పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు! | Cancelled passbooks for bank loans | Sakshi
Sakshi News home page

పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు!

Published Sun, May 31 2015 5:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు!

పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు!

* రాష్ట్రప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
టైటిల్ డీడ్స్ కూడా కాలగర్భంలో కలసినట్టే..
ఇక అన్నింటికీ ‘1-బి’నే ఆధారం
‘మీ భూమి’ నుంచి ‘1-బి’ రికార్డు నేరుగా డౌన్‌లోడ్
‘వెబ్‌ల్యాండ్’ డేటా ప్రకారం బ్యాంకు రుణాలు
మరి పట్టాదారు పాసుపుస్తకాలు రద్దయితే రైతులకు బ్యాంకు రుణాలెలా?


సాక్షి, హైదరాబాద్: కొండనాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టే చందంగా ఉంది సర్కారు తీరు. రెవెన్యూశాఖలో అక్రమాలను నియంత్రించలేక ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా రైతులు ఎంతో విలువైన ఆస్తి పత్రాల్లా భావించే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లనుంది. పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాల అప్‌డేట్, మ్యుటేషన్లు(భూ యాజమాన్య హక్కుల సవరణ) కోసం క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడం, వీటిపై పత్రికల్లోనూ కథనాలు రావడంతోపాటు రెవెన్యూ అక్రమాలను నియంత్రించలేకపోతున్నామంటూ జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ మంత్రి సమక్షంలోనే పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్చించింది. అయితే అక్రమాలను నియంత్రించే మార్గాలను అన్వేషించే బదులుగా సమస్యకు పరిష్కారంగా ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దిశగా ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుని కార్యరూపంలోకి తెస్తే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లినట్లే. పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని రద్దు చేయడమంటే టైటిల్‌డీడ్స్(భూ యాజమాన్యహక్కుల పత్రాలు)నూ కాలగర్భంలో కలిపేసినట్లే.

ఇక ‘1-బి’నే ఆధారం!
 రైతులు ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాలను తనఖాపెట్టి వాణిజ్య, సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తే.. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న ‘1-బి’(భూ యాజమాన్య) రికార్డు జిరాక్స్ పత్రాలను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు రైతులు ‘మీభూమి’ వెబ్‌సైట్ ద్వారా ‘1-బి’ నుంచి వారికి చెందిన భూముల వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ‘సర్కారు భూమి’(మీ భూమిలోని డేటానే ఇందులో ఉంటుంది) వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిచ్చేలా బ్యాంకులను ప్రభుత్వం ఒప్పించనుంది. రైతుల భూముల డేటా నేరుగా చూసుకునేందుకు వీలుగా ఇప్పటికే బ్యాంకులకు ‘సర్కారు భూమి’ వెబ్‌ల్యాండ్‌ను రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనిప్రకారం రుణాలివ్వడంలో బ్యాంకులకు అభ్యంతరం ఉండకపోవచ్చునంటున్నారు.

ప్రైవేటు రుణాల మాటేమిటి?
 సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకులిస్తున్న రుణాలు పది శాతమే. మిగిలిన 90 శాతం వరకు వడ్డీ వ్యాపారులనుంచే రుణాలు పొందుతున్నారు. వడ్డీ వ్యాపారులు చాలామంది పట్టాదారు పాసుపుస్తకాలను, భూముల కొనుగోలు డాక్యుమెంట్లను తనఖా పెట్టుకుని రుణాలిస్తున్నారు. ఈ పుస్తకాలు రద్దయితే ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలు పొందడం చిన్న రైతులకు ఇబ్బంది కావచ్చని రెవెన్యూ అధికారులు సైతం అంగీకరిస్తుండడం గమనార్హం.

రద్దు ఎలా పరిష్కారం..
 రెవెన్యూలో అక్రమాల నియంత్రణకు పాసు పుస్తకాలను రద్దు చేయడం ఎలా పరిష్కారమో అర్థంకాని ప్రశ్నగా మారిందని ఈ శాఖలో సుదీర్ఘ అనుభవమున్న అధికారులు అంటున్నారు. వెబ్‌ల్యాండ్ డేటాలో సర్వే నంబర్లవారీగా రైతుల భూముల వివరాలుంటేనే బ్యాంకులు రుణాలిస్తాయి. ఇప్పటివరకూ 40 నుంచి 50 శాతం డేటాలోకి ఎక్కలేదు. పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తే వీరికి బ్యాంకు రుణాలెలా వస్తాయి? వెబ్‌ల్యాండ్‌లోకి భూవివరాలు ఎక్కించాలంటే రెవెన్యూ సిబ్బంది డబ్బు డిమాండు చేస్తుంటే.. దీనిని కట్టడి చేయడం మాని వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిప్పించే విధానం తెస్తామని చెప్పడంలో అర్థమేంటీ? ’ అని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement