పాస్ పుస్తకాలు లేక అవస్థలు
విజయనగరం కంటోన్మెంట్:జిల్లాలో పట్టాదారుపాసుపుస్తకాలకు పలువురు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వయంత్రాంగం సాధారణ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని నిలిపివేసి ‘ఈ’పాసు పుస్తకాలను ప్రవేశపెట్టింది. అయితే దీనికి సరిపడా సాంకేతికతను మాత్రం సమకూర్చడం లేదు. పాత పద్ధతిని నిలిపి వేసిన యంత్రాంగం కొత్త పద్ధతులకు అవసరమైన సాంకేతికతను వెంటనే సమకూర్చాల్సిన బాధ్యత ఉన్నటికీ ఇప్పటివరకూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్ల జిల్లావ్యాప్తంగా పట్టాదారుపాసుపుస్తకాల పంపణీ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త విధానమనేది ఒక్క మనజిల్లాలోనేకాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కానీ ఇతరజిల్లాల అధికార యంత్రాంగం ఉన్నతాధికారులను సంప్రదించి ఒకే నంబరుతో ఉన్న పుస్తకాలను ముద్రించి వాటిని అవసరమైన రైతాంగానికి ఇచ్చి వాటిని అప్‌లోడ్ చేసుకుంటున్నారు. ఆ తరువాత ఆన్‌లైన్ విధానానికి ఈ డేటాను అనుసంధానించవచ్చనేది వీరి ఆలోచన. ఆలోచన వచ్చిన వెంటనే అమలుచేస్తుండటంతో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ విధానం బాగానే నడుస్తోంది.
తద్వారా పాసుపుస్తకాల పంపిణీ ఆగిపోకుండా అడిగినవారికి ఇస్తున్నారు. వీటిని ఈ పాస్‌పుస్తకాలుగా గుర్తించే అవకాశం కూడా ఉండడంతో ఆయా జిల్లాల్లో పాస్‌పుస్తకాలను అర్హులకు అందిస్తున్నారు. ఈ జిల్లాలో మాత్రం పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. పాస్ పుస్తకాల పంపిణీ ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అత్యవసరంగా పాసుపుస్తకాల కోసం సుమారు 3వేలమంది రైతులు ఎదురుచూస్తుండగా ఈ పాసుపుస్తకాలకోసం దరఖాస్తుచేసుకున్న వారు మాత్రం వేలల్లోనే ఉన్నారు. రెంటికీచెడ్డ రేవడిలా పాస్‌పుస్తకాల వ్యవస్థ తయారైందని రైతులు ఆరోపిస్తున్నారు. పాస్‌పుస్తకాల కోసం నెలలు,సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని అధిగమించడానికి అధికారయంత్రాంగం తీసుకున్న చర్యలు కానరావడం లేదు. ప్రతి ఏటా పట్టాదారు పాస్ పుస్తకం కోసం తిరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం పుస్తకాలు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.
పాత పుస్తకాలతో పట్టాదారు హక్కులు
జిల్లాలోని కొన్నిమండలాల్లో పాత పుస్తకాలనే పాతతేదీలతో మంజూరుచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని మక్కువ,పార్వతీపురం,కొత్తవలస,బొబ్బిలి,సాలూరు,రామభద్రపురం,గజపతినగరం,బొండపల్లి,నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం తదితర మండలాల్లో పాతతేదీలతో, పాతపుస్తకాలతో పట్టాదారు హక్కులుపొందుతున్నట్టు తెలియవచ్చింది. జతపాసుపుస్తకాలను రూ.2వేలకుపైగా విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఈపుస్తకాలను రిటైర్డు అధికారులతో ధ్రువీకరించి రైతుల వద్ద పెద్ద ఎత్తున మొత్తం కాజేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇటువంటిపాస్‌పుస్తకాలు చెల్లవని తెలియని కొంతమంది రైతులకు తెలియకపోవడం, మరోపక్క తెలిసినవారైనా మనపేరునపుస్తకముంది గదా అన్న ధోరణి కనబర్చడంతో ఇటువంటి నకిలీపుస్తకాల దందా కొనసాగుతోంది. దీనిపై కొందరు అధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.