
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కథ అడ్డం తిరిగింది. ప్రక్షాళన దశలో అభినందనలు పొందిన ఈ ప్రక్రియ.. పాస్ పుస్తకాల పంపిణీ సమయానికి నిందారోపణలకు దారితీయడం తహసీల్దార్లకు రుచించడం లేదు. పాస్ పుస్తకాల్లో పెద్ద ఎత్తున వచ్చిన తప్పులకు తమను బాధ్యులుగా చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం తమకు బోనస్‌గా ఇచ్చిన నెల మూల వేతనాన్ని తిరిగి ఇచ్చివేయాలని తహసీల్దార్ల సంఘం నిర్ణయించింది.
పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పుల బాధ్యతను తమపై రుద్దుతున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, పాస్ పుస్తకాల ముద్రణలో అసలేం జరిగిందన్న విషయాన్ని ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి వివరిస్తామని వారు చెబుతున్నారు.
ధరణి వెబ్‌సైట్ లోపభూయిష్టం
భూ రికార్డులను సమగ్రంగా నమోదు చేసేందుకు రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్ కూడా లోపభూయిష్టంగా ఉందని తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి రానందున తప్పులు సరిచేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్లు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని వారంటున్నారు.