నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు | fake pass books gang arrested | Sakshi
Sakshi News home page

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు

Published Wed, Feb 11 2015 8:38 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు - Sakshi

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు

ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠాను పుల్లలచెరువు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నకిలీ పాస్ పుస్తకాల తయారీ, అమ్మకంతోపాటు పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది జనవరి 30న పుల్లలచెరువు మండల తహశీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

పుల్లలచెరువు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నారు వెంకటేశ్వరరెడ్డి నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరెడ్డి గుంటూరు నగరంలోని లాలాపేటలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆశ్రయించి నకిలీ పాస్ పుస్తకాల ప్రింటింగ్ చేయించేవాడు. అలా పూర్తి చేసుకున్న పాస్ పుస్తకాలను పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పాల శ్రీనివాసులు, యర్రగొండపాలెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న పూట్ల సుబ్బారావు, యర్రగొండపాలెంకు చెందిన ముక్కుమూడి రూబేనులకు పట్టాదారు పాస్ పుస్తకాలను విక్రయించేవాడు. ఈ పుస్తకాల్లో తహశీల్దార్ సంతకం, ఆర్‌ఐ సంతకం, వీఆర్‌ఓ సంతకంతోపాటు టైటిల్‌డీడ్‌లో ఆర్‌డీఓ సంతకాలు కూడా ఫోర్జరీవే. ఉప్పాల శ్రీనివాసులు ఫోర్జరీ సంతకాలు చేయటంలో చేయి తిరిగిన వ్యక్తి. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్‌డీఓ, ఆర్‌ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్‌డీఓ, ఆర్‌ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. ముక్కుమూడి రూబేనుతో కలిసి ఈ ముగ్గురు పుల్లలచెరువు గ్రామానికి చెందిన తంగెళ్ళ మూర్తయ్య, కొలకలూరి కుమార్, రాచకొండ నాగయ్యలకు విక్రయించేవారు. ఈ ముగ్గురూ కలిసి ఒక్కో రైతు వద్ద రూ.35 వేలు తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్‌డీడ్‌లను అమ్మేసేవారు. ఈ విధంగా కొనుగోలు చేసిన వారు పొలాలున్నట్లుగా ఆ పాస్ పుస్తకాల్లో రాయించేసి బ్యాంకుల్లో రుణాలు కూడా పొందినట్లు తెలిసిందని ఎస్సీ తెలిపారు.

ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ప్రస్తుతం పుల్లలచెరువు మండలం వరకు మాత్రమే విచారించామని, జిల్లావ్యాప్తంగా ఏమైనా ఇలాంటి పరిస్థితి ఉందేమోనని ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

దాదాపు 500కుపైగా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు వివిధ వ్యక్తుల వద్ద ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పుల్లలచెరువులోని నాలుగు బ్యాంకుల్లో ఈ పాస్ పుస్తకాలను పెట్టి సుమారు రూ.2 కోట్లు రుణాలు పొందినట్లు సమాచారం ఉందని, అయితే ఆయా బ్యాంకులపై విచారణ చేపడతామన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, బ్యాంకుల్లో మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్ల పాత్రపై కూడా కన్నేసినట్టు పేర్కొన్నారు. వాళ్ళ ప్రమేయం ఉందని తేలితే ఆయా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

పాస్ పుస్తకాలను ప్రింటింగ్ చేస్తూ నేరానికి సహకరించిన గుంటూరు నగరంలోని లాలాపేటకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఆకుల రమేష్, రామ్మోహన్‌లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి బిఆర్ వరుణ్, జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement