సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మరో మండలంలో బోగస్ పట్టాల బాగోతం బయటపడింది. ఒకే భూమిపై పలువురికి పట్టాలు జారీ చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. మంచాల మండలం లోయపల్లిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై జిల్లా యంత్రాంగం జరిపిన విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. రెండు దశాబ్ధాల క్రితం ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ పేరిట పాత తేదీలతో ఇప్పటికీ పాస్‌పుస్తకాలు, ప్రొసీడింగ్స్ జారీ అవుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం.. అక్రమాల వెలికితీతకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని విచారణకు నియమించింది. 1993లో మంచాల తహసీల్దార్‌గా జయరాజ్ ఉన్న కాలంలో ఈ నకిలీ పట్టాలు, ప్రొసీడింగ్స్ జారీకి తెర లేచినట్లు ప్రాథమికంగా తేలింది.
లోయపల్లిలోని సర్వేనంబర్లు 334, 335, 370లో దాదాపు 710 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు జారీచేసిన తహసీల్దార్.. అక్రమార్కులకు కూడా పాస్‌బుక్కులు ఇచ్చినట్లు బయటపడింది. ఇలా సుమారు కొన్ని వేల మందికి బోగస్ పాస్‌పుస్తకాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి 1993లో జన్మించనివారి పేరిట కూడా పట్టాదారు పాస్‌బుక్కులు సృష్టించినట్లు తేలడంతో జిల్లా యంత్రాంగం అవాక్కయింది. దీంతో జయరాజ్ పనిచేసిన కాలంలో పురుడు పోసుకోనివారి పేర పాస్‌పుస్తకాలు బయటపడిన వైనంపై జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ కూపీ లాగారు. ఈ నేపథ్యంలోనే గురువారం మంచాల మండలంలో పర్యటించిన జేసీ.. ఈ ఘటనపై విచారణ జరిపారు. యాచారం మండలం నల్లవె ల్లిలోనూ ఇదే తరహా అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోగస్ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని యంత్రాంగం నిర్ణయించింది.
బ్యాంకులకు టోపీ!
రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై పాసు పుస్తకాలను సృష్టించిన అక్రమార్కులు బ్యాంకులనూ బురిడీ కొట్టించారు. పాస్‌బుక్కులు అసలా? కాదా అనే అంశాన్ని నిర్ధారించుకోకుండానే ఎడాపెడా రుణాలిచ్చేసిన బ్యాంకర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరుట్ల శాఖ, బోడకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ భూములను తనఖా పెట్టి.. అడ్డగోలుగా అప్పులు చేసినట్లు స్పష్టమైంది. ఒకే భూమిని పలువురు తాకట్లు పెట్టి రుణాలు తీసుకున్నా గుర్తించని బ్యాంకర్లు.. తాజాగా అక్రమాలు బయటకురావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదిలావుండగా.. నకిలీ పాస్‌పుస్తకాల జారీ వైనంపై సమగ్ర దర్యాప్తు జరుపనున్నట్లు జేసీ చంపాలాల్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందా.. ఇవి ఫోర్జరీ సర్టిఫికెట్లా ? నకిలీలలు కేవలం లోయపల్లి గ్రామానికే పరిమితమయ్యాయా? ఇతర గ్రామాల్లో కూడా చోటుచేసుకున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీనికోసం డిప్యూటీ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.
మరో భూ మాయ!
Published Fri, Jan 3 2014 12:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement