భూరికార్డుల ప్రక్షాళన! | cm kcr review meeting on land records in telangana | Sakshi
Sakshi News home page

భూరికార్డుల ప్రక్షాళన!

Published Tue, Aug 8 2017 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

భూరికార్డుల ప్రక్షాళన! - Sakshi

భూరికార్డుల ప్రక్షాళన!

గ్రామం యూనిట్‌గా త్వరలో విస్తృత స్థాయిలో సర్వే
సర్వే ఆఫ్‌ ఇండియా సహా ప్రతిష్టాత్మక సంస్థల సహకారం
♦ అన్ని భూములపై స్పష్టత.. వివాదాలకు చెక్‌
♦ ప్రతి భూమికి కొత్త నంబర్లు.. కొత్త పాస్‌బుక్‌లు
♦ అధికారులతో 7 గంటలపాటు సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే విషయం నిగ్గుతేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండాలని.. గందరగోళానికి దారి తీసే అంశాలకు తెరవేయాలని చెప్పారు. గ్రామం యూనిట్‌గా, వీలైనంత త్వరగా సర్వే సెటిల్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌పీ సింగ్, సీనియర్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌రావు, బీఆర్‌ మీనా, జయేశ్‌ రంజన్, శాంతకుమారి, ప్రియదర్శిని, నదీమ్‌ అహ్మద్, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌రావు, జేసీ సుందర్‌ అబ్నార్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

‘‘భూములకు సంబంధించి నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరగలేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు, వివాదాలు తలెత్తున్నాయి. శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి రాష్ట్రంలోని భూమి అంతటినీ సర్వే చేయాలి. ఏ భూమి, ఎంత విస్తీర్ణంలో, ఎవరి పేరు మీద ఉందో గుర్తించాలి. ఇందుకు సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం తీసుకోవాలి..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

విస్తృతంగా సర్వే..
రాష్ట్రంలోని 10,850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే జరగాలని.. 3,500 మంది రెవెన్యూ అధికారుల్లో ఒక్కొక్కరిని మూడు గ్రామాలకు ఇన్‌చార్జిగా నియమించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామంలో పదిహేను రోజుల్లో గ్రామస్తులు, గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో సర్వే చేయాలన్నారు. సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర సర్వే ఏజన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు. మంచి కార్యక్రమం కాబట్టి ప్రజలు సహకరిస్తారని పేర్కొన్నారు.

అన్నీ ఆన్‌లైన్‌..
ఈ సర్వే సమయంలో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు మరో పనేదీ అప్పగించేది లేదని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ప్రస్తుతం ఇస్తున్న పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పహాణీ పత్రాలు కూడా గందరగోళంగా ఉన్నాయి. అన్ని కాలమ్స్‌ అవసరం లేదు. సరళంగా ఉండాలి. భూముల వివరాలు కచ్చితంగా తేల్చాక ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. సర్వే పూర్తయిన తర్వాత కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి. ప్రతి భూమికి ప్రత్యేక నంబర్‌ కేటాయించాలి. అవసరమైతే భూములకు హద్దు రాళ్లు కూడా పాతాలి. గ్రామస్థాయిలో నిర్వహించే రికార్డుల్లో ఉన్న వివరాలే సీసీఎల్‌ఏ దగ్గర కూడా ఉండాలి. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్‌లైన్‌లోనే అన్ని చోట్లా రికార్డులు మారాలి. డబ్బులు బ్యాంకులో వేసినా, ఏటీఎం నుంచి తీసుకున్నా.. వెంటనే బ్యాంకు రికార్డుల్లో నమోదుకావడం, ఎస్సెమ్మెస్‌ రావడం ఎలా జరుగుతుందో భూ రికార్డుల నిర్వహణ కూడా అలా ఉండాలి..’’అని కేసీఆర్‌ సూచించారు.

రైతుల లెక్కల్లో తేడాలు..
వచ్చే ఏడాది నుంచి రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. దాని కోసం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించారని కేసీఆర్‌ తెలిపారు. కానీ ఆ సర్వేలో వెల్లడైన వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదన్నారు. వ్యవసాయ శాఖ ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని తేల్చితే.. రెవెన్యూ శాఖ రికార్డుల్లో 1,100 మంది వరకు ఉన్నట్లుగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమిచ్చే పెట్టుబడి సాయం ఎవరికి అందాలనే సందేహం వస్తుందన్నారు. లెక్కా పత్రం లేకుండా, భూమి కలిగిన అసలైన రైతులకే డబ్బులు అందకుంటే అది పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు.

నేరాలు, గందరగోళానికీ చెక్‌..
ప్రస్తుతం భూ రికార్డులు సరిగా లేక అవినీతి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని... భూ వివాదాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. వీటన్నింటికీ చరమగీతం పాడాలంటే ఏ భూమి ఎవరికి చెందినదనే విషయంలో పూర్తి స్పష్టత రావడం అవసరమని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని.. గ్రామం యూనిట్‌గా సర్వే జరగాలని సూచించారు. ‘గ్రామంలో ఎంత భూమి ఉంది? ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది.? మొత్తం రాష్ట్రంలోని 2.70 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఏ భూమి దేని కింద ఉంది..?’అనే మొత్తం వివరాలు తయారు చేయాలని చెప్పారు. ఇలా ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పెట్టుబడి పథకం సక్రమంగా అమలవుతుందని... భవిష్యత్తులో వివాదాలను నివారించినట్లు కూడా అవుతుందని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement