- బినామీ రుణ వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లే అధికం
- బ్యాంకు అధికారుల హెచ్చరికతో ఇప్పటికే కొందరు చెల్లింపులు
- కూపీ లాగుతున్న రెవెన్యూ అధికారులు
42 పుస్తకాల్లో 41 నకిలీవని తేలిన వైనంబుచ్చెయ్యపేట: గ్రామస్థాయి నాయకుల నకి‘లీలలు’ వెలుగు చూస్తుంటే అధికారులే నోరెళ్లబెడుతున్నారు. తీగలాగుతున్న కొద్దీ డొంక భారీగా ఉన్నట్లు కనిపిస్తుండడంతో ఇది ఎక్కడికి పోతుందో అని ఆందోళన చెందుతున్నారు. నకిలీ పాసుపుస్తకాలు సృష్టించి కోట్లు కాజేసిన వైనం వెలుగు చూడడంతో విచారణతో అధికారులు బిజీ అయ్యారు. దాదాపు 20 గ్రామాల్లో నకిలీ పాసుపుస్తకాల తంతు ద్వారా 10 బ్యాంకుల నుంచి రూ.3 కోట్ల వరకు రుణం పొందారని ప్రాథమికంగా బయటపడింది. వడ్డాది, బుచ్చెయ్యపేట, అనకాపల్లి ఐఓబీ, రాజాం కెనరా, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, తుమ్మపాల విశాఖ గ్రామీణ బ్యాంకులు, సీతయ్యపేట ఎస్‌బీఐ, తురకలపూడి, పొట్టిదొరపాలెం, బుచ్చెయ్యపేట, వడ్డాది సహకార బ్యాంకుల్లో కోమళ్లపూడి, పి.కొండెంపూడి, కె.కొండెంపూడి, పొట్టిదొరపాలెం, గంటికొర్లాం, బుచ్చెయ్యపేట, పోలేపల్లి, కొండపాలెం, సీతయ్యపేట, పెదపూడి, కరక, తురకలపూడి, చింతపాక, గున్నెంపూడి, చిట్టియ్యపాలెం, రాజాం, ఆర్.భీమవరం, ఆర్.శివరాంపురం, మల్లాం గ్రామాలకు చెందిన 300 మంది బినామీలు రుణాలు పొందినట్లు భావిస్తున్నారు. బినామీల్లో టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, డెయిరీ ప్రతినిధులే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పేరున బినామీ రుణాలున్నట్లు సమాచారం. ‘మోసం, దారుణం నకిలీ పాసు పుస్తకాలపై భారీ రుణాలు’ అని ఈనెల 11న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన చోడవరం యూనియన్ బ్యాంక్ సిబ్బంది శుక్రవారం గ్రామాల్లోకి వెళ్లి రుణం చెల్లించకుంటే కేసులు పెడతామని హెచ్చరించడంతో పలువురు బినామీలు శనివారం గుట్టుచప్పుడు కాకుండా వచ్చి చెల్లింపులు జరిపారు. రావికమతాం మండలం కన్నంపేటకు చెందిన 10 మందికి గంటికొర్లాంలో భూములు లేకపోయినా వీరి పేరున వడ్డాది ఐఓబీలో రుణాలున్నాయి. బినామీలకు నకిలీ పాసుపుస్తకాలు ఎలావచ్చాయి, స్టాంప్‌లు, సంతకాలు ఎవరు చేశారు అర్థంకావడం లేదు. ఈ దిశగా దర్యాప్తు సాగితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్ సిద్ధయ్య వద్ద ప్రస్తావించగా ఇప్పటి వరకు 42 పాసు పుస్తకాలు పరిశీలించామని, వీటిలో 41 నకిలీవని తేలిందన్నారు. మరో 200 పుస్తకాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
నాయకుల నకి‘లీలలు’
Published Sun, Jul 13 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement