సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం ద్వారా పంటల పెట్టుబడికి రైతులకు అందించే ఆర్థిక సాయం చెక్కులను వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పాస్ పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా అదే రోజు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోజుకో గ్రామం చొప్పున వారం రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సూచించారు. ఖరీఫ్ పంట కోసం ఎకరానికి రూ.4 వేల చొప్పున, రబీ పంటకు రెండో విడతగా మరో రూ.4 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చెక్కులిచ్చిన రైతులు డబ్బు తీసుకునేందుకు బ్యాంకుల్లో కావాల్సిన నగదు నిల్వలు ఉంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు.
మొత్తం 58 లక్షల చొప్పున పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యాచరణకు ఈనెల 21న ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బి.గణేశ్ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, పార్థసారథి, రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, భూ పరిపాలన విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు జరగొద్దు
దేశంలో మరెక్కడా లేనివిధంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అత్యంత చిత్తశుద్ధితో, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమకోర్చి భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని, దీని ఆధారంగా పాస్ పుస్తకాలు రూపొందించారని సీఎం చెప్పారు. వీటిని రైతులకు అందించటం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళనకు సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. అన్ని భూ వివరాలతో ‘ధరణి’వెబ్‌సైట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘రైతులు పంటల పెట్టుబడికి ఏటా ఎన్నో అగచాట్లు పడతారు. అప్పులకు తిప్పలు పడతారు. పంట చేతికి రాకపోతే పెట్టిన పెట్టుబడి నష్టపోతారు. దీంతో మరింత కుంగిపోతారు. ఈ దుస్థితిని నివారించడానికి, ఆర్థికంగా భారమైనప్పటికీ రైతులకు పంట పెట్టుబడి అందివ్వాలని నిర్ణయించాం. వర్షాకాలం పంట సీజన్ ప్రారంభం
కాకముందే ప్రభుత్వం అందించే సాయం వారి చేతిలో ఉండాలి. అప్పుడే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశాన్ని, రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’అని సీఎం పిలుపునిచ్చారు. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కార్యాచరణను వైద్య, ఆరోగ్య శాఖ రూపొందిస్తున్నదని చెప్పారు.
చెక్కుల పంపిణీ, పర్యవేక్షణ ఇలా..
మే 10న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, భూ పరిపాలన శాఖ డైరెక్టర్ వాకాటి కరుణతో కూడిన బృందం ప్రతీ రోజు నాలుగైదు జిల్లాల్లో పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పాస్ పుస్తకాలు, చెక్కులను ఆయా గ్రామాలకు చేర్చడంతోపాటు, అధికార బృందాలు ఏర్పాటు చేస్తారు.
కలెక్టర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈనెల 21న ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొంటారు. జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆహ్వానించారు.
ఏ గ్రామంలో ఏ రోజు పంపిణీ జరుగుతుందో కలెక్టర్లు నిర్ణయిస్తారు. పత్రికా ప్రకటనలు, ఇతర ప్రచార సాధనాలు, డప్పు చాటింపు, ఫ్లెక్సీలు తదితర మార్గాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.
ఆయా గ్రామాల పాస్ పుస్తకాల సంఖ్య ఆధారంగా ఏ గ్రామానికి ఎన్ని అధికారుల బృందాలను పంపాలనే దానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. 300 పాస్ పుస్తకాలకు ఒకటి చొప్పున బృందాన్ని నియమించి, ఒకే రోజు అందరికీ పంపిణీ చేస్తారు.
రైతులకు పాస్ పుస్తకం, చెక్కులు ఇచ్చి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ రోజు గ్రామంలో రైతులు లేకుంటే తర్వాత వాటిని మండల కార్యాలయంలో మూడు నెలల వరకు అందుబాటులో ఉంచి, అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment