సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ మెలిక పెట్టడం బడాబాబులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేసినవారిని ఈ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టింది. ఆధార్ నంబర్‌ను ఇస్తే ఎక్కడ తమ భూముల చిట్టా బయటపడుతుందోననే ఆందోళన వారిలో నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వివాదరహిత భూములకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సదరు రైతులకు పాస్‌బుక్కులను అందజేసింది. అయితే, వీటి ముద్రణ సమయంలోనే పట్టాదారు ఆధార్ నంబర్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆధార్ సమాచారం ఇవ్వకపోతే పాస్‌బుక్కును ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లెక్కతేల్చిన 4,56,155 మందిలో ఆధార్ నంబర్‌ను సమర్పించిన 1,88,994 మందికి పాస్‌పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆధార్ నంబర్ ఇవ్వని 2,67,161 మంది పట్టాదార్ల పాస్ బుక్కులను పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డులు సవ్యంగానే ఉన్నప్పటికీ, ఆధార్ నంబర్ ఇవ్వని కారణంగానే వీటిని పక్కనపెట్టింది.
పార్ట్–బీలో 69 లక్షల ఎకరాలు
భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా వర్గీకరించిన సర్కారు.. వ్యవసాయేతర, అభ్యంతరకర భూములను పార్ట్–బీ కేటగిరీగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీ కింద 69,85,478 ఎకరాలున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో ప్రభుత్వ భూములు ముఖ్యంగా అటవీ, నాలా, ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. ఇందులో 1.53 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు పాస్‌పుస్తకాలను ముద్రించి పంపించినట్లు రెవెన్యూశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, క్లియర్ టైటిల్‌గా తేల్చినప్పటికీ ఇంకా 5,72,498 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన డిజిటల్ సంతకాలు నమోదు చేయకపోవడంతో పాస్‌పుస్తకాల ముద్రణకు పంపలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రవాస భారతీయులకు పాస్ పుస్తకాలు అందుకోవడం తలనొప్పిగా మారింది. అక్కడే స్థిరపడ్డవారు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకోవడం చట్టరీత్యానేరం. ఒకవేళ తీసుకున్నట్లు తెలిస్తే.. ఆదేశ పౌరసత్వం కూడా రద్దు కావడమేగాకుండా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాస్ బుక్కుకు విధిగా ఆధార్‌ను జోడించాలనే నిబంధన విధించడం వారికి చిక్కుముడిగా మారింది. ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
గుట్టు బయట పడుతుందనే?
ప్రతి క్రయ విక్రయానికి ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే రెవెన్యూ రికార్డుల నవీకరణ సమయంలో సేకరించే ఆధార్‌తో తమ భూ చరిత్ర తెలిసిపోతుందని గుబులు బడాబాబుల్లో కనిపిస్తోంది. ఆధార్ వివరాలను ఇవ్వండి మహాప్రభో అని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా వారు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన పెద్దలు.. సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తామనే భయంతో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 10,823 గ్రామాల్లో 2.38 కోట్ల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించి.. 2.28 కోట్ల ఎకరాల భూములు వివాదరహితంగా తేల్చింది. 9.92 లక్షల ఎకరాల మేర భూముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వాటిని వివాదాస్పద భూముల జాబితా (పార్ట్–బీ)లో చేర్చింది. ఈ క్రమంలోనే సర్వే నంబర్ల వారీగా రికార్డులను రూపొందించింది. 1,86,84,158 సర్వేనంబర్లలోని భూములు క్లియర్‌గా గుర్తించిన సర్కారు.. 9,13,656 సర్వేనంబర్ల పరిధిలోని భూములను వివాదాస్పదంగా పరిగణించింది.
Comments
Please login to add a commentAdd a comment