పెదబయలు: రుణమాఫీ పథకం మన్యంలోని 11 మండలాల రైతులకు వర్తించకుండా పోయే ప్రమాదం తలెత్తింది. మండలానికి ఒకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. పాడేరు, పెదబయలు, హుకుంపేట, జి. మాడుగులు, ముంచంగిపుట్టు, అరకు, అనంతగిరి, గుంటసీమ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు పీఎసీఎస్‌లలో సుమారు 5500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రుణమాఫీ కోసం రెండు నెలలుగా రైతుల పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లతో కూడిన జాబితాను పీఏసీఎస్‌ల ద్వారా సేకరించి డీసీసీబీకి అందజేశారు. వీటిని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించారు.
అయితే రైతు పట్టాదారు పాసుపుస్తకం సర్వే నంబర్లు ఎర్రర్, డూప్లికేట్ అని చూపించి, ఆన్‌లైన్‌లో తీసుకోవడం లేదని అర్జీలు తిప్పి పంపారు. సరైన సర్వే నంబర్లుతో జాబితా సమర్చించాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. దీంతో మన్యంలో 5500 మంది గిరిజన రైతులకు రూ.6 కోట్లు రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే రెవెన్యూ అధికారులిచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో తీసుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రుణమాఫీ వస్తోందని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్థానిక పీఏసీఎస్ కార్యదర్శి వై. రాంబాబును వివరణ కోరగా పెదబయలు సంఘం నుంచి 297 మంది రైతుల జాబితా రుణమాఫీకి సర్వే నంబర్లు పంపామన్నారు. సర్వే నంబర్లు తప్పుగానే ఆన్‌లైన్‌లో చూపడంతో వెనక్కి పంపారని, 11 మండలాల జాబితా తిరస్కరించారని తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాలను పరిశీలించి తమకు రుణమాఫీ అయ్యేలా చూడాలని గిరి రైతులు కోరుతున్నారు.
మాఫీకి మంగళం!
Published Mon, Oct 6 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement