నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం పట్టివేత | duplicate pass book pattiveta | Sakshi
Sakshi News home page

నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం పట్టివేత

Published Tue, Oct 4 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

duplicate pass book pattiveta

  • ఐదు నిమిషాలైతే  రూ.50 వేల చెల్లింపు
  • సమయస్ఫూర్తితో నకిలీదని గుర్తించిన అధికారులు
  • పరారైన నిందితుడు
  •  
    కురవి : రుణం కోసం వచ్చిన వ్యక్తి వద్ద అధికారులు నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న సంఘటన కురవిలోని ఆంధ్రాబ్యాంకులో  సోమవారం జరిగింది. కర్షక సేవా సహకార సంఘం ఎండీ గుగులోత్‌ సంతూలాల్‌ కథనం ప్రకారం..
    రాజోలు శివారు హరిదాసు తండాకు చెందిన రైతు దారవత్‌ రాము బలపాల గ్రామీణ వికాస బ్యాంకులో గతంలో తన పట్టాదారు పాస్‌పుస్తకాలు పెట్టి రుణం పొందాడు. అతడు అలాంటి పాస్‌పుస్తకాలనే మరో కాపీని తయారీ చేసి  ఇటీవల కురవిలోని కర్షక సేవా సహకార సంఘానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు వెంట నోఆబ్జక్షన్‌ సర్టిఫికేట్, పట్టాదారు పాసుపుస్తకాలు(సర్వే నంబర్‌ 257/ డీ1లో 36 గుంటలు, 488/ బీ 2లో ఎకరం 13 గుంటలు, 489/ బీలో 8 గుంటలు), రెండు, వన్‌  బీకి సంబంధించిన కంప్యూటర్‌ పహాణీలను జత చేశాడు. ఆ పాస్‌పుస్తకాల్లో గతంలో పనిచేసిన తహసీల్దార్‌  శ్రీనివాస్, కార్యదర్శి హరినాథ్‌బాబు సంతకాలను రాము ఫోర్జరీ చేసినట్లు కర్షక సేవా సహకార సంఘ ఉద్యోగి నర్సింహరెడ్డి గుర్తించారు. దరఖాస్తులో కూడా బలపాల గ్రామీణ వికాస బ్యాంకు ముద్ర ఉన్నప్పటికీ మేనేజర్‌ సంతకం లేకపోవడం.. పాత తహసీల్ధార్, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీగా కనిపించడంతో నకిలీ పట్టాదారు పాసు పుస్తకంగా గుర్తించినట్లు సంత్‌లాల్‌ వెల్లడించారు. వెంటనే రైతును పిలిచి ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అతడు పరారైనట్లు ఆయన తెలిపారు. నకిలీ పాస్‌పుస్తకం పెట్టి రుణం పొందాలని ఇలా చేశాడని, ఈ విషయమై కురవి పోలీసులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. మరో ఐదు నిమిషాలు గడిస్తే చెక్‌ ఇచ్చే వాడినని, కార్యాలయ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నర్సింహరెడ్డి సమయస్ఫూర్తితో నకిలీ పుస్తకంగా గుర్తించడంతో సహకార సంఘానికి నష్టం వాటిల్లకుండా ఉందని తెలిపారు. ఇదే విషయమై కురవి ఎస్‌సై అశోక్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement