పాసుబుక్కులు, చెక్కులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : భూరికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భూప్రక్షాళన, పాసుబుక్కులు, చెక్కుల్లో చోటు చేసుకున్న తప్పులతో పంపిణీలో జాప్యం జరుగుతున్న విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు దిశానిర్దేశనం కూడా చేశారు. ఇందుకోసం నాలుగు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు స్మితాసబర్వాల్, పెద్దపల్లికి శ్రీధర్, రాజన్న సిరిసిల్లకు సునీల్‌శర్మ, జగిత్యాలకు సందీప్‌కుమార్ సుల్తానియాలను నియమించారు. జూన్ 20 వరకు పూర్తయ్యేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో అధికారులు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పాసుబక్కులు, చెక్కుల పంపిణీ వేగవంతం.. జిల్లా అధికారులతో సమీక్షలు..
శుక్రవారం నుంచి వచ్చే నెల 20 వరకు ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదేపని మీద ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రజాప్రతినిధులు సైతం పల్లెబాట పడుతున్నారు. భూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సరిగా వ్యవహరించేలా చూడటంతోపాటు విదేశాలలో ఉన్న ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానంపైనా కసరత్తు చేస్తున్నారు. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక అధికారులు శుక్రవారం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు ఎన్ని పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంతమందికి చెక్కులిచ్చారు? మిగతావారికి ఏ కారణంతో పంపిణీ చేయలేదు? తదితరాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతోపాటు మంత్రులు స్వీకరించాలన్న ఆదేశంతో శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఏయే జిల్లాలో ఏ మేరకు పంపిణీ..
పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రైతుబంధు చెక్కుల పంపిణీని ఈనెల 10 సీఎం కేసీఆర్ హుజూరాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్‌లలో ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రాగా.. ఇప్పటివరకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో చెక్కుల సంఖ్య 1,46,027, చెక్కుల విలువ రూ.124,58,85,100. ఇప్పటివరకు 98,275 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.89,07,77,740 కాగా 54,735 చెక్కులను డ్రా చేసుకోగా రూ.53,99,06,050 నగదును పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 1,04,636, చెక్కుల సంఖ్య 1,05,357, చెక్కుల విలువ రూ.97,43,95,470. ఇప్పటివరకు 81,648 మంది రైతులకు 82,111 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.79,99,34,900 కాగా 44,766 మంది రైతులు 45,028 చెక్కులను డ్రా చేసుకున్నారు. రూ.44,68,32,850 నగదును పొందారు.
జగిత్యాల జిల్లాలో రైతుల సంఖ్య 2,05,555. చెక్కుల సంఖ్య 2,06,639, చెక్కుల విలువ రూ. 168,72,52,240. ఇప్పటివరకు 1,51,288 మంది రైతులకు 1,51,964 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 133,96,89,250 కాగా 92,568 మంది రైతులు 93,119 చెక్కులు డ్రా చేసుకోగా రూ.88,12,40,790 నగదు పొందారు.
- పెద్దపల్లి జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 67,328, చెక్కుల సంఖ్య 67,556, చెక్కు ల విలువ రూ.54,94,000,00. ఇప్పటివరకు 51,024 మంది రైతులకు 51,127 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.43,74,000,00 కాగా 16,429 మం ది రైతులు 16,467 చెక్కులు డ్రా చేసుకున్నారు. రూ.15,75,000,00 నగదు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment