రెవెన్యూ దందా | revenue officers Collection money | Sakshi
Sakshi News home page

రెవెన్యూ దందా

Published Tue, Jan 7 2014 3:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

revenue officers Collection money

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:  పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు వచ్చిందంటే రెవెన్యూ కార్యాలయంలో పండగే. కచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని అధికారులు ముందుగానే లెక్కలు వేసుకుంటారు. మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి దాని ఫైల్‌ను పరుగెత్తిస్తారు. దాని వేగం సంబంధిత రైతు ఇచ్చే కరెన్సీ ఆధారంగా ఉంటుంది. ఆ రైతు ఇచ్చే మొత్తంతో మిగతా ఫైళ్లన్నీ వెనక్కు పోతాయి. రెవెన్యూ సిబ్బంది దృష్టంతా దానిపైనే ఉంటుంది. రైతు ఆశ్చర్యపడే విధంగా పట్టాదారు పాస్ పుస్తకం అతని కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. కరెన్సీ ఉంటే క్షణాల్లో పనులు జరుగుతాయనేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ ప్రాంత విలువ ఆధారంగా రేట్‌ను నిర్ణయిస్తుంటారు. ఎంత హీనంగా చూసినా ఒక్కో పట్టాదారు పాస్ పుస్తకానికి ఐదువేల రూపాయలకు తగ్గకుండా రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తుంటారు. వీఆర్‌ఓ నుంచి దానిపై చివరి సంతకం చేసే అధికారి వరకూ ముడుపులు అందుతాయన్నది బహిరంగ రహస్యం. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఁన్యూస్‌లైన్‌రూ. పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
 దర ఖాస్తు వస్తే పండగే
 పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు వచ్చిందంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో పండగే. తొలుత వీఆర్‌ఓ ప్రాథమికంగా విచారణ చేయాలి. అక్కడ నుంచే నగదు చేతులు మారుతుంటాయి. సంబంధిత సర్వే నంబర్‌లో భూమి ఉందా, అడంగల్‌లో ఎవరి పేరున ఉంది, కొనుగోలు చేసిన వారి పేరు ఉందా.. అన్న వివరాలు పరిశీలిస్తారు. ఆ తరువాత ఆర్‌ఐ రంగంలోకి దిగుతారు. ఆయన కూడా దాన్ని పరిశీలిస్తారు. ఆ తరువాత డిప్యూటీ తహసీల్దార్,తహసీల్దార్ టేబుల్‌పైకి ఫైల్ వెళ్తుంది. చివరగా సంబంధిత ఆర్‌డీఓ చాంబర్‌కు కౌంటర్ ైసైన్ కోసం వె ళ్తుంది. పట్టాదారు పాస్ పుస్తకాన్ని క్షుణంగా పరిశీలించి ఆర్‌డీఓ సంతకం కాగానే బయటకు వస్తుంది. ఈ తతంగమంతా జరగడానికి ఒక్కో రైతుకు భూమి విలువ ఆధారంగా 5 వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. వాస్తవానికి టైటిల్ డీడ్, పట్టాదారు పాస్ పుస్తకం పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరను చూస్తే రైతు అవాక్కవ్వడం ఖాయం. ఈ రెండు పుస్తకాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అక్షరాలా 15 రూపాయలు. దానికి వంద రెట్లు అధికంగా రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. 15సెంట్ల భూమికి కూడా 1000 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేయడం విశేషం. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుంటే రైతులు ఎక్కువగా నష్టపోతుంటారు.
 
 పంట రుణాలు, సబ్సిడీలు పొందాలంటే పాస్ పుస్తకాలు ఉండాల్సిందే. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పట్టాదారు పాస్ పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు 1200 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా కేంద్రం కావడం, ప్రొటోకాల్ చూడాల్సి ఉండటంతో పట్టాదారు పాస్ పుస్తకాలకు పెద్ద మొత్తంలో రేట్ నిర్ణయించారని రైతులు బహిరంగంగానే వాపోతున్నారు. కొత్తపట్నం మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1000 పట్టాదారు పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పట్టాదారు పాస్ పుస్తకానికి 2 వేల నుంచి 15వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అడంగల్ కాపీలో తప్పులు దొర్లాయంటే అక్కడి రెవెన్యూ అధికారులకు పండగే. వారు కూడా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. ఒక్కో అడంగల్‌కు 500 రూపాయలు నిలబెట్టి వసూలు చేస్తున్నారు.
 
 దర్శి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1150 పట్టాదారు పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడివారు అడిగినంత నగదు ముట్ట చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా సకాలంలో ఇవ్వకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1500కు పైగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ భూముల విలువ అధికంగా ఉంది. ఒక్కోదానికి 2000 నుంచి 10 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దాదాపు 5వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొంతమంది రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఇక్కడ కొంతమంది వీఆర్‌ఓలు.. రైతుల నుంచి ముందుగానే రికార్డులు తీసుకొని ఆ తరువాత తమకు ఇవ్వలేదంటూ ఎదురు ప్రశ్నించడం ఆనవాయితీగా మారింది. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దాదాపు 1500దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
 
 వెలిగండ్ల మండలంలో ఒక వికలాంగుడు పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఏడాది నుంచి తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 570దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పాస్ పుస్తకాలకు కొరత ఉండటంతో వాటిని సకాలంలో అందించలేకపోతున్నామని అధికారులు ప్రకటిస్తూ కాలయాపన చేస్తున్నారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వందల సంఖ్యలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నియోకవర్గ పరిధిలోని రైతులు కాళ్లరిగేలా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం తిరుగుతున్నా వాటిని అందించడం లేదు. యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 350 పట్టాదారు పాస్ పుస్తకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు అడిగినంత సమర్పించుకున్నా రైతులకు వాటిని సకాలంలో ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1100 పట్టాదారు పాస్ పుస్తకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో చీమకుర్తి భూమి విలువ అధికంగా ఉంది. మద్దిపాడులో కూడా అదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలో రైతులు ముడుపులు ముట్టచెబుతున్నారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1800 వరకు పట్టాదారు పాస్ పుస్తకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు అడిగినంత సమర్పించుకుంటున్నా పాస్ పుస్తకాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతూనే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement