విజయనగరం వ్యవసాయం: ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పైడిరాజు. ఈయనది బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామం. ఈయన 2012లో దిబ్బగు డ్డివలస సొసైటీలో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు. ఈయన అధార్ కార్డు నంబరును అధికారులు అదేగ్రామానికిచెందిన మరో రైతు చింతలరామారావుకు వేయడంతో ఆయనకు రుణమాఫీ అయింది. పైడిరాజుకు మాఫీ కాలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొట్నాన లక్ష్మణరావు. ఈయనది కూడా బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలసగ్రామం. ఈయన 2013లో దిబ్బగుడ్డివలస సొసైటీలో రూ.25 వేలు రుణం తీసుకున్నాడు, అధికారులు ఈయనకు భూమి లేదని వివరాలు పంపించడంతో రుణమాఫీకాలేదు.
ఇది ఈ ఇద్దరి రైతులపరిస్థితే కాదు. జిల్లాలో రుణమాఫీకి నోచుకోని వేలాది మంది రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రుణమాఫీ కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అధికారుల తప్పిదాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలో మొదటి, రెండు విడతల్లో 2లక్షల మందికి పైగా రైతులకు రూ. 230 కోట్లు రుణమాఫీ అయింది. ఇంకా లక్షమందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. గత నాలుగు నెలలుగా రైతులు పనులు మానుకుని బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ రుణమాఫీకినోచుకోవడం లేదు.
రుణమాఫీ అవుతుంతో లేదో గానీ జిరాక్సులకు, రవాణచార్జీలకోసం రైతులు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చుపెట్టారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రకృతి దయచూపకపోయినా,ప్రభుత్వం కనికరిస్తుందని ఆశపడ్డారు. అయితే వారి ఆశలపై రాష్ట్రప్రభుత్వం నీళ్లు చల్లుతుంది. రుణమాఫీ చేస్తుందో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ ఒకేసారి చేయాల్సి ఉన్నా విడతలు పేరు చెప్పి కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు అధికారులు వివరాలు తప్పుల తడకగా నమోదు చేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఒకరి రేషన్ కార్డు మ రొకరికివేయడం, ఒకరి భూమి వివరాలు మరొకరికి వేయడం, భూమి ఉన్నా లేదని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కారణంగా రైతులు మాఫీకి నోచుకోలేకపోతున్నారు.
రుణమాఫీసెల్‌కు అధిక సంఖ్యలో వచ్చిన రైతులు
రుణమాఫీ కోసం వచ్చిన రైతులతో రుణమాఫీ సెల్ కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచే రైతులు కలెక్టరేట్‌లో ఉన్న రుణమాఫీ సెల్ వద్దకు వచ్చారు. దీంతో బుధవారం కూడా వ్యవసాయశాఖ అధికారులు 11 కౌంటర్ల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. రుణమాఫీ కౌంటర్ నుంచి కలెక్టరేట్ గేటు వరకు రైతులు బారులు తీరారు. ఎండ ఎక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎండలో ఇబ్బంది పడుతున్నప్పటికీ గుక్కెడు నీళ్లు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు మండిపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రానికి 5419 మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేశారు. బుధవారం 2 వేల మందికి పైగా రైతులు వచ్చారు. అయితే రుణమాఫీ దరఖాస్తుకు గడువు రెండు రోజులే ఉండడంతో 14,15 తేదీల్లో ఇంకా అధిక సంఖ్యలో రైతులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రుణమాఫీ ‘పాట్లు’
Published Thu, May 14 2015 12:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement