పొలంలో బయటపడ్డ బంగారం
సాలూరు: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లాలో చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్న శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలిలా వున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌కు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో కొంత భూమి ఉంది. దానిని విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు సాగుచేస్తున్నారు. గత శుక్రవారం వరకు భూమిని అభివృద్ధి చేసేందుకు యంత్రాలసాయంతో నొల్లించారు. అనంతరం కురిసిన వర్షాలతో ఆదివారం ఆ భూమిలో ఒక పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు వెలుగు చూశాయి. శ్యామల గౌరీపురం గ్రామానికి చెందిన ఓ యువతికి ఆ ఆభరణాలు కనిపించడంతో వాటిని తెచ్చి అష్టలక్ష్మీదేవి ఆలయం వద్దనున్న బోరింగువద్ద కడిగి ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.
పంట భూమిలో బంగారునగలు, వెండి ఆభరణాలు దొరికిన విషయం గ్రామంలో వ్యాపించడంతో పలువురు ఆ భూమిలో వెదుకగా మరికొన్ని చైన్లు, ముక్కుపుడకలు దొరికినట్ట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డితో పాటు గ్రామస్థుల్లో కొందరిని సాలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో దొరికిన బంగారు చైన్‌ను ఒకరు పట్టణంలోని ఓ నగల దుకాణంలో అమ్మిన విషయాన్ని సైతం పోలీసులు గుర్తించినట్టు సమాచారం.