Certifications
-
దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ
టెలికమ్యునికేషన్ సేవలందిస్తున్న వొడాఫోన్-ఐడియా(వీఐ) ప్రతిష్టాత్మక ‘పీసీఐ డీఎస్ఎస్ 4.0’ సర్టిఫికేషన్ పొందినట్లు తెలిపింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా గుర్తింపు పొందింది. కస్టమర్ల డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు లభించిందని కంపెనీ పేర్కొంది.సిమ్‌కార్డు ఆధారంగానే డిజిటల్ లావాదేవీలు చేస్తూంటారు. మోసపూరిత చెల్లింపులను నివారించి, కస్టమర్ డేటాను భద్రంగా ఉంచడంలో పకడ్బందీ చర్యలు పాటిస్తున్నట్లు వీఐ తెలిపింది. కంపెనీ రిటైల్‌స్టోర్స్, పేమెంట్ ఛానల్స్‌కు సంబంధించి ఈ చర్యలు చేపట్టినందుకు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ వెర్షన్ 4.0 (పీసీఐ డీఎస్ఎస్ 4.0) సర్టిఫికేషన్ పొందినట్లు వెల్లడించింది. దాంతో భారత్‌లో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం ఆపరేటరుగా వొడాఫోన్-ఐడియా నిలిచింది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ..‘అత్యుత్తమ గ్లోబల్ సెక్యూరిటీ ప్రమాణాలకు సంస్థ కట్టుబడి ఉంది. కస్టమర్ల డేటా భద్రతకు కంపెనీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందడమనేది పకడ్బందీ భద్రతా చర్యలను పాటించడంలో మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారత్‌లో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా నిలవడం సంతోషకరం. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీలపై పెట్టుబడి పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ(పీసీఐ) సెక్యూరిటీ స్టాండర్డ్స్ కౌన్సిల్‌ను ప్రారంభించింది. డేటా ఉల్లంఘనలు, క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన మోసాలు గుర్తించడం, వాటికి అందించే భద్రత చర్యలు, అందుకోసం సంస్థలు పాటించే అత్యంత కఠినతరమైన, అప్-టు-డేట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఇది సూచిస్తుంది. భారత్‌లోని బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందాలని ఇప్పటికే ఆర్బీఐ మార్గదర్శకాల్లో నిర్దేశించింది. -
మరింత సులభంగా ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: విద్య, ఉద్యోగ ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. కుల, నివాస, జనన వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకొంటే చాలని స్పష్టం చేసింది. ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య తదితర సంక్షేమ శాఖలతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబరుతో కొత్తది పొందే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరంలేదు. దరఖాస్తుదారు తన వద్ద ఉండే జిరాక్స్ కాపీలో పేర్కొన్న నంబరు చెబితే కొత్తది ఇస్తారు. కుటుంబంలో గతంలో ఎవరూ ఎలాంటి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ పొంది ఉండకపోతే దరఖాస్తుదారు ప్రస్తుతం ఈకేవైసీ చేయించుకొని తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఒక వేళ దరఖాస్తుదారు ఈకేవైసీ చేయించుకొని సర్టిఫికెట్ పొంది ఉంటే, అతని తండ్రి లేదా తండ్రి తరపున రక్త సంబం«దీకులు ఎవరైనా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తహసీల్దార్ నుంచి కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చు. -
తహసీల్దార్ కార్యాలయం.. సేవలు అస్తవ్యస్తం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామానికి చెందిన ఓ రైతు పట్టాదారు పాస్ పుస్తకం కోసం అధికారుల చుట్టూ నాలుగు నెలలపాటు తిరిగాడు. అడిగిన మొత్తం సమర్పించుకున్నా తర్వాతే పాస్ పుస్తకం ఇచ్చారు. అందులో సదరు రైతు ఫొటో స్థానంలో మరొకరి ఫొటో అచ్చయ్యింది. అది సరి చేయాలంటే తాము అడిగినంత సొమ్ము మళ్లీ ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు నెల క్రితం వివాహమైంది. చంద్రన్న పెళ్లికానుక అందాలంటే కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. దానికోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం అధికారులు అడిగినంత ముట్టజెప్పే స్తోమత అతడికి లేకపోవడమే. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందని మేకా సూర్యచంద్రం రేషన్ కార్డులో తప్పులున్నాయి. అందులో మార్పుల కోసం మూడేళ్లుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. సర్వర్లు పనిచేయడం లేదని, కంప్యూటర్ ఆపరేటర్ లేరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఎప్పుడు వెళ్లినా ఇదే సమాధానం వస్తోంది. పని మాత్రం పూర్తి కావడం లేదు. ప్రజల వద్దకే పరిపాలన అన్న నినాదం వట్టి మాటగానే మిగిలిపోతోంది. ఏ చిన్న ధ్రువీకరణ పత్రం కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడైనా ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాల్లో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా, నిక్షేపంగా వర్థిల్లుతోంది. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఫ్యామిలీ మెంబర్, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పని అంటూ తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు తహసీల్దార్ కార్యాలయాల్లో సాక్షి’ ‘తాజాగా ‘ఆఫీసు విజిట్’ చేయగా నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. అంతులేని కాలయాపన: తహసీల్దార్ కార్యాలయాల్లో ఫలానా ధ్రువపత్రాలను ఫలానా గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ, ఇదెక్కడా అమలు కావడం లేదు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ధ్రువపత్రాల కోసం నెలల తరబడి ఎంఆర్వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నాక 28 రోజుల్లోగా పట్దాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, మూడు, నాలుగు నెలలైనా పాస్ పుస్తకాలు రైతుల చేతికి అందడం లేదు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని (ఫ్యామిలీ సర్టిఫికెట్) 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, మూడు నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారు. పాముకాటు వల్ల, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలి. కానీ, నెల నుంచి 45 రోజుల సమయం పడుతోంది. మిగతా సర్టిఫికెట్లదీ ఇదే పరిస్థితి. జనం వ్యయ ప్రయాసలు భరించి, ధ్రువపత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత: రాష్ట్రంలో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందిలో 60 శాతం మంది సమయ పాలన పాటించడం లేదు. బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి కాకపోవడంతో తహసీల్దార్లు విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారు. ఎంఆర్వో కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి మండలానికి ఒక తహసీల్దార్, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ), ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ ఉండాలి. కానీ, చాలా మండలాల్లో ఒక్కొక్క ఆర్ఐ మాత్రమే ఉన్నారు. కొన్ని మండలాలకు ఒక్క ఆర్ఐ కూడా లేరు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఖాళీల భర్తీపై దృష్టి పెట్టలేదు. కొన్నిచోట్ల ఎంఆర్వో కార్యాలయాల్లో సరిపడా కంప్యూటర్లు లేవు. దీనివల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అర్జీల తిరస్కరణ: తహసీల్దార్ ఆఫీసుల్లో లంచాలు ఇచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఇవ్వకపోతే రకరకాల కొర్రీలతో అర్జీలను పక్కన పడేస్తున్నారు. 60 శాతానికి పైగా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. కర్నూలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల్లో అర్జీలుకొండల్లా పేరుకుపోతున్నాయి. భూములకు సంబంధించి అన్ని పత్రాలూ సక్రమంగా ఉన్నా, రెవెన్యూ అధికారులు ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రతి పనికీ ఓ రేటు తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది. పేరుకే ఆన్లైన్.. జరిగేదంతా ఆఫ్‌లైన్‌లోనే. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి, పక్కాగా వసూలు చేస్తున్నారు. ఇందులో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరి వాటా వారికి చేరుతోంది. లంచం ఇస్తేనే దరఖాస్తుకు మోక్షం లభిస్తుంది, లేకపోతే దానిపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఏ పనికి ఎంత వసూలు చేస్తున్నారంటే.. ఆరు నెలలైనా రేషన్ కార్డు రాలేదు ‘‘రేషన్ కార్డు కోసం జన్మభూమిలో అర్జీ ఇచ్చా. తహసీల్దార్ ఆఫీస్లోఅడిగితే మీ–సేవ కేంద్రానికి వెళ్లమన్నారు. అక్కడ మళ్లీ దరఖాస్తు చేసి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నా. అర్జీలు, ఆటో చార్జీలకు ఇప్పటిదాకా రూ.500 ఖర్చయ్యింది. రేషన్ కార్డు మాత్రం రాలేదు’’– దేవి, పలమనేరు, చిత్తూరు జిల్లా డబ్బులిస్తేనే పని పూర్తవుతుందట! ‘‘పట్టాదారు పుస్తకాల కోసం మూడుసార్లు మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేశా. అధికారులు మూడుసార్లు దరఖాస్తును తిరస్కరించారు. డబ్బులిస్తే పని అయిపోతుందని తహసీల్దార్ కార్యాలయంలో అంటున్నారు’’ – కెల్ల సింహాద్రమ్మ, రైతు, కెల్ల, గుర్ల మండలం, విజయనగరం జిల్లా ఎకరం పొలం కాజేశారయ్యా... ‘‘మాది సొలస గ్రామం. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 198లో 3.53 ఎకరాల పొలం ఉంది. మా మామగారైన మల్లారెడ్డి నుంచి నా భర్త రోశిరెడ్డికి అనువంశికంగా ఈ పొలం సంక్రమించింది. నా భర్త అనుమతితో ఆయన సోదరుడు పెద వెంకటేశ్వరరెడ్డి ఈ భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో ఎకరం భూమి వెంకటేశ్వరరెడ్డిదే అంటూ 2016 మార్చిలో అధికారులు అడంగల్, 1బీ సృష్టించారు. 2017లో రెవెన్యూ అధికారులు ఇచ్చిన అడంగల్, 1బీలను ఆధారంగా చేసుకుని వెంకటేశ్వర రెడ్డి తన కుమారుడి పేరున ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. అదే ఏడాది నా భర్త మృతి చెందాడు. పొలం బాకీ విషయంలో ఈసీ తీయిస్తే మాకున్న 3.53 ఎకరాల్లో ఒక ఎకరం తగ్గినట్లు తెలిసింది. వెంటనే రెవెన్యూ అధికారులను కలిశాం. పొరపాటు జరిగి ఉంటుందని, మారుస్తామని చెప్పారు. సొసైటీలో తనఖా పెట్టి వ్యవసాయ రుణాన్ని తీసుకొని ఉన్నాం. రుణం ఉన్న పొలం నా భర్త రోశిరెడ్డి సంతకం లేకుండా వేరొకరికి ఎలా సంక్రమిస్తుంది? మాకు న్యాయం చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ’ – సామ్రాజ్యం, సొలస, గుంటూరు జిల్లా -
ధ్రువపత్రాలు లేని 18 లారీలు పట్టివేత
సరైన ధ్రువపత్రాలు లేకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్న 18 లారీలను అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్‌లోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి 18 లారీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. సోదాల్లో డీటీఓ రంగారావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటరమణారెడ్డి, ఎఫ్ఆర్వో అహ్మద్‌మియా, ఏసీటీవో సునీల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ధృవీకరణ పత్రాలు లేకుండానే ఓటర్ ఐడీ
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అవసరమైన వారికి ఓటర్ ఐడీలు తయారు చేసి ఇస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరిలో ఒకరు జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ 2011లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలం బేగంపేటలోని ఓ కంపెనీలో పని చేసిన ఇతగాడు... 2012లో మూసాపేటలో ఎస్ఎస్వీ ట్యాక్స్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి ఐటీ రిటర్న్‌్స వరకు వివిధ పనులు చేశాడు. ఈ విధంగా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించాడు. ఇదే సమయంలో ఇతడికి ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న డి.రాముతో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి అవసరమైన వారికి బోగస్ ఓటర్ ఐడీలు తయారు చేసి ఇచ్చే దందా ప్రారంభించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఓటర్ ఐడీలు కావాలంటూ తనను సంప్రదించే వారి వివరాలను శ్రీనివాస్ ఈ–మెయిల్ ద్వారా రాముకు పంపుతాడు. అతడు ఆ వివరాలతో ఓటర్ ఐడీ సృష్టించి ఆ రిఫరెన్స్ నెంబర్‌ను శ్రీనివాస్‌కు పంపిస్తాడు. దీని ఆధారంగా సదరు వినియోగదారుడు మీ సేవ కేంద్రం నుంచి ఓటర్ ఐడీ తీసుకునే వాడు. ఈ రకంగా ఒక్కో ఓటర్ ఐడీకి రూ.700 చొప్పున వసూలు చేస్తున్న శ్రీనివాస్ అందులో రూ.350 రాముకు ఇస్తున్నాడు. ఈ ద్వయం ఇప్పటి వరకు దాదాపు 450 మందికి బోగస్ వివరాలతో ఓటర్ ఐడీలు అందించింది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం పట్టుకుంది. నిందితుల నుంచి కంప్యూటర్, ధ్రువీకరణపత్రాలు లేకుండా ఓటర్ ఐడీ దరఖాస్తులు తదితరాలు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది -
మూడుగంటల్లో ముచ్చెమటలు
సమయం : ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు... ప్రాంతం : బోరబండ సమీపంలోని అల్లాపూర్... 200 మంది పోలీసు బలగాలు....ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని నలువైపులా చట్టేశాయి. గడప గడపనూ తట్టి అణువణువూ సోదాలకు దిగారు.....అప్పటివరకు నిద్రలో ఉన్న బస్తీ మొత్తం క్షణాల్లో మేల్కొంది...స్థానికులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి...మూడంటే మూడు గంటల్లోనే 64 బైక్‌లు..20 ఆటోలు...ఒక జీపు...మొత్తం 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం పోలీసు వర్గాలనే విస్తుగొల్పింది. ఇదీ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండ అల్లాపూర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో నెలకొన్న దృశ్యాలు. వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు 15 రోజులకోమారు నిర్వహించే కార్డన్‌సెర్చ్‌లో భాగంగా అల్లాపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ నంద్యాల నర్సింహ్మరెడ్డి, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో క్రైమ్, ఎస్ఓటీ, సీసీఎస్‌లకు చెందిన 200 మంది పోలీసు సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సోదాలు జరిపారు. ఇందులో ధృవపత్రాలు లేని మొత్తం 85 ద్విచక్ర, త్రీవీలర్స్ ఫోర్‌వీలర్స్ వాహనాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. 71 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఒక రౌడీషీటర్, ఒక చైన్‌స్నాచర్, ఇద్దరు మట్కా జూదరులు, నలుగురు దోపిడీదారులు, ఐదుగురు దొంగలు, 20 మంది ఆటో, 38 మంది బైక్ దొంగలుగా అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ధ్రువపత్రాలు చూపించిన వారికి తమ వాహనాలను అప్పగించగా, మిగిలిన వాహనాలను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కార్డన్ సెర్చ్‌తో సామాన్య ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని తెలిపారు. పాత నేరస్థులు సైతం కార్డన్‌సెర్చ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉమెన్స్ కానిస్టేబుల్స్తోనే ఇళ్ళలో సోదాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు ద్వారా తమ బస్తీలు, కాలనీల్లో ఉండే నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటున్నందున ప్రజలు కూడా పూర్తిగా తమకు సహకారం అందిస్తున్నారన్నారు. స్థానికులు కూడా కాలనీ, బస్తీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే అటువంటి వారిపై పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. -
అక్రమాలకు అడ్డా పీవీ సెల్!
- పాస్పోర్ట ఏజెంట్లతో అధికారి కుమ్మక్కు? - రూ.లక్షల్లో ముడుపులు తీసుకొని సానుకూలంగా వెరిఫికేషన్ రిపోర్టు సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా పాస్‌పోర్టు మంజూరు కావాలంటే అంత సులభం కాదు... దరఖాస్తుకు ఎన్నో ధ్రువపత్రాలు జతచేయాలి... మరెన్నో నిబంధనలును పాటించాలి. పోలీసు వెరిఫికేషన్ అయ్యాక పాస్‌పోర్టు కోసం ఎన్నో రోజులు నిరీక్షించాలి. అలాంటిది ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా నగరంలో తిష్టవేస్తున్న వారికి, ఉగ్రవాదులకు మాత్రం చకచకా పాస్‌పోర్టులు మంజూరవుతుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. హుజీతో సంబంధాలున్న మహమ్మద్ నసీర్ అరెస్టుతో ఈ పాస్‌పోర్టు వ్యవహారం తెరపైకి వచ్చింది. పాస్‌పోర్టు ఏజెంట్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్(పీవీ) సెల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఉగ్రవాదులు ఇండియన్ పాస్‌పోర్టులను చేజిక్కించుకుంటున్నారు. వాటితో ఎంతో సులభంగా విదేశాలకు వెళ్లొస్తున్నారు. విదేశీయులకు పాస్‌పోర్టు అందజేశారనే ఆరోపణలతో ఇప్పటికే ఒక ఎస్బీ కానిస్టేబుల్, ఒక హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే పీవీసీకి చెందిన ఒక అధికారి కనుసన్నల్లోనే ‘అక్రమ’ తతంగమంతా జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను ఏం చెప్తే.. అది చేసేలా కిందిస్థాయి సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ అధికారి...తనకు కావాల్సినవారు, అమ్యామ్యాలు భారీ మొత్తంలో ఇచ్చేవారికి సదరు చిరునామాలో వారు ఉన్నా...లేకున్నా..? ఉన్నట్టుగానే గ్రీన్‌సిగ్నల్ ఇప్పించి దరఖాస్తును పాస్‌పోర్టు కార్యాలయానికి పంపుతున్నాడని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. నగరంలోని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్‌జోన్, సౌత్‌జోన్, సెంట్రల్ జోన్ ఎస్బీ బ్రాంచ్‌లలోని కొంతమంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు సదరు అధికారి చెప్పిన విధంగా చేస్తారు. స్వయంగా వెళ్లి తనిఖీ చేయకుండానే..దరఖాస్తుదారుడు అదే చిరునామాలో ఉన్నాడని, పొరుగువారు కూడా అదే చెప్పారని, నేరచరిత్ర ఏమి లేదని పీవీసీ సెల్‌కు సమాచారం పంపిస్తున్నాడు. సెల్‌లోని అధికారి అంతా క్లియర్‌గా ఉందని పాస్‌పోర్టు కేంద్రానికి సమాచారం పంపుతాడు. బ్రోకర్లతో సత్సంబంధాలు... అక్రమ సంపాదనపై కన్నేసిన పీవీసీ సెల్ అధికారి... నగరంలోని పాస్‌పోర్టు బ్రోకర్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరు నెలల క్రితం జరిగిన ఆ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చంతా వారే భరించినట్లు సమాచారం. నెలవారీ లెక్కన ఇన్ని పాస్‌పోర్టులు అని వారితో దందా చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడని, ఈ క్రమంలోనే అక్రమ వలసదారులైన బంగ్లాదేశ్, మయన్మార్వాసులకు కూడా పాస్‌పోర్టులు ఇప్పించి భారీ మొత్తంలో ముడుపులో తీసుకుంటున్నాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాట వినకపోతే చాడీలు... కింది స్థాయి సిబ్బంది తాను చెప్పినపని చేయకపోతే.. వారు సక్రమంగా పని చేయడంలేదని ఉన్నతాధికారులకు సదరు అధికారి ఫిర్యాదు చేస్తాడు. ఇలా తన వ్యతిరేకులను బదిలీ చేయించేందుకు వ్యూహాలు రచిస్తాడు. గత ఐదేళ్లుగా అదే విభాగంలో పని చేస్తూ అక్రమాలకు తెరలేపిన సదరు అధికారిపై ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారని, ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. -
నా కారునే ఆపుతావా?
ట్రాఫిక్ ఎస్ఐను దూషించిన టీడీపీ నేత బంజారాహిల్స్: ‘నా కారునే ఆపి ధ్రువపత్రాలు అడుగుతావా?’ అంటూ యూసుఫ్‌గూడ డివిజన్ టీడీపీ నేత పి.యాదగిరి యాదవ్ ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ శివశంకర్‌ను ఫోన్లో దూషించాడు. సదరు ఎస్ఐ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యాదగిరిపై ఐపీసీ సెక్షన్ 506, ట్రాఫిక్ విధుల ఉల్లంఘన సెక్షన్ 186 కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ శివశంకర్ శ్రీకష్ణానగర్ ప్రధాన రహదారిలోని కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియం ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో యాదగిరి యాదవ్ డ్రైవర్ కారును నడుపుకుంటూ వెళ్తుండగా ఆపి పత్రాలు చూపించమని కోరారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమాని యాదగిరికి ఫోన్ చేసి చెప్పగా... అతను ఫోన్లోనే ఎస్ఐపై చిందులు తొక్కాడు. తాను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడినని, తన కారునే ఆపుతావా, నీకెంత ధైర్యమంటూ బెదిరించాడు. నీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. మర్యాదగా కారు వదిలిపెట్టాలని డాక్యుమెంట్లు అడగవద్దని హెచ్చరించాడు. దీంతో ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీమా పథకాలు చరిత్రాత్మకం
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్: సామాన్యుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ఒకేరోజు 3 బృహత్ బీమా పథకాలను ప్రారంభించడం చరిత్రాత్మకమని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ పథకాల్ని ప్రారంభించడం శుభసూచకమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన పథకాలను హైదరాబాద్ కేంద్రంగా శనివారం ఆమె ప్రారంభించారు. పలు బ్యాంకుల ద్వారా పథకాలను నమోదు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలనే యోచనతోనే కేంద్రం బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సురక్ష బీమా పథకం కింద నెలకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 12 చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కేవలం కాఫీ తాగే ఖర్చుతో రూ. 2 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి పౌరుడికీ బ్యాంకు ఖాతా కల్పించామన్నా రు. దేశ ఆర్థికాభివృద్ధి పథంలో ఈ పథకాలు చరిత్రాత్మకంగా నిల్చిపోతాయని స్మృతి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జన్‌ధన్ యోజన కింద రాష్ట్రం లో 63 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరి చామన్నారు. కోల్‌కతా కేంద్రంగా ప్రధాని మోదీ బీమా పథకాల్ని ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం విశ్వనాథన్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీతాపతి శర్మ, రిజర్వ్ బ్యాంక్ జీఎం జి.ఆర్. రపోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీవీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ లోథా, జి.సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి హైదరాబాద్‌లో అత్యాధునిక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకుడు శంకర్.. స్మృతి ఇరానీని కోరారు. శనివారం ఆయన కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కాగా కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా హన్మకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు.