సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’వెబ్‌సైట్ రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. పాస్ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్‌సైట్ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో కనపడటం లేదని, అవసరం లేని వాటికి పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క ఖాతాను నమోదు చేసేందుకు నాలుగు దశల్లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుండటంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోందని, దీనివల్ల ఇతర రెవెన్యూ పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని వారంటున్నారు. దీంతో భూ రికార్డుల సవరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఈనెల మొదట్లోనే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ధరణి వెబ్‌సైట్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులివే:
- తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు.
- ప్రతి రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్‌లోడ్ చేయించినా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్ సంతకాలు ఆగిపోతున్నాయి.
- ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, నాయిబ్ తహసీల్దార్, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు చేయాలి. ఇన్నిసార్లు బయోమెట్రిక్ అవసరం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఖాతాను నిర్ధారించే సమయంలో వీఆర్వో, తహసీల్దార్ బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందన్నది వారి అభిప్రాయం.
- ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి.. అందులో ఒక సర్వే నంబర్‌లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్‌కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్ సంతకం కోసం ఆ ఖాతా నంబర్‌ను నమోదు చేస్తే రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్‌కు కూడా డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయలేకపోతున్నారు.
- ధరణి వెబ్‌సైట్ ద్వారా భూముల మ్యుటేషన్ అవకాశం కూడా కల్పించారు. అయితే ఒక భూమిపై ఎక్కువ కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కేవలం మొదట రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలు లావాదేవీలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత లావాదేవీల వివరాలు కనిపించడం లేదు.
- ధరణి పోర్టల్ నెట్‌వర్క్, సర్వర్ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు.
- డిజిటల్ సంతకం చేసే ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సాంకేతిక కారణాల వల్ల డిజిటల్ సంతకం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ రైతుల ఖాతా నంబర్లను నమోదు చేసిన క్రమంలో ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే అవకాశం సీనియర్ అసిస్టెంట్లు, నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు.
- మిగిలిన సర్వే నంబర్లు నమోదు చేసే అవకాశం ధరణి పోర్టల్‌లో కల్పించారు. అయితే ఒక సర్వే నంబర్‌లో మిగిలి పోయిన సబ్ సర్వే నంబర్లను నమోదు చేసేందుకు ప్రాథమిక సర్వే నంబర్ కనిపించడం లేదు.
- డిజిటల్ సంతకం చేసేందుకు ఒక ఖాతాలోని అన్ని సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. అదే ఖాతాలోని ఇంటి స్థలాలు, వివాదాస్పద భూములు, అమ్ముకున్న భూముల వివరాలు కూడా కనిపిస్తున్నాయి.
చుక్కలు చూపుతున్న ‘ధరణి’!
Published Sun, Jul 1 2018 3:11 AM | Last Updated on Sun, Jul 1 2018 3:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment