
సాక్షి, తాడేపల్లి : ఆర్వోఎఫ్‌ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వారికి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.
(చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు)
అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని అధికారులకు సూచించారు. అధికారులు మానవత్వంతో పని చేయాలని, గిరిజనులు ఆదాయం పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాను ఆధార్‌లో లింక్ చేయాలని సూచించారు. అదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment