ఇదేనా ‘ప్రతిభ’..?
పెదబయలు, న్యూస్‌లైన్ : గురుకులు పాఠశాలల ప్రవేశ పరీక్ష పెదబయలులో తూతూ మంత్రంగా నిర్వహించారు. పాఠశాలలో 5, 6,7, 8, 9 తరగతుల ప్రవేశానికి సంబంధించి 364 మంది దరఖాస్తు చేసుకోగా 337 మంది మాత్రమే హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఎస్‌కె. మహ్మద్ ఆలీషా తెలిపారు. తొమ్మిది గదుల్లో పరీక్షలు నిర్వహించామని, అయితే స్థలం సరిపోక కొందర్ని వరండాలో కూర్చోబెట్టామన్నారు.
‘ప్రతిభ’లోనూ మాస్ కాపీయింగ్
పెదబయలు గరుకులు పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా చూసి రాసుకున్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రంలోని అన్ని గదుల కిటికీల నుంచి కొందరు యువకులు లోపలి విద్యార్థులకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీన్ని చూసినా సంబంధిత టీచర్లు పట్టించుకోకపోవడంతో వారు మరింత పేట్రేగిపోయి సమాధానాలు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో పాఠశాలలోపలికి ఎవరూ రాకుండా చూడాల్సిన పీఈటీ, పీడీలు అసలు పత్తాలేకుండా పోయారు.
దీంతో బయటి వ్యక్తులు విచ్చలవిడిగా కిటికిలకు వేలాడుతూ లోపలి విద్యార్థులకు జావాబులు చెప్పారు. అయితే నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విద్యార్థులు మాత్రం పరిక్షలు బాగారాయలేదని అన్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన పరీక్షలు చాలా పగడ్బందీగా జరిగాయని, అయితే ఈసారి మాత్రం అంతా అక్రమాలేనని పలువురు తల్లిదండ్రులు వాపోయారు. ఇలా మాస్ కాపీయింగ్ జరిగిన నేపథ్యంలో ప్రతిభా వంతులైన విద్యార్థులకు నష్టం కలుగుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.