శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామానికి చెందిన ఓ రైతు పట్టాదారు పాస్ పుస్తకం కోసం అధికారుల చుట్టూ నాలుగు నెలలపాటు తిరిగాడు. అడిగిన మొత్తం సమర్పించుకున్నా తర్వాతే పాస్ పుస్తకం ఇచ్చారు. అందులో సదరు రైతు ఫొటో స్థానంలో మరొకరి ఫొటో అచ్చయ్యింది. అది సరి చేయాలంటే తాము అడిగినంత సొమ్ము మళ్లీ ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పేశారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు నెల క్రితం వివాహమైంది. చంద్రన్న పెళ్లికానుక అందాలంటే కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. దానికోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం అధికారులు అడిగినంత ముట్టజెప్పే స్తోమత అతడికి లేకపోవడమే.
పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందని మేకా సూర్యచంద్రం రేషన్ కార్డులో తప్పులున్నాయి. అందులో మార్పుల కోసం మూడేళ్లుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. సర్వర్లు పనిచేయడం లేదని, కంప్యూటర్ ఆపరేటర్ లేరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఎప్పుడు వెళ్లినా ఇదే సమాధానం వస్తోంది. పని మాత్రం పూర్తి కావడం లేదు.
ప్రజల వద్దకే పరిపాలన అన్న నినాదం వట్టి మాటగానే మిగిలిపోతోంది. ఏ చిన్న ధ్రువీకరణ పత్రం కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడైనా ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో తహసీల్దార్ (ఎంఆర్‌వో) కార్యాలయాల్లో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా, నిక్షేపంగా వర్థిల్లుతోంది. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఫ్యామిలీ మెంబర్, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పని అంటూ తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు తహసీల్దార్ కార్యాలయాల్లో సాక్షి’ ‘తాజాగా ‘ఆఫీసు విజిట్’ చేయగా నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి.
అంతులేని కాలయాపన: తహసీల్దార్ కార్యాలయాల్లో ఫలానా ధ్రువపత్రాలను ఫలానా గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ, ఇదెక్కడా అమలు కావడం లేదు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ధ్రువపత్రాల కోసం నెలల తరబడి ఎంఆర్‌వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నాక 28 రోజుల్లోగా పట్దాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, మూడు, నాలుగు నెలలైనా పాస్ పుస్తకాలు రైతుల చేతికి అందడం లేదు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని (ఫ్యామిలీ సర్టిఫికెట్) 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, మూడు నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారు. పాముకాటు వల్ల, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, నెల నుంచి 45 రోజుల సమయం పడుతోంది. మిగతా సర్టిఫికెట్లదీ ఇదే పరిస్థితి. జనం వ్యయ ప్రయాసలు భరించి, ధ్రువపత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత: రాష్ట్రంలో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందిలో 60 శాతం మంది సమయ పాలన పాటించడం లేదు. బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి కాకపోవడంతో తహసీల్దార్లు విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారు. ఎంఆర్‌వో కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి మండలానికి ఒక తహసీల్దార్, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐ), ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ ఉండాలి. కానీ, చాలా మండలాల్లో ఒక్కొక్క ఆర్‌ఐ మాత్రమే ఉన్నారు. కొన్ని మండలాలకు ఒక్క ఆర్‌ఐ కూడా లేరు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఖాళీల భర్తీపై దృష్టి పెట్టలేదు. కొన్నిచోట్ల ఎంఆర్‌వో కార్యాలయాల్లో సరిపడా కంప్యూటర్లు లేవు. దీనివల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.
అర్జీల తిరస్కరణ: తహసీల్దార్ ఆఫీసుల్లో లంచాలు ఇచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఇవ్వకపోతే రకరకాల కొర్రీలతో అర్జీలను పక్కన పడేస్తున్నారు. 60 శాతానికి పైగా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. కర్నూలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల్లో అర్జీలుకొండల్లా పేరుకుపోతున్నాయి. భూములకు సంబంధించి అన్ని పత్రాలూ సక్రమంగా ఉన్నా, రెవెన్యూ అధికారులు ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
ప్రతి పనికీ ఓ రేటు
తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది. పేరుకే ఆన్‌లైన్.. జరిగేదంతా ఆఫ్‌లైన్‌లోనే. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి, పక్కాగా వసూలు చేస్తున్నారు. ఇందులో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరి వాటా వారికి చేరుతోంది. లంచం ఇస్తేనే దరఖాస్తుకు మోక్షం లభిస్తుంది, లేకపోతే దానిపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఏ పనికి ఎంత వసూలు చేస్తున్నారంటే..
ఆరు నెలలైనా రేషన్ కార్డు రాలేదు
‘‘రేషన్ కార్డు కోసం జన్మభూమిలో అర్జీ ఇచ్చా. తహసీల్దార్ ఆఫీస్‌లోఅడిగితే మీ–సేవ కేంద్రానికి వెళ్లమన్నారు. అక్కడ మళ్లీ దరఖాస్తు చేసి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నా. అర్జీలు, ఆటో చార్జీలకు ఇప్పటిదాకా రూ.500 ఖర్చయ్యింది. రేషన్ కార్డు మాత్రం రాలేదు’’– దేవి, పలమనేరు, చిత్తూరు జిల్లా
డబ్బులిస్తేనే పని పూర్తవుతుందట!
‘‘పట్టాదారు పుస్తకాల కోసం మూడుసార్లు మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేశా. అధికారులు మూడుసార్లు దరఖాస్తును తిరస్కరించారు. డబ్బులిస్తే పని అయిపోతుందని తహసీల్దార్ కార్యాలయంలో అంటున్నారు’’
– కెల్ల సింహాద్రమ్మ, రైతు, కెల్ల, గుర్ల మండలం, విజయనగరం జిల్లా
ఎకరం పొలం కాజేశారయ్యా...
‘‘మాది సొలస గ్రామం. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 198లో 3.53 ఎకరాల పొలం ఉంది. మా మామగారైన మల్లారెడ్డి నుంచి నా భర్త రోశిరెడ్డికి అనువంశికంగా ఈ పొలం సంక్రమించింది. నా భర్త అనుమతితో ఆయన సోదరుడు పెద వెంకటేశ్వరరెడ్డి ఈ భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో ఎకరం భూమి వెంకటేశ్వరరెడ్డిదే అంటూ 2016 మార్చిలో అధికారులు అడంగల్, 1బీ సృష్టించారు. 2017లో రెవెన్యూ అధికారులు ఇచ్చిన అడంగల్, 1బీలను ఆధారంగా చేసుకుని వెంకటేశ్వర రెడ్డి తన కుమారుడి పేరున ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. అదే ఏడాది నా భర్త మృతి చెందాడు. పొలం బాకీ విషయంలో ఈసీ తీయిస్తే మాకున్న 3.53 ఎకరాల్లో ఒక ఎకరం తగ్గినట్లు తెలిసింది. వెంటనే రెవెన్యూ అధికారులను కలిశాం. పొరపాటు జరిగి ఉంటుందని, మారుస్తామని చెప్పారు. సొసైటీలో తనఖా పెట్టి వ్యవసాయ రుణాన్ని తీసుకొని ఉన్నాం. రుణం ఉన్న పొలం నా భర్త రోశిరెడ్డి సంతకం లేకుండా వేరొకరికి ఎలా సంక్రమిస్తుంది? మాకు న్యాయం చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ’
– సామ్రాజ్యం, సొలస, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment