సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ఇదివరకే చాలా సార్లు చెప్పాను. అయినా తీరు మార్చుకోవడం లేదు. మండలాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు జిల్లా కేంద్రానికి వచ్చి మొర పెట్టుకుంటున్నారు. మండలాల్లో మీరేం చేస్తున్నట్లు..? అంటూ జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు తహసీల్దార్‌లపై సీరియస్ అయ్యారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల రికార్డులు ఇంకా సరిచేయకపోవడం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి రైతులు వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వచ్చి విన్నపాలు అందజేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కరించడం లేదన్నారు. కోర్టు స్టే ఇచ్చినవి అనర్హత కేసులు తప్ప మిగతా అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా స్వయంగా అలాగే మండలాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆదేశాలు జారీ చేసినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటగిరిల వారీగా అర్హత గల వారందరికీ పట్టా పాసు పుస్తకాలు సత్వరమే అందజేయాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్ణయం తీసుకుని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హత గలవారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment