సాక్షి, హైదరాబాద్: తొలి విడతలో పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు తీసుకోని రైతుల కోసం రెండో విడతగా ఈనెల 21 నుంచి మండల కేంద్రాల్లో పంపిణీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.
మొత్తం 51 లక్షలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, 40 లక్షల వరకు రైతులు తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దాదాపు 20 శాతం మంది పాస్ పుస్తకాలను తీసుకోలేదని రెవెన్యూ యంత్రాంగం లెక్కలు వేసింది. దీంతో వారికి రెండో విడతలో పంపిణీ చేయనున్నారు.
ఆధార్‌తోపాటు ఆధారం కూడా..
వాస్తవానికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలోనే రైతులు తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు తీసుకున్నారు. అయితే స్థానికంగా నివాసం ఉండని వారు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ భూములున్న వారు, తమ గ్రామంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రోజున వెళ్లలేని వారు తీసుకోలేదు. ఇలా పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు సగటున 20 శాతం మంది వరకు ఉంటారని అంచనా.
రంగారెడ్డి జిల్లాలో ఇది 30 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. వీరి కోసం స్పెషల్ డ్రైవ్ ఉంటుందని రెవెన్యూ శాఖ మొదటి నుంచీ చెబుతున్నా రైతుల్లో కొంత సందేహం ఉండేది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈనెల 21 నుంచి అన్ని జిల్లాల్లో మలి విడత (పాస్ పుస్తకాలు తీసుకోని రైతులకు) పంపిణీ ప్రారంభించాలని సీసీఎల్‌ఏ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.
గ్రామంలో పాస్ బుక్కు తీసుకోని రైతులు తమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిపోయిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారికి ఆధార్ కార్డుతోపాటు ఇతర ఆధారాలు చూపిస్తే సదరు రైతు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కు అందజేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు మండలాలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తయిందని, ఇక గ్రామాల్లో పంపిణీ ఉండదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment