సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అవసరమైన వారికి ఓటర్ ఐడీలు తయారు చేసి ఇస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరిలో ఒకరు జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ 2011లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలం బేగంపేటలోని ఓ కంపెనీలో పని చేసిన ఇతగాడు... 2012లో మూసాపేటలో ఎస్‌ఎస్‌వీ ట్యాక్స్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.
వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి ఐటీ రిటర్న్‌్స వరకు వివిధ పనులు చేశాడు. ఈ విధంగా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించాడు. ఇదే సమయంలో ఇతడికి ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న డి.రాముతో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి అవసరమైన వారికి బోగస్ ఓటర్ ఐడీలు తయారు చేసి ఇచ్చే దందా ప్రారంభించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఓటర్ ఐడీలు కావాలంటూ తనను సంప్రదించే వారి వివరాలను శ్రీనివాస్ ఈ–మెయిల్ ద్వారా రాముకు పంపుతాడు.
అతడు ఆ వివరాలతో ఓటర్ ఐడీ సృష్టించి ఆ రిఫరెన్స్ నెంబర్‌ను శ్రీనివాస్‌కు పంపిస్తాడు. దీని ఆధారంగా సదరు వినియోగదారుడు మీ సేవ కేంద్రం నుంచి ఓటర్ ఐడీ తీసుకునే వాడు. ఈ రకంగా ఒక్కో ఓటర్ ఐడీకి రూ.700 చొప్పున వసూలు చేస్తున్న శ్రీనివాస్ అందులో రూ.350 రాముకు ఇస్తున్నాడు. ఈ ద్వయం ఇప్పటి వరకు దాదాపు 450 మందికి బోగస్ వివరాలతో ఓటర్ ఐడీలు అందించింది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం పట్టుకుంది. నిందితుల నుంచి కంప్యూటర్, ధ్రువీకరణపత్రాలు లేకుండా ఓటర్ ఐడీ దరఖాస్తులు తదితరాలు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది