అక్రమాలకు అడ్డా పీవీ సెల్!
- పాస్‌పోర్‌ట ఏజెంట్లతో అధికారి కుమ్మక్కు?
- రూ.లక్షల్లో ముడుపులు తీసుకొని సానుకూలంగా వెరిఫికేషన్ రిపోర్టు
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా పాస్‌పోర్టు మంజూరు కావాలంటే అంత సులభం కాదు... దరఖాస్తుకు ఎన్నో ధ్రువపత్రాలు జతచేయాలి... మరెన్నో నిబంధనలును పాటించాలి. పోలీసు వెరిఫికేషన్ అయ్యాక పాస్‌పోర్టు కోసం ఎన్నో రోజులు నిరీక్షించాలి. అలాంటిది ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా నగరంలో తిష్టవేస్తున్న వారికి, ఉగ్రవాదులకు మాత్రం చకచకా పాస్‌పోర్టులు మంజూరవుతుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. హుజీతో సంబంధాలున్న మహమ్మద్ నసీర్ అరెస్టుతో ఈ పాస్‌పోర్టు వ్యవహారం తెరపైకి వచ్చింది. పాస్‌పోర్టు ఏజెంట్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్(పీవీ) సెల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఉగ్రవాదులు ఇండియన్ పాస్‌పోర్టులను చేజిక్కించుకుంటున్నారు.
వాటితో ఎంతో సులభంగా విదేశాలకు వెళ్లొస్తున్నారు. విదేశీయులకు పాస్‌పోర్టు అందజేశారనే ఆరోపణలతో ఇప్పటికే ఒక ఎస్‌బీ కానిస్టేబుల్, ఒక హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే పీవీసీకి చెందిన ఒక అధికారి కనుసన్నల్లోనే ‘అక్రమ’ తతంగమంతా జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను ఏం చెప్తే.. అది చేసేలా కిందిస్థాయి సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ అధికారి...తనకు కావాల్సినవారు, అమ్యామ్యాలు భారీ మొత్తంలో ఇచ్చేవారికి సదరు చిరునామాలో వారు ఉన్నా...లేకున్నా..? ఉన్నట్టుగానే గ్రీన్‌సిగ్నల్ ఇప్పించి దరఖాస్తును పాస్‌పోర్టు కార్యాలయానికి పంపుతున్నాడని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
నగరంలోని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్‌జోన్, సౌత్‌జోన్, సెంట్రల్ జోన్ ఎస్‌బీ బ్రాంచ్‌లలోని కొంతమంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు సదరు అధికారి చెప్పిన విధంగా చేస్తారు. స్వయంగా వెళ్లి తనిఖీ చేయకుండానే..దరఖాస్తుదారుడు అదే చిరునామాలో ఉన్నాడని, పొరుగువారు కూడా అదే చెప్పారని, నేరచరిత్ర ఏమి లేదని పీవీసీ సెల్‌కు సమాచారం పంపిస్తున్నాడు. సెల్‌లోని అధికారి అంతా క్లియర్‌గా ఉందని పాస్‌పోర్టు కేంద్రానికి సమాచారం పంపుతాడు.
బ్రోకర్లతో సత్సంబంధాలు...
అక్రమ సంపాదనపై కన్నేసిన పీవీసీ సెల్ అధికారి... నగరంలోని పాస్‌పోర్టు బ్రోకర్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరు నెలల క్రితం జరిగిన ఆ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చంతా వారే భరించినట్లు సమాచారం. నెలవారీ లెక్కన ఇన్ని పాస్‌పోర్టులు అని వారితో దందా చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడని, ఈ క్రమంలోనే అక్రమ వలసదారులైన బంగ్లాదేశ్, మయన్మార్‌వాసులకు కూడా పాస్‌పోర్టులు ఇప్పించి భారీ మొత్తంలో ముడుపులో తీసుకుంటున్నాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాట వినకపోతే చాడీలు...
కింది స్థాయి సిబ్బంది తాను చెప్పినపని చేయకపోతే.. వారు సక్రమంగా పని చేయడంలేదని ఉన్నతాధికారులకు సదరు అధికారి ఫిర్యాదు చేస్తాడు. ఇలా తన వ్యతిరేకులను బదిలీ చేయించేందుకు వ్యూహాలు రచిస్తాడు. గత ఐదేళ్లుగా అదే విభాగంలో పని చేస్తూ అక్రమాలకు తెరలేపిన సదరు అధికారిపై ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారని, ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.