సాక్షి, హైదరాబాద్: పోడుభూముల్లో సాగు చేసు కుంటున్న గిరిజనులకు పట్టా పుస్తకాల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది పోడు రైతులను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... గత నెల 27 నుంచి పట్టా పుస్తకా ల పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి 1,46,183 మంది పోడు రైతులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. అంటే 96.71 శాతం విజయవంతంగా పూర్తి చేశారు.
మరో 4,963 మందికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు పట్టాపుస్తకాలు పొందిన వారిలో పలు వురు అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అటవీభూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికే పోడు పట్టాకు అర్హతగా ప్రభు త్వం ప్రాథమిక నిబంధనను పెట్టింది.
అయితే పట్టాలు పొందిన వారిలో పలువురు అటవీ భూమి సాగుపైనే కాకుండా ఇతరత్రా వ్యాపకాలున్నాయంటూ క్షేత్రస్థాయిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
పునఃపరిశీలన
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడు భూముల సాగుకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నాలుగు అంచెల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హతలను ఖరారు చేశారు. ఎనిమిది నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తు పరిశీలన సమయంలో అర్జీదారుడు గిరిజనుడా? కాదా? అనే అంశాన్ని పరిశీలించిన అధికారులు... సదరు అర్జీదారుడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాడా? ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడా? లేక అటవీభూమిని మాత్రమే సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడా? అనే కోణంలో పరిశీలన చేయలేదు.
దీంతో పోడు అర్హుల్లో పలువురు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లు వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ చేసిన దరఖాస్తులను, పట్టా పుస్తకాలు పొందిన వారి వివరాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈమేరకు సంబంధిత 26 జిల్లాల కలెక్టర్లను పునఃపరిశీలించాలని ఆదేశించింది.
మరోవైపు నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పట్టాలు దక్కినట్లు వార్తలు రావడంతో గిరిజన సంక్షేమ శాఖ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని గిరిజన శాఖ పేర్కొంది.
9 జిల్లాల్లో పూర్తి
భద్రాద్రి కొత్తగుడెం, నిర్మల్, ములుగు, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట్ జిల్లాల్లో వందశాతం లక్ష్యం పూర్తయింది. మిగతా జిల్లాల్లో లక్ష్యసాధన దాదాపు పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 84 మంది అర్హులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 19 మంది అర్హులు ఉండగా... ఒక్కరికీ పట్టా ఇవ్వకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment