‘రెవెన్యూ’ చేతివాటం
- రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు
- ఇప్పటికే పెండింగ్‌లో టైటిల్‌డీడ్స్, పాస్‌పుస్తకాలు
- అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు
విజయవాడ : స్థిరాస్తి లావాదేవీలకు కీలకమైన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ మంజూరులో రెవెన్యూ అధికారుల చేతివాటం పెచ్చుమీరింది. లంచాలు ఇస్తేనే పాస్ పుస్తకాలు మంజూరవుతున్నాయి. తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వేలాది రూపాయలు గుంజుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రియల్టర్లు, బిల్డర్లు భూములు, క్రయ విక్రయాలు చేసి చేతులు మార్చుకోవటానికి దండిగా పైకం ఇచ్చి పాస్ పుస్తకాలు పొందటాన్ని అలవాటు చేశారు. ఆస్తుల క్రయ, విక్రయాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు విధిగా పట్టాదారు పాస్‌పుస్తకం అవసరం కావడంతో వాటి కోసం ప్రజలు రెవెన్యూ సిబ్బందికి లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోంది. గత నాలుగేళ్లుగా పాస్ పుస్తకం కావాలంటే కనీసం రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 50 మండల రెవెన్యూ కార్యాలయాల్లో కనీసం 30 కార్యాలయాల్లో కుప్పలుతెప్పలుగా పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్‌ల్లో 10 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పాస్ పుస్తకం కోసం మీసేవలో దరఖాస్తు చేసి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శలు వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చిన వారికి రోజుల్లో పాస్‌పుస్తకం మంజూరవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాస్ పుస్తకం జారీ ఇలా..
పాస్ పుస్తకం పొందాలంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. దాన్ని వీఆర్‌ఓ పరిశీలించి నివేదిక రాయాలి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విచారించి తహశీల్దార్‌కు నివేదిక ఇస్తారు. ఇదంతా జరగడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతోంది. టైటిల్ డీడ్స్‌ను రెవెన్యూ డివిజనల్ అధికారి మంజూరు చేస్తారు. తహశీల్దార్‌కు పంపినా ఆర్డీవో కార్యాలయాల్లో అవి కదలటం లేదు. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం టైటిల్ డీడ్స్ ఇచ్చేస్తున్నారు.
బ్రోకర్ల హవా
కాగా పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ మం జూరులో రెవెన్యూ కార్యాలయాల వద్ద బ్రోకర్లు హల్‌చల్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కొందరు బ్రోకర్లు రెవెన్యూ సిబ్బందితో మిలాఖత్ అయి పాస్‌పుస్తకాలకు రేటు కుదిర్చి మంజూరు చేయిస్తున్నారు. బ్రోకర్లు ద్వారా వెళ్లిన వారికి పాస్‌పుస్తకాలు వెంటనే మంజూరు అవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
పాస్ పుస్తకాలు రద్దు చేసే యోచన
కాగా పాస్ పుస్తకాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవినీతిని అరికట్టలేక పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆస్తి ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేసే విషయం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పైకమిస్తేనే పాస్ పుస్తకం
Published Wed, May 20 2015 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement