బీమా పథకాలు చరిత్రాత్మకం
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ
హైదరాబాద్: సామాన్యుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ఒకేరోజు 3 బృహత్ బీమా పథకాలను ప్రారంభించడం చరిత్రాత్మకమని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ పథకాల్ని ప్రారంభించడం శుభసూచకమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన పథకాలను హైదరాబాద్ కేంద్రంగా శనివారం ఆమె ప్రారంభించారు. పలు బ్యాంకుల ద్వారా పథకాలను నమోదు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలనే యోచనతోనే కేంద్రం బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
సురక్ష బీమా పథకం కింద నెలకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 12 చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కేవలం కాఫీ తాగే ఖర్చుతో రూ. 2 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి పౌరుడికీ బ్యాంకు ఖాతా కల్పించామన్నా రు. దేశ ఆర్థికాభివృద్ధి పథంలో ఈ పథకాలు చరిత్రాత్మకంగా నిల్చిపోతాయని స్మృతి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జన్‌ధన్ యోజన కింద రాష్ట్రం లో 63 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరి చామన్నారు. కోల్‌కతా కేంద్రంగా ప్రధాని మోదీ బీమా పథకాల్ని ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ సీజీఎం విశ్వనాథన్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ సీతాపతి శర్మ, రిజర్వ్ బ్యాంక్ జీఎం జి.ఆర్. రపోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీవీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ లోథా, జి.సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి హైదరాబాద్‌లో అత్యాధునిక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకుడు శంకర్.. స్మృతి ఇరానీని కోరారు. శనివారం ఆయన కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కాగా కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా హన్మకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు.