- అందరిలో అయోమయం
- జాబితా రూపకల్పనలో బ్యాంకర్లకు తలనొప్పులు
- కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం
- పాస్‌పుస్తకం ఉంటేనే రుణమాఫీ
రుణమాఫీ విషయంలో పూటకోమాట మారుస్తున్న ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మాటమాటకు మారుతున్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా పరిణమిస్తుండగా.. కౌలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తిరువూరు : రుణమాఫీ అమలులో జరుగుతున్న జాప్యం రైతులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత తక్కువమంది రైతులకు, డ్వాక్రా మహిళలకు మాత్రమే మాఫీ ద్వారా ప్రయోజనం కలిగేలా నిబంధనలను రోజురోజుకు కఠినతరం చేస్తున్న ప్రభుత్వవైఖరిని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రుణమాఫీ వర్తింపజేసే ప్రక్రియ బ్యాంకర్లకు సైతం తలనొప్పిగా మారింది.
తిరువూరు నియోజకవర్గంలోని జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో గత 2 నెలలుగా
రుణమాఫీ కోసం జాబితాలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతున్నారు. రాత్రింబవళ్ల కష్టపడి రూపొందిస్తున్న జాబితాలను హఠాత్తుగా విడుదలవుతున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పదేపదే మార్పు చేయాల్సి రావడంతో పని మళ్లీ మొదటికొస్తోంది. కఠినతరమవుతున్న నిబంధనలతో కనీసం 20శాతం మంది కూడా లబ్ధిపొందే సూచనలు కనిపించడం లేదని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు.
పాస్ పుస్తకం ఉంటేనే మాఫీ...
రైతులకు సైతం పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉంటేనే మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో భూమి దస్తావేజులపై సైతం రుణాలు పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ శాఖ జాప్యం చేస్తుండడంతో సగానికి పైగా రుణమాఫీ భారం ప్రభుత్వానికి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను నట్టేట ముంచేలా ఉందని వివిధ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
మాఫీ వర్తించని కౌలురైతు గ్రూపులు...
గతంలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన కౌలు రైతులకు మాఫీ వర్తింపజేసే అవకాశం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కౌలురైతు రుణ అర్హతా కార్డులు కలిగి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన కౌలుదార్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉండటంతో కౌలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. గత 3 సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో 6వేల మంది కౌలుదార్లను గుర్తించిన ప్రభుత్వం కేవలం 2వేల మందికి మాత్రమే రుణ అర్హతా కార్డులు అందజేసింది. వీరిలో 800 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది.
కాలయాపనకే కమిషన్
రుణమాఫీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతుల్ని మోసగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేని రుణమాఫీ వర్తింపజేయాలి.
- శీలం నాగనర్సిరెడ్డి, వైఎస్సార్‌సీపీ తిరువూరు మండల కన్వీనర్
కంటితుడుపు చర్య
రకరకాల ప్రకటనలతో రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం నీరుగారుస్తోంది. బ్యా ంకర్లకు సైతం అర్థంకాని రీతిలో నిబంధనలను రూపొందిస్తూ రైతులకు కంటితుడుపు చర్యగా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రయత్నిస్తోంది.
- సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు, తిరువూరు