సాక్షి, హైదరాబాద్: సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీక రణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. ఇవి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వ్యవ సాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు.
కాగా ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల విష యమై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి సారించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డు సరిగా ఉండాలంటే దాన్ని సరిచూసుకునే మాన్యువల్ రికార్డు (కాగిత రూపంలోని పత్రాలు) కూడా ఉం టేనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ రికార్డుకు ప్రామాణికంగా మరో రికార్డు లేకుండా ఇది సాధ్యం కాదని, 2004లో భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలయినప్పటి నుంచీ ఈ విషయంలోనే సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
గ్రామ పహాణీలు మాన్యువల్‌గా రాయాల్సిందే
ముఖ్యంగా పాత మాన్యువల్ పహాణీలు క్షేత్రస్థాయి సమాచారానికి సరిపోలేలా లేవని నిపుణులు చెబుతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేయకముందు సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని, ఒక్కసారయినా మన పహాణీని మనం రాసుకుంటేనే ఈ పీడ పోతుందని ఆయన చెప్పిన ఆ మాట అమల్లోకి రాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నది వారి వాదన. వారి సూచన ప్రకారం.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న మెజార్టీ సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కారం కూడా చూపవచ్చు.
ఇందుకోసం గ్రామ పహాణీని మాన్యువల్‌గా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పహాణీలను గ్రామసభ ముందుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి సవరించిన పహాణీ నకలును తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నకలును కంప్యూటర్‌లో రికార్డు చేయాలి. అప్పుడే ఒక గ్రామంలో ఎదురయ్యే భూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు. సర్వే నంబర్ల వారీగా జరిగిన తప్పులను గుర్తించవచ్చు. ప్రతి ఎంట్రీని పరిశీలించి ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గ్రామాల్లోనే సేకరించవచ్చు. అంటే ఒక్కసారయినా మాన్యువల్‌గా పహాణీ రికార్డులను రాయాల్సిందేనన్నమాట.
భూ సర్వేతోనే వివాదాలకు పరిష్కారం
అలాగే కాలానుగుణంగా భూరికార్డుల సవరణలను పరిశీలించి, పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది భూచట్టాల నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతి యేటా లేదా రెండేళ్లకోసారి గ్రామాలకు వెళ్లి భూరికార్డులను పరిశీలించి సవరించిన రికార్డులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ రికార్డు క్షేత్రస్థాయి కొలతలతో సరిపోలాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే భూముల సర్వే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, భూముల సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులంటున్నారు.
కలెక్టర్ల టైటిళ్లకు చట్టబద్ధత ఎంత?
ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదుల (గ్రీవెన్సులు) పరిష్కారం కలెక్టర్లే చేయాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీలు చేసే పనులన్నింటినీ కలిపి కలెక్టర్లు చేస్తున్నారు. అయితే, ఒక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్ప కలెక్టర్లు ఇచ్చే టైటిళ్లకు చట్టబద్ధత ఉండదని నిపుణులు వాదిస్తున్నారు. చట్టంలో లేనప్పుడు ఏ అధికారంతో కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)–1971 ప్రకారం మ్యుటేషన్‌పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ, ఇతర ఏ అంశంలోనూ రెవెన్యూ వర్గాలకు భూ సమస్యల పరిష్కారంపై అధికారం ఇవ్వలేదు. కలెక్టర్ల అధికారాలను ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే టైటిల్ గ్యారంటీ కోర్టుల్లో నిలబడదన్నది వారి వాదనగా ఉంది.
కలగాపులగంతోనే సమస్యల తీవ్రత
వాస్తవానికి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన రికార్డులు రెవెన్యూ వర్గాల వద్ద అందుబాటులో ఉన్న మాన్యువల్ పహాణీ ఆధారంగా చేసినవి కావు. వెబ్‌ల్యాండ్, భూరికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న 22(ఏ) జాబితా, గ్రామాలకు వెళ్లినప్పుడు రెవెన్యూ వర్గాలు అరకొరగా ఇచ్చిన సమాచారాన్ని కలగాపులగం చేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయడంతో రోజురోజుకూ ఈ సమస్యల తీవ్రత పెరిగిపోతోంది. ధరణి వ్యవస్థ ఏర్పాటు మంచిదే అయినా, భూలావాదేవీలకు పారదర్శక నిర్వహణకు ఈ పోర్టల్ ఆస్కారమిచ్చేదే అయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగిపోయేందుకు ఇదే కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి మాన్యువల్ పహాణీలను తయారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
నిపుణుల సూచనలివే.
► భూరికార్డుల ప్రక్షాళన పేరిట 2007 సెప్టెంబర్ నుంచి 100 రోజుల ప్రణాళికతో చేపట్టిన విధంగానే మరోమారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని భూసమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వెళ్లాలి. అక్కడ గ్రామ పహాణీని పరిశీలించి సవరించిన రికార్డులను ఆరా తీసి అక్కడికక్కడే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను గుర్తించాలి. సవరించిన పహాణీకి గ్రామసభ ఆమోదం పొంది దాన్ని మాన్యువల్‌గా తయారు చేయాలి. ఆ మాన్యువల్ రికార్డు ఆధారంగానే ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి.
► భూవివాదాల పరిష్కారానికి డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక అథారిటీలుండాలి. రెవెన్యూ కోర్టులా లేక ఇంకేదైనా పేరు పెట్టినా కనీసం జిల్లా స్థాయిలో అయినా ఈ వ్యవస్థ ఉండాల్సిందే.
► భాగ పంపకాలు లేదా భూయాజమాన్య హక్కుల వివాదాలను మాత్రమే సివిల్ కోర్టులకు పంపాలి. మిగిలిన అన్ని అంశాలను రెవెన్యూ వర్గాలు లేదా రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసే కోర్టులే పరిష్కరించాలి.
► సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి గాను కొత్త ఆర్‌వోఆర్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఈ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్దత లేదు. 9లక్షలకు పైగా ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆ అధికారం తహశీల్దార్లకు ఇచ్చి ఆజమాయిషీని కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చట్టాన్ని సవరించాలి.
► ధరణి పోర్టల్‌లో కనిపించే నిషేధిత భూముల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాలేదు. తహశీల్దార్ దగ్గర, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ల వద్ద ఉండే నిషేధిత జాబితాల్లో తేడాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తుది జాబితాను మళ్లీ ప్రచురించాలి.
కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు
భూముల రికార్డులన్నింటినీ కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు. కంప్యూటర్ రికార్డులు సరిగా ఉండాలంటే మానవ ప్రమేయంతో కూడిన కాగితం రికార్డులు ఉండాల్సిందే. తప్పులున్న రికార్డులను కంప్యూటర్‌లో పెట్టి ఇప్పుడు సరిచేసుకుంటూ పోతామంటే ఎలా సాధ్యమవుతుంది? సరిచేసిన రికార్డులను కంప్యూటర్‌లో పెట్టకపోతే వాటిని అది సరిచేయదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సరిచేసిన మంచి భూరికార్డును కంప్యూటర్‌లో పెట్టాలి. భూసమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం చేసేందుకు పారాలీగల్ వ్యవస్థను పునరుద్ధరించాలి.
– ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment