సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : రైతులకు కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 58 లక్షల మందికి పంపిణీ చేయనున్నందున ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టదారులైన రైతులతోపాటు అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతర రైతులకూ కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల అధికార యంత్రాంగమంతా పూర్తి శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించి.. మే 10 నుంచి వారం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి.. ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
జాగ్రత్తగా వ్యవహరించాలి..
‘‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం మనం ఎత్తుకున్నాం. భూరికార్డులను సర్వే చేసి, కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరూ నిర్వహించలేదు. ఈ కార్యక్రమాలను మనమే రచించుకుని, అమలు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. నెలాఖరు వరకు పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయి. వాటిని జిల్లాల్లో భద్రపరిచి, గ్రామాలకు చేర్చాలి.
వెంటనే నగదు అందేలా ఏర్పాట్లు..
చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశాం. పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం రూ.12 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టుకున్నాం. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రూ.6 వేల కోట్లు సమీకరించాం. ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయి. రైతులు చెక్కు ఇచ్చిన వెంటనే బ్యాంకులు నగదు చెల్లించాలి. ఇందుకోసం కలెక్టర్లు వెంటనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. చెక్కులిచ్చిన రైతులకు వెంటనే నగదు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు ముందుగానే స్పష్టం చేయాలి.
పక్కా ప్రణాళిక ప్రకారం..
జిల్లాలకు వచ్చే పాస్ పుస్తకాలు, చెక్కులను కలెక్టర్లు పరిశీలించాలి. అన్ని గ్రామాల బుక్కు లు, చెక్కులు వచ్చాయో లేదో సరి చూసుకోవాలి. ప్రతి 300 పాస్ పుస్తకాల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,762 బృందాలను ఏర్పాటు చేయాలి. ఆయా గ్రామ రైతుల సంఖ్య ఆధారంగా ఎన్ని బృందాలు వేయాలనే విషయాన్ని కలెక్టర్లు నిర్ధారించాలి. ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులుండాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. పంపిణీ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. ఏ రోజు ఏ గ్రామంలో పంపిణీ ఉంటుందో ముందే నిర్ణయించి.. ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పేపర్లలో ప్రకటనల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈ వివరాలు తెలపాలి. గ్రామంలో పంపిణీ చేపట్టినప్పుడు ఎవరైనా చెక్కులు, పాస్‌బుక్‌లు తీసుకోకుంటే వారు తహసీల్దార్ కార్యాలయంలో పొందేలా ఏర్పాట్లు చేయాలి.
ఇబ్బందుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్..
పంపిణీ సందర్భంగా ఎక్కడైనా, ఏమైనా పొరపాట్లు జరిగినా, ఇబ్బందులు తలెత్తినా... వారి బాధ, సమస్య వినడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో పంపిణీ కార్య క్రమం నిర్వహించాలి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇక కొంత మంది రైతులు పెట్టుబడి సాయం వద్దని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. ఆ సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలి’’.
రైతులందరికీ పెట్టుబడి చెక్కులు
పట్టాదారులైన రైతులతోపాటు పేదలకు పంపిణీ చేసిన భూములను సాగుచేసుకుంటున్న రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న రైతులకు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి సాయం చెక్కులు అందివ్వాలి. ఎవరైనా రైతుకు రూ.50 వేలకన్నా ఎక్కువ సాయం అందించాల్సి వస్తే.. వారికి రెండు చెక్కులు ఇవ్వాలి. రూ.50 వేలలోపు మొత్తానికి ఒక చెక్కు, ఆపైన మొత్తానికి మరో చెక్కు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు, చెక్కులు పొందిన వారి నుంచి రసీదు తీసుకోవాలి.
నిస్పృహలో ఉన్న రైతులను ఆదుకొనేందుకే..
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. గిట్టు బాటు ధర రాక పంటలను రోడ్లపై పారబోసుకుంటున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టి లో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం అందరి ప్రశంసలు పొందుతున్నది. ప్రముఖ ఎకానమిస్ట్ అశోక్ గులాటి తెలంగాణ అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమని ప్రకటించారు. పంట పోయినా.. రైతులు నష్ట పోకుండా ఉంటా రు. కాబట్టే ఖర్చుకు వెనకాడకుండా రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున అందిస్తున్నాం. పంటల సాగులో అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర రావడానికి వీలుగా.. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. ఒక్కో క్లస్టర్లో ఒక రైతు వేదిక నిర్మిస్తున్నాం. వీటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment