
సాక్షి, అమరావతి: విద్య, ఉద్యోగ ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. కుల, నివాస, జనన వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకొంటే చాలని స్పష్టం చేసింది.
ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య తదితర సంక్షేమ శాఖలతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబరుతో కొత్తది పొందే వెసులుబాటు కల్పించింది.
ఇందుకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరంలేదు. దరఖాస్తుదారు తన వద్ద ఉండే జిరాక్స్ కాపీలో పేర్కొన్న నంబరు చెబితే కొత్తది ఇస్తారు. కుటుంబంలో గతంలో ఎవరూ ఎలాంటి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ పొంది ఉండకపోతే దరఖాస్తుదారు ప్రస్తుతం ఈకేవైసీ చేయించుకొని తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఒక వేళ దరఖాస్తుదారు ఈకేవైసీ చేయించుకొని సర్టిఫికెట్ పొంది ఉంటే, అతని తండ్రి లేదా తండ్రి తరపున రక్త సంబం«దీకులు ఎవరైనా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తహసీల్దార్ నుంచి కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చు.