=‘ఉపాధి’ చెల్లింపుల్లో ప్రయోగాలు
=పర్యవేక్షణపై దృష్టిపెట్టని అధికారులు
=మూల్యం చెల్లించుకున్నాకే అప్రమత్తం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభమై ఆరేళ్లు పూర్తయ్యాయి. చెల్లింపుల విషయంలో నేటికీ కచ్చితత్వం లేదు. అధికారులు ప్రయోగాలకు పెద్దపీట వేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఫలితాలు రాలేదు సరికదా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పోస్టల్ ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షణ కొరవడితే ఇందులోనూ బోల్తా పడటం ఖాయం. వేతనాల చెల్లింపునకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నట్టు మొదట్లో అధికారులు చంకలు గుద్దారు.
తామే ఆదర్శమని గొప్పలు చెప్పారు. ఆ తర్వాత బయో మెట్రిక్ విధానమన్నారు. దాన్ని కూడా పక్కాగా అమలు చేయలేదు. ఈక్రమంలో ఉపాధి చెల్లింపుల మూలసూత్రాన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టల్ ద్వారానే ప్రధానంగా చెల్లింపులు చేపట్టాలి. వేతనదారుడి పేరుతో ఖాతా ప్రారంభించి,అందులో వేతనం జమయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఫినో అనే సంస్థతో చెల్లింపులకు శ్రీకారం చుట్టారు.
తమకెదురులేదన్నట్టుగా ఇష్టానుసారంగా ఆ సంస్థ వ్యవహరించింది. దొరికినోడికి దొరికినంతగా దోచుకున్న పరిస్థితి ఏర్పడింది. యూనియన్ బ్యాంకుకు వచ్చిన నిధులను నేరుగా కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్(సీఎస్‌పీ)లకు ఇవ్వకుండా మధ్యలో మండల కో- ఆర్డినేటర్లకివ్వడం, వారు తిరిగి సీఎస్‌పీలకు ఇవ్వడం... ఇలా చేతులు మారిన క్రమంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఇప్పుడా పద్ధతిని రద్దు చేసి పోస్టల్ ద్వారా చెల్లింపులకు నిర్ణయించారు.
వేతనదారుల పాసు పుస్తకాల ప్రారంభం, బయోమెట్రిక్ పద్ధతిలో భాగంగా వేతనదారుల ఫొటో, ఫింగర్ ప్రింట్స్ సేకరణ తదితర ప్రక్రియ అంతా డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో బ్రాంచి పోస్టాఫీసుల్లో పాసు పుస్తకాలు తెరవాల్సి ఉంది. అంతేకాకుండా పంపిణీ విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మరోవైపు బయోమెట్రిక్ వేలి ముద్రల సేకరణ ఏపీ ఆన్‌లైన్ సిబ్బంది చేయాలి. ఈ విధంగా అటు పోస్టల్, ఇటు ఏపీ ఆన్‌లైన్ సిబ్బంది సమాంతరంగా పనిచేసి, పంపిణీ విధానం అమల్లోకి తీసుకురావాలంటే కనీసం ఆరు నెలల సమ యం పడుతుంది.
కానీ డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్న డెడ్‌లైన్ పెట్టడం, ఆ ప్రక్రియపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆదరాబాదరాగా అంతా జరిగిపోతోంది. ప్రారంభంలోనే అప్రమత్తం కాకుంటే భవిష్యత్‌లో ఎం చేసినా లాభం లేదు. ఇందుకు పొరుగు జిల్లా విజయనగరంలోని పరిస్థితే తార్కాణం. ఇక్కడ పాసు పుస్తకాల ప్రారంభం తదితర విషయాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యం చెల్లించుకున్నాక అప్రమత్తమవ్వడం కన్నా ముందుగానే పక్కా పర్యవేక్షణ చేస్తే ఫలితం ఉంటుంది.