Pedabayalu
-
ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
సాక్షి, విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
1500 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం పెద్దబయలు గ్రామ శివారులోని ఈదులపుట్టు వద్ద ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌తోపాటు.... సదరు వాహనానికి పైలట్‌గా వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఎక్సైజ్ సిబ్బంది ఆపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను సీజ్ చేశారు. -
మావోయిస్టుల లేఖ కలకలం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో సెక్స్ రాకెట్, అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొంటూ.. మావోయిస్టులు రాసిన లేఖ జిల్లాలోని పెదబయలులో కలకలం సృష్టించింది. కేంద్రలోని బీజేపీ, ఒడిషాలోని బిజూ జనతా దళ్, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మోవోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మల్కాజ్గిరి- విశాఖ- కోరాపుట్ బోర్డర్ రీజనల్ కమిటీ పేరుతో వెలువడిన ఈ లేఖలో మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు గ్రామగ్రామాన ప్రతిఙ్ఞ చేయాలని కోరారు. -
మాఫీకి మంగళం!
పెదబయలు: రుణమాఫీ పథకం మన్యంలోని 11 మండలాల రైతులకు వర్తించకుండా పోయే ప్రమాదం తలెత్తింది. మండలానికి ఒకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. పాడేరు, పెదబయలు, హుకుంపేట, జి. మాడుగులు, ముంచంగిపుట్టు, అరకు, అనంతగిరి, గుంటసీమ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు పీఎసీఎస్‌లలో సుమారు 5500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రుణమాఫీ కోసం రెండు నెలలుగా రైతుల పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లతో కూడిన జాబితాను పీఏసీఎస్‌ల ద్వారా సేకరించి డీసీసీబీకి అందజేశారు. వీటిని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించారు. అయితే రైతు పట్టాదారు పాసుపుస్తకం సర్వే నంబర్లు ఎర్రర్, డూప్లికేట్ అని చూపించి, ఆన్లైన్లో తీసుకోవడం లేదని అర్జీలు తిప్పి పంపారు. సరైన సర్వే నంబర్లుతో జాబితా సమర్చించాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. దీంతో మన్యంలో 5500 మంది గిరిజన రైతులకు రూ.6 కోట్లు రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే రెవెన్యూ అధికారులిచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల సర్వే నంబర్లు ఆన్లైన్లో తీసుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ వస్తోందని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్థానిక పీఏసీఎస్ కార్యదర్శి వై. రాంబాబును వివరణ కోరగా పెదబయలు సంఘం నుంచి 297 మంది రైతుల జాబితా రుణమాఫీకి సర్వే నంబర్లు పంపామన్నారు. సర్వే నంబర్లు తప్పుగానే ఆన్లైన్లో చూపడంతో వెనక్కి పంపారని, 11 మండలాల జాబితా తిరస్కరించారని తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాలను పరిశీలించి తమకు రుణమాఫీ అయ్యేలా చూడాలని గిరి రైతులు కోరుతున్నారు. -
ఇదేనా ‘ప్రతిభ’..?
పెదబయలు, న్యూస్‌లైన్ : గురుకులు పాఠశాలల ప్రవేశ పరీక్ష పెదబయలులో తూతూ మంత్రంగా నిర్వహించారు. పాఠశాలలో 5, 6,7, 8, 9 తరగతుల ప్రవేశానికి సంబంధించి 364 మంది దరఖాస్తు చేసుకోగా 337 మంది మాత్రమే హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఎస్కె. మహ్మద్ ఆలీషా తెలిపారు. తొమ్మిది గదుల్లో పరీక్షలు నిర్వహించామని, అయితే స్థలం సరిపోక కొందర్ని వరండాలో కూర్చోబెట్టామన్నారు. ‘ప్రతిభ’లోనూ మాస్ కాపీయింగ్ పెదబయలు గరుకులు పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా చూసి రాసుకున్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రంలోని అన్ని గదుల కిటికీల నుంచి కొందరు యువకులు లోపలి విద్యార్థులకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీన్ని చూసినా సంబంధిత టీచర్లు పట్టించుకోకపోవడంతో వారు మరింత పేట్రేగిపోయి సమాధానాలు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో పాఠశాలలోపలికి ఎవరూ రాకుండా చూడాల్సిన పీఈటీ, పీడీలు అసలు పత్తాలేకుండా పోయారు. దీంతో బయటి వ్యక్తులు విచ్చలవిడిగా కిటికిలకు వేలాడుతూ లోపలి విద్యార్థులకు జావాబులు చెప్పారు. అయితే నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విద్యార్థులు మాత్రం పరిక్షలు బాగారాయలేదని అన్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన పరీక్షలు చాలా పగడ్బందీగా జరిగాయని, అయితే ఈసారి మాత్రం అంతా అక్రమాలేనని పలువురు తల్లిదండ్రులు వాపోయారు. ఇలా మాస్ కాపీయింగ్ జరిగిన నేపథ్యంలో ప్రతిభా వంతులైన విద్యార్థులకు నష్టం కలుగుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.