లు, ఇతర అధికారులు మాత్రమే చూసేలా వారి పేర్లతో యూజర్ ఐడీలను సిద్ధం చేశారు. సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండవు. ప్రతీ రోజు ఏఈవో, ఏడీఏ, డీఏవోలు సాయంత్రం 6–6.30 మధ్య గ్రామసభల్లో చెక్కుల పంపిణీ వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మండల, ఏడీఏ డివిజన్, జిల్లా స్థాయిలో వీటిని కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. -
పట్టణాల్లో ప్రక్షాళన!
-
పాస్‌పుస్తకం లేకుండానే రుణం!
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట రుణాల కోసం ఇక నుంచి తమ పాస్‌పుస్తకాలను బ్యాం కుల్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెబ్‌ల్యాండ్ డాటాలోని 1బీ రికార్డు ఆధారం గానే క్రెడిట్ ఏజెన్సీ (బ్యాంకులు) రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–1971కి సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం శాసనసభలో బిల్లు ప్రవేశపె ట్టారు. ఆ బిల్లులోని ముఖ్యాంశాలివి.. ♦ భూమి హక్కుల్లో ఎలాంటి మార్పు జరిగినా మ్యుటేషన్ వివరాలను ఆ హక్కు పొందిన 30 రోజుల్లోగా తహసీల్దారుకు సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారాన్ని పొందిన వీఆర్వో ఒక్క రోజులోనే ఆ విషయాన్ని తహసీల్దారుకు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ సమాచారానికి తహసీల్దారు రసీదు ఇవ్వాలి. ♦ పాస్‌పుస్తకాల్లో మార్పు కోసం ఎవరైనా అభ్యర్థన చేసుకుంటే వాటిని సరిచేసే అధికారం తహసీల్దార్లకే ఉంటుంది. ♦ డిసెంబర్ 31, 2017 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సాదాబైనామాలు లేకపోయినా స్థానికంగా విచారణ జరిపి గ్రామసభ ఆమోదం తీసుకుని సదరు క్లెయిమ్‌ను క్రమబద్ధీకరించవచ్చు. అయితే, ఆ భూమి ఐదెకరాలకు మించరాదు. ♦ పట్టాదారు పాస్‌పుస్తకం ప్రభుత్వ వెబ్ సైట్లో నిర్వహించే పట్టాదారు పాస్ పుస్తకంగా మారుతుంది. అందులో తాకట్టు దారు (మార్టిగేజ్), కౌలుదారు (టెనెంట్) అనే పదాలుండవు. కేవలం పట్టాదారులు అనే పదం మాత్రమే ఉంటుంది. ♦ పట్టాదారు పాస్‌పుస్తకం కోసం అడగకుండా వెబ్‌ల్యాండ్ డాటా ప్రకారం నిర్వహించే 1–బీ రెవెన్యూ రికార్డు ఆధారంగానే క్రెడిట్ ఏజెన్సీ రుణాన్ని మంజూరు చేయాలి. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములకు రక్షణ కల్పించేందుకు గాను హైదరాబాద్ జాగీర్దార్ల రద్దు చట్టం, 1358 ఫసలీ ప్రకారం ఉన్న జాగీరు భూములన్నీ ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తారు. ♦ ఈ బిల్లు ఆమోదంలోకి వస్తే తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లు జూన్17, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. ♦ ఈ బిల్లుతో పాస్‌బుక్, టైటిల్‌డీడ్ ఏకీకృతంగా మారుతాయి. మ్యుటేషన్ కాలపరిమితి 90 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిపోతుంది. -
నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం పట్టివేత
ఐదు నిమిషాలైతే రూ.50 వేల చెల్లింపు సమయస్ఫూర్తితో నకిలీదని గుర్తించిన అధికారులు పరారైన నిందితుడు కురవి : రుణం కోసం వచ్చిన వ్యక్తి వద్ద అధికారులు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న సంఘటన కురవిలోని ఆంధ్రాబ్యాంకులో సోమవారం జరిగింది. కర్షక సేవా సహకార సంఘం ఎండీ గుగులోత్ సంతూలాల్ కథనం ప్రకారం.. రాజోలు శివారు హరిదాసు తండాకు చెందిన రైతు దారవత్ రాము బలపాల గ్రామీణ వికాస బ్యాంకులో గతంలో తన పట్టాదారు పాస్‌పుస్తకాలు పెట్టి రుణం పొందాడు. అతడు అలాంటి పాస్‌పుస్తకాలనే మరో కాపీని తయారీ చేసి ఇటీవల కురవిలోని కర్షక సేవా సహకార సంఘానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు వెంట నోఆబ్జక్షన్ సర్టిఫికేట్, పట్టాదారు పాసుపుస్తకాలు(సర్వే నంబర్ 257/ డీ1లో 36 గుంటలు, 488/ బీ 2లో ఎకరం 13 గుంటలు, 489/ బీలో 8 గుంటలు), రెండు, వన్ బీకి సంబంధించిన కంప్యూటర్ పహాణీలను జత చేశాడు. ఆ పాస్‌పుస్తకాల్లో గతంలో పనిచేసిన తహసీల్దార్ శ్రీనివాస్, కార్యదర్శి హరినాథ్‌బాబు సంతకాలను రాము ఫోర్జరీ చేసినట్లు కర్షక సేవా సహకార సంఘ ఉద్యోగి నర్సింహరెడ్డి గుర్తించారు. దరఖాస్తులో కూడా బలపాల గ్రామీణ వికాస బ్యాంకు ముద్ర ఉన్నప్పటికీ మేనేజర్ సంతకం లేకపోవడం.. పాత తహసీల్ధార్, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీగా కనిపించడంతో నకిలీ పట్టాదారు పాసు పుస్తకంగా గుర్తించినట్లు సంత్లాల్ వెల్లడించారు. వెంటనే రైతును పిలిచి ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అతడు పరారైనట్లు ఆయన తెలిపారు. నకిలీ పాస్‌పుస్తకం పెట్టి రుణం పొందాలని ఇలా చేశాడని, ఈ విషయమై కురవి పోలీసులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. మరో ఐదు నిమిషాలు గడిస్తే చెక్ ఇచ్చే వాడినని, కార్యాలయ ఫీల్డ్ ఆఫీసర్ నర్సింహరెడ్డి సమయస్ఫూర్తితో నకిలీ పుస్తకంగా గుర్తించడంతో సహకార సంఘానికి నష్టం వాటిల్లకుండా ఉందని తెలిపారు. ఇదే విషయమై కురవి ఎస్సై అశోక్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు. -
ఫొటో ఒకటే.. పాస్ పుస్తకాలు నాలుగు
దళారుల మాయాజాలం కంప్యూటర్ పహాణీ మార్పునకు దరఖాస్తు చేసుకోగా వెలుగులోకి.. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు కొడకండ్ల : అవి నాలుగు వేర్వేరు పట్టాదారు పాసు పుస్తకాలు. కానీ.. వాటిపై ఒకే మహిళ ఫొటో ఉంది.. పేర్లు, కుటుంబపరమైన వివరాలు మాత్రం అమాంతం మారి పోయాయి. రామవరం గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో సదరు మహిళ కులం ఎస్టీ అనిరా యగా..రేగుల గ్రామానికి సంబంధించిన పాస్ పుస్తకంలో బీసీ అని రాశారు. ఎంతో కన్ఫూ్యజ్ చేసేలా ఉన్న ఈ వివరాలను చూసి రెవె న్యూ అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు. నకిలీ పాస్ పుస్తకాల తయారీదారులు వాటిలో మిగ తా వివరాలన్నీ సవరించి, కేవలం ఫొటోలు మార్చకపోవడంతో తతంగం బట్టబయలై ఉండొచ్చని భావిస్తున్నారు. కొడకండ్ల మండల ఇన్చార్జి తహసీల్దార్ రాములు నాయక్ సమయస్ఫూర్తితో ఈ బాగోతాన్ని వెలుగులోకితెచ్చారు. దాదాపు మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పేరిట కూడా ఇదే విధంగా మూడు, నాలుగు నకిలీపాస్ పుస్తకాలను సృష్టించినట్లు ఆయన గుర్తించారు. మూడురోజుల క్రితమే ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతకుముందు నకిలీ పాస్‌పుస్తకాల సృష్టికర్తలు వాటికి సంబంధించిన కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఇన్చార్జి తహసీల్దార్‌కు అనుమానం కలిగి, వాటిలోని భూముల వివరాల ఆధారంగా సిబ్బంది తో క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. ఈక్రమంలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. అసలు భూమిలేని వారు కూడా పాస్ పుస్తకం కలిగి ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాలపై పేర్లు, ఊర్ల వివరాలు మార్చి, ఆన్లైన్లో కరెక్షన్ చేయించుకోవాలనే కుటిల పన్నాగం బట్టబయలైంది. ఒకవేళ ఈ పాస్ పుస్తకాల కరెక్షన్ పూర్తయి ఉంటే బ్యాంక్‌లో రుణాలకు దళారులు దరఖాస్తు చేయించేవారని పేర్కొం టున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో అనుమానితులు ఈ వ్యవహారానికి సంబంధించి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకొందరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై ఎంబాడి సత్యనారాయణ నకిలీ పాసుపుస్తకాల త యారీ ముఠాపై కూపీ లాగుతున్నారు. విచారణలో అనుమానితులు అందించే సమాచారం ఆధారంగా ముఠా సభ్యులకు సహకరించిన పలువురు రెవెన్యూ సిబ్బంది వివరాలు కూడా వెలుగుచూడనున్నట్లు సమాచారం. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని గిరిజన తండా కేంద్రంగా నకిలీ పాసు పుస్తకాలను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ, కంప్యూటర్ పహా ణీల కరెక్షన్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఇటువంటి బాగోతాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. -
‘నోషనల్’ బాధితులు 20 వేల మంది
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ రికార్డుల ప్రకారం నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన రైతులు జిల్లాలో దాదాపు 20వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఖాతా నెంబర్లను రెవెన్యూ అధికారులు తాత్కాలిక ప్రాతిపదిక ఇస్తారు. ఈ నెంబర్లు ఉన్న భూములను రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వం అదేశించడంతో రైతుల్లో గగ్గోలు మొదలైంది. రిజిస్ట్రేషన్ తరువాత కొందరు పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి సందర్భాల్లో అధికారులు తాత్కాలికంగా 100000, 100001 అంకెల్లో నోషనల్ నెంబర్లు ఇస్తారు. భూముల వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నపుడు కూడాఇలా నెంబర్లు ఇస్తారు. అప్పటికప్పుడు పని జరగడానికి వీటిని ఇస్తారు. శాశ్వత ఖాతా నెంబర్లు 1 నుంచి 4 అంకెల్లోపు మాత్రమే ఉంటాయి. నోషనల్ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష నుంచి మొదలవుతాయి. మండలాల వారీగా ఆరా..! నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన భూములను రిజిస్ట్రేషన్లు నిర్వహించరాదని ఆదేశాలు వెలువడిన నేప«థ్యంలో మండలాల వారిగా వాటి వివరాలు సేకరిస్తున్నారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 20 వేల వరకు ఉన్నా.. గ్రామాల వారీగా ఎన్ని ఉన్నాయో లెక్కిస్తున్నారు. ఈ వివరాలు పక్కాగా వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపుతారు. -
లంచం తీసుకుని... పని చేయలేదు
పొలం పాస్‌బుక్ కోసం రూ.10 వేలు లంచం ఇచ్చినా. భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ. 5వేలు ఇచ్చినా.. పని కాలేదు. నవనిర్మాణ దీక్షల సదస్సులో ఓ మహిళ ఆవేదన ఆళ్లగడ్డ: నవనిర్మాణ దీక్షల సందర్భంగా మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన సదస్సులో విమలారాణి అనే మహిళ అధికారులకు షాక్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో అవినీతికి తావులేదని..ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా ఎటువంటి పనినైనా అధికారులు చేసి పెడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పటికి ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తనకు పాస్‌బుక్ రాలేదన్నారు. దీనికోసం రూ. 10 వేలు లంచం ఇచ్చానన్నారు. తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ. 5వేలు ఇచ్చినా పనికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పనీ సక్రమంగా కానప్పుడు ఇలాంటి సమావేశాలు ఎందుకని అధికారులను ఆమె నిలదీశారు. దీంతో సమావేశానికి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కొందరు మహిళా అధికారులు చప్పట్లు కొట్టి ఆమె సంఘీభావం తెలపడంతో అధికారులు తెల్లబోయారు. తహశీల్దార్ స్పందించి.. సమస్యను పరిష్కరిస్తామని చెప్పి.. కొంచం సేపటికి వర్షం వస్తోందని వెంటనే సమావేశాన్ని ముగించారు. అంతకు ముందు ఎవరైనా మాట్లాడవచ్చని అధికారులు చెప్పడంతో సీపీఐ నాయకులు మాట్లాడుతామని లేచారు. ప్రభుత్వ పథకాలపై మంచిగా మాట్లాడాలి తప్ప విమర్శించ కూడదని నిబంధన పెట్టారు. మంచి పథకాలను అభినందిస్తాం తప్ప.. ఏమీ చేయని పథకాలపై పొగడమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. -
ఖాళీ ఉంటే..కబ్జానే..!
► పాస్‌బుక్‌లున్నా మారుతున్న పేర్లు ► వేములవాడలో ‘రియల్’ కబ్జాలు ► అంతా అధికారుల కనుసన్నల్లోనే..! వేములవాడ రూరల్ : మీ స్థలాలు మీ పేరుమీదనే ఉన్నాయనే నమ్మకంతో ఆ స్థలాలను చూడకుండా కొన్నిరోజులపాటు నిశ్చింతంగా ఉంటే మీకు తెలియకుండానే అవి ఇతరుల పేర్ల మీదకు మారిపోతాయి. మీ కాగితాలు ఇంట్లో ఉన్నా... బ్యాంకుల్లో కుదబెట్టినా.. ఆ స్థలం మాత్రం ఇతరుల పేరుమీదకు మారుతూనే ఉంటా యి. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో వరుసగా జరగడంతో భూయజమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకున్న పాపానలేరు. ఇదీ రాజన్న క్షేత్ర పరిధిలో జరిగే రియల్ కృత్యాలు. వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేసిన భూయజమానులు వారి స్థలాలు ఇతరుల పేరుమీదుగా మారడంతో లబోదిబోమంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో వేములవాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులు తమ స్థలాలు తమ పేరుమీదనే ఉండి ఆ పాస్‌బుక్కులు బ్యాంక్‌లో ఉన్నప్పటికీ తమకు తెలియకుండా ఇతరులు కాజేశారంటూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వేములవాడ పట్టణంలోని జగిత్యాలకు వెళ్లే బస్టాప్ వద్ద ఒక ముస్లిం కుటుంబం కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆ స్థలాన్ని ఒక రియల్టర్ కొనుగోలు చేసి అందులో పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సదరు బాధితులు వెళ్లి నిలదీయగా తాను కొనుగోలు చేశానని కాగితాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డా డు. ఈ విషయంపై బాధితులు రెవెన్యూ అధికారి కార్యాలయూనికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. మండలంలోని తిప్పాపురం గ్రామంలో ఉన్న ఒక స్థలాన్ని కొందరు నాయకుల అండతో అధికారుల ప్రోద్బలంతో కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన సంఘటనలూ ఉన్నాయి. దీంతోపాటు ఒక ఆశ్రమ స్థలాన్ని ఇటీవల కొందరు నాయకులు కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ మండలం దినదినాభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంపై కొంతమంది రియల్ కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోవడంతో స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. కబ్జాదారులకు అధికారుల అండ..? వేములవాడ మండలంలో భూకబ్జాదారులకు కొంతమంది ప్రభుత్వ అధికారుల అండతోనే వారి ఆగడాలకు అంతులేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న భూముల వివరాలను భూకబ్జాదారులకు సమాచారం అందిస్తున్న కొంతమంది అధికారులు ముందస్తుగానే ముడుపుల వ్యవహారం మాట్లాడుకుని వారికి పూర్తిగా సహకరిస్తున్నార ని తెలిసింది. కొన్నేళ్లుగా ఎలాంటి కబ్జాలు లేని ఈ మం డలంలో ఈ మధ్యకాలంలో నెలకోటి కబ్జాల పర్వం వెలుగులోకి వస్తోంది. స్థలాలను పోగొట్టుకున్న బాధితులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నా వారు స్పం దించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇలాంటి వాటిపై పూర్తిగా విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
పాస్‌బుక్ జిరాక్స్ ఇతరులకు ఇచ్చాడని..
- బ్యాంక్ మేనేజర్‌పై చేయి చేసుకున్న రైతు - పోలీసులకు ఫిర్యాదు - ఆందోళనకు దిగిన అన్నదాతలు - క్షమాపణ చెప్పిన మేనేజర్ - నవాబుపేటలో ఘటన నవాబుపేట: బ్యాంకులోని తన పాస్‌పుస్తకం జిరాక్స్ ఇతరులకు ఎందుకిచ్చారని ఆగ్రహానికి గురైన ఓ రైతు మేనేజర్‌పై చెప్పుతో దాడిచేశాడు. మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం మేనేజర్ క్షమాపణ కోరడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన శుక్రవారం నవాబుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం లో దాతాపూర్ గ్రామానికి చెందిన రైతు బాల్రెడ్డికి కొంతపొలం ఉంది. అందులోని 200 గజాలను యావాపూర్‌కు చెందిన శ్రీశైలంకు విక్రయించాడు. సదరు భూమిలో శ్రీశైలం ఇటీవల ఓ భవనం నిర్మించి ఎస్‌బీహెచ్‌కు అద్దెకు ఇచ్చాడు. ఇదిలా ఉండగా, బాల్‌రెడ్డి తన పట్టా పాస్‌పుస్తకాన్ని తనఖా పెట్టి బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. ఈ నెల4న బాల్‌రెడ్డి పాస్‌బుక్ జిరాక్స్ కాపీని బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ యావాపూర్ గ్రామానికి చెందిన కావలి నర్సింలుకు ఇచ్చా డు. ఇటీవల ఈ విషయం బాల్రెడ్డికి తెలిసిం ది. ఈవిషయాన్ని తేల్చుకునేందుకు ఆయన రెండు రోజులుగా బ్యాంకుకు వెళ్లినా మేనేజర్ విధులకు రాలేదు. దీంతో బాల్‌రెడ్డి తిరిగి శుక్రవారం బ్యాంకుకు వెళ్లి తనకు తెలియకుండా తన పాసుపుస్తకం జిరాక్సు ఇతరులకు ఎందుకిచ్చారని మేనేజర్ శ్రీనివాస్‌ను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన బాల్‌రెడ్డి మేనేజర్‌పై చెప్పుతో దాడి చేశాడు. వెంటనే మేనేజర్ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు వద్దే ఉన్న సుమారు 50 మంది రైతులు, ఖాతాదారులు రైతుకు మద్దతుగా నిలిచారు. రైతుకు తెలియకుండా పాస్‌బుక్ జిరాక్స్ కాపీని ఇతరులకు ఎందుకు ఇచ్చారని నిలదీసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజర్ శ్రీనివాస్‌కు రైతులంటే చులకన, ఆయన బ్యాంకుకు వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు రైతులను సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. మేనేజర్ ఇక్కడ పనిచేసేందుకు వీలు లేదని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేసి కొత్త మేనేజర్‌ను నియమించాలని డిమాండు చేశారు. దీంతో మేనేజర్ శ్రీనివాస్ ఆందోళన చేస్తున్న రైతులు, ఖాతాదారులను సముదాయించారు. పొరపాటు జరిగింది క్షమించాలని కోరాడు. బాల్రెడ్డికి తెలియకుండా ఆయన పాసుపుస్తకం జిరాక్సు కాపీని ఇతరులకు ఇవ్వడం పొరపాటేనని అంగీకరించారు. దీంతో రైతులు, ఖాతాదారులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇరువర్గాల వారు పోలీసులకు మొదట ఫిర్యాదు చేశారు. అనంతరం రాజీకి వచ్చారు. -
పాస్‌పుస్తకం కోసం సచిన్ దరఖాస్తు
తడ: భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలంలోని తన పొలానికి సంబంధించిన పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. కాదలూరు రెవెన్యూ పరిధిలోని అపాచి బూట్ల పరిశ్రమ ఎదుట 2006లో తన రెండెకరాల పొలానికి సంబంధించి మీసేవా కేంద్రం లో సచిన్ పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ నంబర్ లేకపోవడంతో సిబ్బంది దరఖాస్తును స్వీకరించలేదని తెలిసింది. దీంతో సచిన్ తరఫు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలసి విషయం వివరించారు. ప్రస్తుతం పాస్‌పుస్తకం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
కాలనీ తాకట్టుపై విచారణ
కావలి: కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీ-బీ కాలనీకి నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి బ్యాంకులో రుణం తీసుకున్న సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు అదేశించారు. దీంతో దీనిపై కొండాపురం రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ‘కాలనీని తాకట్టుపెట్టారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. సమగ్ర విచారణ జరపాలంటూ తహశీల్దార్‌ను ఆదేశించారు. కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీకాలనీలోని సర్వేనెంబర్ 266/2లో ప్రభుత్వం 7.58 ఎకరాలను 1997లో 60 మంది ఎస్సీలకు నివాస స్థలాలను ఇచ్చారు. అదే స్థలాన్ని రవి, హజరత్ అనే వ్యక్తులు నకిలీ పాస్‌బుక్‌లు తయారుచేసి కలిగిరి, కొండాపురం మండలంలోని పలు బ్యాంకుల్లో రూ. 6.50 లక్షల రుణాలను తీసుకున్నారు. బ్యాంకుల్లో ఆధార్‌కార్డు అనుసంధానంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాలనీవాసులు కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిందిగా జేసీ ఆదేశాలిచ్చారు. జేసీ ఆదేశాలతో కొండాపురం తహశీల్దార్ ప్రమీల ఆకాలనీని పరిశీలించారు. ఆకాలనీ సర్వే నంబర్‌తో రుణం తీసుకున్న బ్యాంకులకు వివరాల కోసం రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు గురువారం వెళ్లారు. రుణం పొందేందుకు ఏయే పత్రాలు ఇచ్చారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆ భూమిని హజరత్, రవిల పేరున అడంగళ్ ఏ సంవత్సరంలో వచ్చింది, అందులో పాత్రధారులు ఎవరనే దానిపై వారు విచారణ చేస్తున్నారు. దీనిపై కొండాపురం తహశీల్దార్ ప్రమీల మాట్లాడుతూ జేసీ ఆదేశాలతో కాలనీ తాకట్టుపై విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణకు సంబంధించి నివేదికను ఆర్డీఓ ద్వారా జేసీకి పంపుతామన్నారు. -
రోజుకో మాట పూటకో నిబంధన
అందరిలో అయోమయం జాబితా రూపకల్పనలో బ్యాంకర్లకు తలనొప్పులు కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం పాస్‌పుస్తకం ఉంటేనే రుణమాఫీ రుణమాఫీ విషయంలో పూటకోమాట మారుస్తున్న ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మాటమాటకు మారుతున్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా పరిణమిస్తుండగా.. కౌలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరువూరు : రుణమాఫీ అమలులో జరుగుతున్న జాప్యం రైతులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత తక్కువమంది రైతులకు, డ్వాక్రా మహిళలకు మాత్రమే మాఫీ ద్వారా ప్రయోజనం కలిగేలా నిబంధనలను రోజురోజుకు కఠినతరం చేస్తున్న ప్రభుత్వవైఖరిని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రుణమాఫీ వర్తింపజేసే ప్రక్రియ బ్యాంకర్లకు సైతం తలనొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గంలోని జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో గత 2 నెలలుగా రుణమాఫీ కోసం జాబితాలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతున్నారు. రాత్రింబవళ్ల కష్టపడి రూపొందిస్తున్న జాబితాలను హఠాత్తుగా విడుదలవుతున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పదేపదే మార్పు చేయాల్సి రావడంతో పని మళ్లీ మొదటికొస్తోంది. కఠినతరమవుతున్న నిబంధనలతో కనీసం 20శాతం మంది కూడా లబ్ధిపొందే సూచనలు కనిపించడం లేదని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. పాస్ పుస్తకం ఉంటేనే మాఫీ... రైతులకు సైతం పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉంటేనే మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో భూమి దస్తావేజులపై సైతం రుణాలు పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ శాఖ జాప్యం చేస్తుండడంతో సగానికి పైగా రుణమాఫీ భారం ప్రభుత్వానికి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను నట్టేట ముంచేలా ఉందని వివిధ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మాఫీ వర్తించని కౌలురైతు గ్రూపులు... గతంలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన కౌలు రైతులకు మాఫీ వర్తింపజేసే అవకాశం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కౌలురైతు రుణ అర్హతా కార్డులు కలిగి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన కౌలుదార్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉండటంతో కౌలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. గత 3 సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో 6వేల మంది కౌలుదార్లను గుర్తించిన ప్రభుత్వం కేవలం 2వేల మందికి మాత్రమే రుణ అర్హతా కార్డులు అందజేసింది. వీరిలో 800 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది. కాలయాపనకే కమిషన్ రుణమాఫీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతుల్ని మోసగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేని రుణమాఫీ వర్తింపజేయాలి. - శీలం నాగనర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ తిరువూరు మండల కన్వీనర్ కంటితుడుపు చర్య రకరకాల ప్రకటనలతో రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం నీరుగారుస్తోంది. బ్యా ంకర్లకు సైతం అర్థంకాని రీతిలో నిబంధనలను రూపొందిస్తూ రైతులకు కంటితుడుపు చర్యగా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రయత్నిస్తోంది. - సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు, తిరువూరు -
మాఫీకి మంగళం!
పెదబయలు: రుణమాఫీ పథకం మన్యంలోని 11 మండలాల రైతులకు వర్తించకుండా పోయే ప్రమాదం తలెత్తింది. మండలానికి ఒకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. పాడేరు, పెదబయలు, హుకుంపేట, జి. మాడుగులు, ముంచంగిపుట్టు, అరకు, అనంతగిరి, గుంటసీమ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు పీఎసీఎస్‌లలో సుమారు 5500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రుణమాఫీ కోసం రెండు నెలలుగా రైతుల పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లతో కూడిన జాబితాను పీఏసీఎస్‌ల ద్వారా సేకరించి డీసీసీబీకి అందజేశారు. వీటిని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించారు. అయితే రైతు పట్టాదారు పాసుపుస్తకం సర్వే నంబర్లు ఎర్రర్, డూప్లికేట్ అని చూపించి, ఆన్లైన్లో తీసుకోవడం లేదని అర్జీలు తిప్పి పంపారు. సరైన సర్వే నంబర్లుతో జాబితా సమర్చించాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. దీంతో మన్యంలో 5500 మంది గిరిజన రైతులకు రూ.6 కోట్లు రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే రెవెన్యూ అధికారులిచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లు ఆన్లైన్లో తీసుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ వస్తోందని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్థానిక పీఏసీఎస్ కార్యదర్శి వై. రాంబాబును వివరణ కోరగా పెదబయలు సంఘం నుంచి 297 మంది రైతుల జాబితా రుణమాఫీకి సర్వే నంబర్లు పంపామన్నారు. సర్వే నంబర్లు తప్పుగానే ఆన్లైన్లో చూపడంతో వెనక్కి పంపారని, 11 మండలాల జాబితా తిరస్కరించారని తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాలను పరిశీలించి తమకు రుణమాఫీ అయ్యేలా చూడాలని గిరి రైతులు కోరుతున్నారు. -
‘రీషెడ్యూల్’ నిబంధనలతో శాపం
రుణమాఫీ జాబితా గందరగోళం లబోదిబోమంటున్న రైతాంగం సత్తుపల్లి : రుణమాఫీ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నీటిమూటైంది. రుణమాఫీ జాబితాల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటంతో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత పంచాయతీ కార్యాలయంలోని నోటీస్‌బోర్డులో ప్రదర్శించారు. పలుచోట్ల అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటం రైతులను విస్మయానికి గురిచేసింది. పాస్‌పుస్తకం పెట్టి రుణం తీసుకున్నవారి పేర్లు కూడా జాబితాలో లేకపోవటంతో రైతులు బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానంతో కంగుతినాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. 01-02-2014 నుంచి 31-03-2014 వరకు జరిగిన రీషెడ్యూల్స్ మాత్రమే రుణమాఫీ జాబితాలో చేర్చాలని, జల్, నీలం, పైలిన్ తుపానులకు నష్టపోయిన వారిని రీషెడ్యూల్ జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 శాతం మంది రైతులు ఈ నిబంధనలతో రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. అగ్రికల్చరల్ టర్మ్లోన్లు.. వ్యవసాయ రుణాలను దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాతిపదికన ఇస్తారు. వీటినే అగ్రికల్చరల్ టర్మ్లోన్లు (సీసీఏటీఎల్)గా పిలుస్తారు. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కనీసం ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ప్రతి ఏడాది కొంతమొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. 2010లో జల్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి ప్రభుత్వం బుక్ అడ్జస్టుమెంట్ పేరుతో రుణాలను రీషెడ్యూల్ చేసింది. దీంట్లో వ్యవసాయ పనిముట్లతో పాటు పంటరుణాలు కూడా ఉన్నాయి. లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పంటరుణాలు రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ బ్యాంకర్లను ఆదేశించడంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆందోళనపథంలో.. రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చకపోవటంపై రైతాంగం ఆందోళన బాటపట్టింది. సోమవారం బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు పరుగులు తీశారు. ప్రభుత్వం అర్హులను రుణమాఫీ జాబితాలో చేర్చకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రుణమాఫీలో చోటులేదు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 16-07-2010న రెండు ఎకరాల పాతిక సెంట్ల పొలం పాసుపుస్తకాన్ని తనఖా పెట్టి రూ.40వేలు రుణం తీసుకున్నాను. జల్, లై లా తుపానులతో ఆ ఏడాది పంట దెబ్బతింది. 2010లో రుణాన్ని బ్యాంకర్లు రీషెడ్యూల్ చేశారు. 2011లో వర్షాభావ పరిస్థితులతో పంట వేయలేదు. 2012లో నీలం తుపానుతో నష్టపోయాను. అప్పటి నుంచి బయట అప్పులు తీసుకొచ్చి పంట వేశాను. రూ.40వేల అప్పు, వడ్డీతో కలిపి రూ.65వేలు అయింది. పంటరుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశతో ఉంటే తీరా ఇప్పుడు రీషెడ్యూల్ జాబితాలో నాపేరు లేదు. ఏమి చేయాలో అర్థంకావట్లేదు. - సూరనేని పురుషోత్తం, రైతు, బుగ్గపాడు, సత్తుపల్లి -
పాస్బుక్ల సవరణలో ఫెయిల్
పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు తీవ్ర జాప్యం నెలలు తరబడి కొనసాగుతున్న రెవెన్యూ నిర్లక్ష్యం 757 దరఖాస్తులలో ఇప్పటికి రెండింటికే మోక్షం విశాఖ రూరల్ : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ ప్రక్రియ నత్తను మరిపిస్తోంది. దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా.. సవరణలకు నోచుకోక పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను పౌర సేవల పత్రం ప్రకారం 15 రోజుల్లో సరిచేయాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇందుకు సవరణకు నోచుకున్న గణాంకాలే నిదర్శనం. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల కారణంగా భూ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిదిద్దడంతో పాటు మార్పులు, చేర్పులకు ఏడాది క్రితం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ద్వారా పాస్‌పుస్తకాల్లో సవరణలతో పాటు, పట్టా సబ్ డివిజన్, ఫసలీలో అనుభవదారుని పేరు మార్పునకు వెసులుబాటు కలిగింది. 757 దరఖాస్తులు.. : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో సవరణల కోసం ఇప్పటి వరకు 757 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 16 దరఖాస్తులను తిరస్కరించగా, కేవలం రెండింటిలో మాత్రమే సవరణలు చేయడం గమనార్హం. కొత్త సాఫ్ట్‌వేర్‌లో మూడు కేటగిరీలుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. కొత్త పట్టాదారుపాస్పుస్తకాల మంజూరు, పాస్‌బుక్ రీ ప్లేస్మెంట్, డూప్లికేట్ పాస్‌బుక్ కింద ఈ సేవలను అందిస్తున్నారు. కొత్త పాస్‌పుస్తకాల కోసం 539 మంది దరఖాస్తు చేసుకోగా ఏడింటిని తిరస్కరించగా, ఒక పాస్‌బుక్ మాత్రమే మంజూరు చేశారు. పాస్‌బుక్ రీప్లేస్‌మెంట్‌కు 152 దరఖాస్తులు రాగా ఏడింటిని తిరస్కరించగా ఒక్క పాస్‌పుస్తకాన్ని కూడా ఇవ్వలేదు. డూప్లికేట్ పాస్‌పుస్తకం కోసం 55 మంది దరఖాస్తు చేయగా రెండింటిని తిరస్కరించారు. కేవలం ఒకరికి మాత్రమే డూప్లికేట్ పాస్‌బుక్ ఇచ్చారు. 60 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉండగా.. పట్టాదారు పాస్‌పుస్తకంలో పట్టాదారుని పేరు గాని, అతని తండ్రి పేరు గాని, లేదా ఇతర వివరాలు తప్పుగా వస్తే మార్పు చేసుకోడానికి మీ-సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూక్రయవిక్రయాల ద్వారా ఒకరి పేరున ఉన్న పాస్‌పుస్తకాన్ని మరొకరి పేరున మార్పు చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. తప్పుల సవరణకు రూ.35, కొత్త పట్టాదారుపాస్ పుస్తకానికి రూ.135, డూప్లికేట్ పాస్‌పుస్తకానికి రూ.235, పాస్‌పుస్తకంలో పేరు మార్పునకు రూ.135 మీ-సేవా కేంద్రాల్లో చెల్లించాలి. తప్పుల సవరణకు 15 రోజులు పడుతుంది. పేరు మార్చడానికి(మ్యుటేషన్) 60 రోజులు పడుతుంది. పట్టాదారుడు దరఖాస్తు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి పట్టామార్పునకు సంబంధించిన నోటీసులు గ్రామ చావడిలో పెడతారు. అభ్యంతరాలు రానిపక్షంలో కొత్త వారి పేరుమీద పాస్‌పుస్తకం ఇవ్వాలి. కానీ నెలలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు పరిష్కారం లభించడం లేదు. మ్యుటేషన్ తరువాత కొత్త పాస్‌పుస్తకం మంజూరుకు ప్రస్తుతం అవకాశం లేదు. సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. గతంలో సమ్మెలు, ఎన్నికల కారణంగా జాప్యం జరిగిందంటున్నారు. సవరణలకు అవకాశం ఉన్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. -
కౌలు రైతుల మైండ్ బ్లాక్
►రుణమాఫీకి బాబు సర్కారు భారీ మెలిక ►పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీలు ►అదెలా సాధ్యమని ప్రశ్నిస్తూగొట్టిపాడులో ఆందోళన ►పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీ... ►ఆ తరువాత ఒరిజినల్ తప్పనిసరి : సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ప్రత్తిపాడు: పంట రుణాలు మాఫీ అవుతాయని ఆశల పల్లకిలో విహరిస్తున్న కౌలు రైతులకు బాబు సర్కా రు దిమ్మ తిరిగే మార్గదర్శకాలతో షాక్ ఇచ్చింది. ఒకే సర్వే నంబరులో ఉన్న పంట పొలానికి భూ యజమానితో పాటు కౌలు రైతు బంగారు రుణం తీసుకున్నట్లయితే కౌలు రైతుకే లబ్ధిచేకూర్చాలని తాజాగా బ్యాంకర్లకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలంటూ మెలిక పెట్టారని కౌలు రైతులు వాపోతున్నారు. ►ఈ నిబంధనను నిరసిస్తూ గురువారం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట కౌలు రైతులు ఆందోళన చేశారు. ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ రుణమాఫీ అంటూ ఓటర్లను ఆకర్షించిన చంద్రబాబు ఇప్పుడు ఇలా కొర్రీలు పెట్టడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ►బ్యాంకర్లు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు కాపీ అడుగుతున్నారని, రుణమాఫీ నాటికి ఒరిజనల్ పట్టాదారు పాస్ పుస్తకం కావాలని, లేకుంటే రుణమాఫీ వర్తించదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు భూ యజమా ని పొలం కౌలుకు ఇవ్వడమే కష్టంగా మారిందని, అలాంటపుడు పాస్ పుస్తకాలు అందు లోనూ ఒరిజినల్స్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ►ఇదిలా ఉంటే బ్యాంకర్లు మరో అడుగు ముందుకు వేసి కౌలు రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా జిరాక్సు కాపీ తీసుకువచ్చేటప్పుడు దానిపై పట్టాదారు సంతకం (రుణమాఫీకి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని) కూడా తీసుకోవాలంటూ చెబుతుండటంతో కౌలు రైతులు డోలాయమానంలో పడుతున్నారు. పాస్ పుస్తకాలు కావాలంటున్నారు ... గత ఏడాది ఎకరన్నర పొలం కౌలుకు సాగు చేశాను. బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ. 80 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఆ రుణం మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలంటున్నారు. లేకుంటే రుణమాఫీ వర్తించదని చెబుతున్నారు. భూ యజమానులు పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు. అంతా గందరగోళంగా ఉంది. - మేడా కోటేశ్వరి, గొట్టిపాడు పుస్తెలు తాకట్టు పెట్టాం... పుస్తెలు తాకట్టు పెట్టి మరీ కౌలుకు పొలం చేశాం. మొన్నటిదాకా బంగారంపై రుణాలు పోతాయని ఆశపడ్డాం. ఇప్పుడు పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీ పెట్టారు. సొంత పొలాల్లేని మాకు పాస్ పుస్తకాలు ఎక్కడ నుంచి వస్తాయి. రైతులకు రుణాలు ఉన్నప్పుడు, మాకు పాస్ పుస్తకాలెందుకు ఇస్తారు. - కుంభా వీరరాఘవమ్మ, మారెల సుబ్బాయమ్మ, గొట్టిపాడు. పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి ... కౌలు రైతులు బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే ఇప్పుడు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు ఇవ్వమంటున్నాం. మాఫీ నాటికి ఒరిజినల్ పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకువస్తే అందులో రుణమాఫీ అయినట్లు నమోదు చేస్తాం. ఏదిఏమైనా పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరి. ఒకే సర్వే నంబరులో కౌలు, రైతు భూ యజమాని బంగారంపై రుణం పొంది ఉంటే అందులో కౌలు రైతుకే మాఫీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. - అమిత్‌కుమార్, మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గొట్టిపాడు. -
రుణం.. రణం..
కొత్తప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న రైతాంగం ఇప్పుడు నైరాశ్యంలో పడింది. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 2013-14 ఏడాదికాలానికి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ‘ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య..ఓడ దిగాక బోడ మల్లయ్య’ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో నాలుగేళ్లుగా పంటలు పండక రెన్యూవల్, బుక్అడ్జస్టుమెంట్లు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటని విపక్షాలు, రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: కొత్త ప్రభుత్వం వస్తే రుణమాఫీ వస్తుందనుకున్న రైతుల ఆశలు ఇప్పుడు అడియాశలే అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్..అధికారంలోకి రాగానే మెలిక పెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. కేవలం గత సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళన కు దిగారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు కూడా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బక్కరైతు బిక్కు బిక్కు నిన్నటి వరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాట మార్చడంతో సన్నచిన్నకారు రైతులే తీవ్రంగా నష్టపోనున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ భారీగా తోడవడంతో అప్పులు ఏలా తీర్చాలని బక్కరైతులు బిక్కు బిక్కు మంటున్నారు. జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 4,021 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వీటిలో 3.80 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రూ.2,682 కోట్లు ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టి పాస్బుక్ఆధారంగా తీసుకున్న రుణాలు రూ.486 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ కేటగిరీల కింద రైతులు రూ.853 కోట్ల రుణాలు పొందారు. 2013-14లో రూ.2,455 కోట్ల రుణాలను వివిధ కేటగిరీల కింద రైతులు తీసుకున్నారు. పంటరుణాలుగా రూ.1706 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి పాస్‌బుక్ ఆధారంగా రూ.385 కోట్లు, వివిధ కేటగిరీల కింద రూ.364 కోట్ల రుణాలను రైతులు పొందారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తే జిల్లాలోని సుమారు మూడు లక్షల మంది రైతులకు చెందిన రూ.3వేల కోట్లు మాఫీ అవుతాయి. అలాకాకుండా కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ప్రకారం 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 జూన్ వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తే.. జిల్లాలో కేవలం రెండు లక్షల మంది రైతులకు చెందిన రూ. 900 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలు నిలువునా ఎండిపోవడం, నీటిపాలు కావడం చూశాం. కుటుంబం గడవలేని స్థితిలో ఉన్న రైతులు అప్పులు చెల్లించలేదు. కేవలం పెద్ద రైతులు మాత్రమే అప్పులు చెల్లించటం, రెన్యూవల్స్ చేయించటం వంటివి చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం బక్క రైతులకు కాకుండా ధనిక రైతులే అధికంగా లాభం పొందే అవకాశం ఉంది. ఆందోళనల బాటలో అన్నదాతలు.. గద్దెనెక్కక ముందు ఓ మాట..ఆ తర్వాత మరో మాట కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ జిల్లాలోని రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం జిల్లాలోని ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనకు సిద్ధం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసేందుకు శుక్రవారం అన్ని రాజకీయపక్షాల రైతుసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ముంపు మండలాల రైతులపై వీడని సందిగ్ధత.. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో తీసుకున్న నిర్ణయం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతానికి వర్తింస్తుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు సీమాంధ్రలో కలిస్తే అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలి. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడినప్పటికీ..ఇక్కడి రైతుల రుణాల విషయంలో మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు చాలామంది భూములు కౌలుకు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. జిల్లాలో 70 వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. యేటా మే చివరి వారం నుంచి వారికి కూడా సాధారణ రైతుల్లాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ మొదటి వారం పూర్తికావస్తున్నా ఇంతవరకు అటు సాధారణ రైతులు, ఇటు కౌలు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలోనే ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయిన ప్రభుత్వం కొత్త రుణాల విషయాన్ని ఇంకా ఎంతకాలం నాన్చుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం గ్రామాల్లో వాస్తవంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారనే విషయమై క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయాలి. కానీ దీనిపై రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు లేవు. మేనెల రెండోవారంలోపే కౌలు రైతులను గుర్తించాలి. అనంతరం వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. గత ఏడాది పాలేరు నియోజకవర్గంలో రెండువేల మంది కౌలు రైతులను గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులు కూడా మంజూరు చేశారు. వారిలో కేవలం 500 మందికి కూడా బ్యాంక్‌ల్లో రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు కొర్రిలు పెట్టడం సర్వ సాధారణమైంది. ‘ఏ ఆధారం చూసి మీకు అప్పు ఇవ్వాలి? ఈ భూమిపై మీకేం హక్కు ఉంది? తీసుకున్న రుణం ఎలా తీర్చుతావు? కాబట్టి రుణం ఇవ్వడం కుదరదు..’ అంటూ బ్యాంకర్లు కొర్రీలు పెడుతుండటంతో కౌలు రైతులు వ్యవసాయ రుణానికి నోచుకోవడం లేదు. -
పాస్‌పుస్తకాల కోసం పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఒకవేళ పాస్ పుస్తకం ఉన్నా టైటిల్ డీడ్ ఇచ్చేందుకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరి స్థితి ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివి జన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కొందరు రైతులు రెండేళ్ల క్రితం నుంచి టైటిల్‌డీడ్ కోసం వీఆర్వో ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను పలుమార్లు అడిగినా ‘ఆర్డీఓ సార్ సంతకం కాలేదు’ అనే సమాధానం వస్తోందని అంటున్నారు. అడిగినంత ఇచ్చినా... రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి అక్రమ ఆదాయ వనరు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయా గ్రామాలు, మండలాల్లో భూమి రేటును బట్టి ఎకరానికి ఇంత అని వీఆర్వోలు ధర ఖరారు చేసి మరీ వసూలు చేసుకుంటారు. ప్రస్తుతం హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, వర్ధన్నపేట తదితర మండలాల పరిధిలో కొన్నిచోట్ల పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు మార్కెట్ ధర ఉన్నచోట తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధికారులు అడిగినంత ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అయితే ఇంతచేసినా పనులు సకాలంలో కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటాల్లో తేడాల వల్ల...? సహజంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసే క్రమంలో రెండు పుస్తకాలు ఇస్తారు. ఇందులో ఒకటి స్థానిక తహసీల్దార్ సంతకంతో ఉంటుంది. రెండోది ఆర్డీఓ సంతకంతో ఉంటుంది. దీనినే టైటిల్ డీడ్ లేదా భూమి హక్కుపత్రం అంటారు. ఇది జారీ చేయడానికి అనధికారికంగా ఆర్డీఓ కార్యాల యాల్లో రూ.300 వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తం కూడా వీఆర్వోలు సంబంధిత రైతుల నుంచి వసూలు చేసి ఇచ్చేవారు. అయితే ముందుగా తహసీల్దార్ నుంచి వచ్చే పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చి టైటిల్ డీడ్ కోసం కొంత సమయం కేటాయించేవారు. ఎందుకంటే.. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పుస్తకాలు ఆర్డీఓలు చూడాలి. కాబట్టి వారికి సందేహాలు ఉన్నచోట పరిశీలన చేసి మరీ జారీ చేసేవారు. ఇయితే క్రమంగా ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో కొన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో ఒక్కో పుస్తకానికి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వీఆర్వోలు ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వెరశి ఆర్డీఓ కార్యాలయానికి సంతకం కోసం వెళ్లిన పుస్తకాలు ఏళ్లు గడుస్తున్నా అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇదేమిటని నిలదీసిన రైతులకు ఏదో ఒక కొర్రీవేసి పనులు చేయకుండా వేధిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అవస్థలు రైతులు తమ పాస్‌పుస్తకాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటారు. గతంలో కేవలం ఒకే పుస్తకంతో రుణం ఇచ్చిన బ్యాంకర్లు కొంతకాలంగా టైటిల్ డీడ్ కూడా ఉంటేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు. అయితే వేల సంఖ్యలో పుస్తకాలు ఆర్డీఓ కార్యాలయాల్లో ఉండటంతో రైతులు రుణం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణం మంజూరు అయిన వారు కూడా టైటిల్ డీడ్ లేక పొందలేక పోతున్నామంటున్నారు. వరంగల్ డివిజన్‌లోనే వేలల్లో... జిల్లా మొత్తంగా సమస్య ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమస్య తీవ్రత ఎక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్ల నుంచి టైటిల్ డీడ్ కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల నుంచి మొత్తం 2వేల పుస్తకాల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఆర్ఓఆర్పై నిషేధం ఉన్న సాకుతో అధికారులు అన్నింటినీ అదేగాటన పెట్టి కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తిచేస్తే చేస్తే కనీసం బ్యాంకు రుణాలైనా పొందే అవకాశం ఉంటుంది.