ట్రాఫిక్ ఎస్‌ఐను దూషించిన టీడీపీ నేత
బంజారాహిల్స్: ‘నా కారునే ఆపి ధ్రువపత్రాలు అడుగుతావా?’ అంటూ యూసుఫ్‌గూడ డివిజన్ టీడీపీ నేత పి.యాదగిరి యాదవ్ ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ ఎస్‌ఐ శివశంకర్‌ను ఫోన్‌లో దూషించాడు. సదరు ఎస్‌ఐ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యాదగిరిపై ఐపీసీ సెక్షన్ 506, ట్రాఫిక్ విధుల ఉల్లంఘన సెక్షన్ 186 కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్‌ఐ శివశంకర్ శ్రీకష్ణానగర్ ప్రధాన రహదారిలోని కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియం ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో యాదగిరి యాదవ్ డ్రైవర్ కారును నడుపుకుంటూ వెళ్తుండగా ఆపి పత్రాలు చూపించమని కోరారు.
డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమాని యాదగిరికి ఫోన్ చేసి చెప్పగా... అతను ఫోన్‌లోనే ఎస్‌ఐపై చిందులు తొక్కాడు. తాను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడినని, తన కారునే ఆపుతావా, నీకెంత ధైర్యమంటూ బెదిరించాడు. నీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. మర్యాదగా కారు వదిలిపెట్టాలని డాక్యుమెంట్లు అడగవద్దని హెచ్చరించాడు. దీంతో ఎస్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా కారునే ఆపుతావా?
Published Mon, Aug 3 2015 12:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement