land survy
-
రీసర్వేలో మరో మైలురాయి.. వెయ్యి గ్రామాల్లో భూములకు హద్దులు
సాక్షి, అమరావతి: భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేపట్టిన జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో ప్రభుత్వం మరో మైలురాయి అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారానికి 1,000 గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా ముగించి.. దీనికి సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల 509 ఎకరాలను రీసర్వేలో కొలిచి కొత్త సరిహద్దులు నిర్ణయించారు. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేట్ ఏజెన్సీలు డ్రోన్ సర్వే చేసి ఇచ్చిన చిత్రాలు (ఓఆర్ఐ), భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే పూర్తి చేశారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వచ్చినప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్లతో మళ్లీ సర్వే చేశారు. రైతుల ఆమోదంతో సరిహద్దులు నిర్ధారణ పూర్తయ్యాక పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారవుతున్నాయి. అత్యధికం శ్రీకాకుళం.. అత్యల్పం అల్లూరి జిల్లా జిల్లాల వారీగా గ్రామాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 193 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 89, వైఎస్సార్ జిల్లాలో 72, నెల్లూరు జిల్లాలో 67, తిరుపతి జిల్లాలో 62 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. విస్తీర్ణ పరంగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,04,018 ఎకరాలను (58 గ్రామాలు) కొలిచి సర్వే పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 89,475 ఎకరాలు (28 గ్రామాలు), నెల్లూరు జిల్లాలో 78,102 ఎకరాలు (67 గ్రామాలు) కొలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 2 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. గుంటూరు జిల్లాలో 5 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామాల్లో కొత్త రికార్డులు తయారయ్యాయి. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం– భూకమతాల మ్యాప్), ఆర్ఎస్ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. కొత్త హద్దులు, తాజా భూయజమానుల వివరాలతో ఈ రికార్డులు రూపొందాయి. రీసర్వే పూర్తయిన కొత్త భూముల రికార్డులు అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో ఇకపై ఎలాంటి భూసంబంధిత పనులకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. భూ యజమానులు ఎక్కడ నుంచైనా రికార్డులను సరిచూసుకోవచ్చు. భూ యజమాని అనుమతి లేకుండా, అతనికి తెలియకుండా భూమి రికార్డులలో ఎలాంటి మార్పు చేయలేని విధంగా భూ సమాచార వ్యవస్థను రీసర్వే ద్వారా తయారు చేస్తున్నారు. రీసర్వే వేగంగా జరుగుతోంది రాష్ట్రంలో భూముల రీసర్వే వేగం పుంజుకుంది. సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. మొదటి దశలో 5,300 గ్రామాలకు 4,600 గ్రామాల్లో రీసర్వేలో మొదట చేపట్టే డ్రోన్ ఫ్లైయింగ్ (డ్రోన్లతో కొలత) పూర్తయింది. సెప్టెంబర్ నాటికి మొదటి దశ అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తవుతుంది. వర్షాలు తగ్గాక ఇంకా వేగంగా సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – సిద్ధార్థ్ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
Dharani Portal: ధరణిలో కాగితాలే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీక రణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. ఇవి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వ్యవ సాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు. కాగా ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల విష యమై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి సారించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డు సరిగా ఉండాలంటే దాన్ని సరిచూసుకునే మాన్యువల్ రికార్డు (కాగిత రూపంలోని పత్రాలు) కూడా ఉం టేనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ రికార్డుకు ప్రామాణికంగా మరో రికార్డు లేకుండా ఇది సాధ్యం కాదని, 2004లో భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలయినప్పటి నుంచీ ఈ విషయంలోనే సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. గ్రామ పహాణీలు మాన్యువల్‌గా రాయాల్సిందే ముఖ్యంగా పాత మాన్యువల్ పహాణీలు క్షేత్రస్థాయి సమాచారానికి సరిపోలేలా లేవని నిపుణులు చెబుతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేయకముందు సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని, ఒక్కసారయినా మన పహాణీని మనం రాసుకుంటేనే ఈ పీడ పోతుందని ఆయన చెప్పిన ఆ మాట అమల్లోకి రాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నది వారి వాదన. వారి సూచన ప్రకారం.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న మెజార్టీ సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కారం కూడా చూపవచ్చు. ఇందుకోసం గ్రామ పహాణీని మాన్యువల్‌గా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పహాణీలను గ్రామసభ ముందుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి సవరించిన పహాణీ నకలును తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నకలును కంప్యూటర్లో రికార్డు చేయాలి. అప్పుడే ఒక గ్రామంలో ఎదురయ్యే భూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు. సర్వే నంబర్ల వారీగా జరిగిన తప్పులను గుర్తించవచ్చు. ప్రతి ఎంట్రీని పరిశీలించి ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గ్రామాల్లోనే సేకరించవచ్చు. అంటే ఒక్కసారయినా మాన్యువల్‌గా పహాణీ రికార్డులను రాయాల్సిందేనన్నమాట. భూ సర్వేతోనే వివాదాలకు పరిష్కారం అలాగే కాలానుగుణంగా భూరికార్డుల సవరణలను పరిశీలించి, పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది భూచట్టాల నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతి యేటా లేదా రెండేళ్లకోసారి గ్రామాలకు వెళ్లి భూరికార్డులను పరిశీలించి సవరించిన రికార్డులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ రికార్డు క్షేత్రస్థాయి కొలతలతో సరిపోలాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే భూముల సర్వే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, భూముల సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులంటున్నారు. కలెక్టర్ల టైటిళ్లకు చట్టబద్ధత ఎంత? ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదుల (గ్రీవెన్సులు) పరిష్కారం కలెక్టర్లే చేయాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీలు చేసే పనులన్నింటినీ కలిపి కలెక్టర్లు చేస్తున్నారు. అయితే, ఒక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్ప కలెక్టర్లు ఇచ్చే టైటిళ్లకు చట్టబద్ధత ఉండదని నిపుణులు వాదిస్తున్నారు. చట్టంలో లేనప్పుడు ఏ అధికారంతో కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–1971 ప్రకారం మ్యుటేషన్‌పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ, ఇతర ఏ అంశంలోనూ రెవెన్యూ వర్గాలకు భూ సమస్యల పరిష్కారంపై అధికారం ఇవ్వలేదు. కలెక్టర్ల అధికారాలను ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే టైటిల్ గ్యారంటీ కోర్టుల్లో నిలబడదన్నది వారి వాదనగా ఉంది. కలగాపులగంతోనే సమస్యల తీవ్రత వాస్తవానికి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన రికార్డులు రెవెన్యూ వర్గాల వద్ద అందుబాటులో ఉన్న మాన్యువల్ పహాణీ ఆధారంగా చేసినవి కావు. వెబ్‌ల్యాండ్, భూరికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న 22(ఏ) జాబితా, గ్రామాలకు వెళ్లినప్పుడు రెవెన్యూ వర్గాలు అరకొరగా ఇచ్చిన సమాచారాన్ని కలగాపులగం చేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయడంతో రోజురోజుకూ ఈ సమస్యల తీవ్రత పెరిగిపోతోంది. ధరణి వ్యవస్థ ఏర్పాటు మంచిదే అయినా, భూలావాదేవీలకు పారదర్శక నిర్వహణకు ఈ పోర్టల్ ఆస్కారమిచ్చేదే అయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగిపోయేందుకు ఇదే కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి మాన్యువల్ పహాణీలను తయారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచనలివే. ► భూరికార్డుల ప్రక్షాళన పేరిట 2007 సెప్టెంబర్ నుంచి 100 రోజుల ప్రణాళికతో చేపట్టిన విధంగానే మరోమారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని భూసమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వెళ్లాలి. అక్కడ గ్రామ పహాణీని పరిశీలించి సవరించిన రికార్డులను ఆరా తీసి అక్కడికక్కడే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను గుర్తించాలి. సవరించిన పహాణీకి గ్రామసభ ఆమోదం పొంది దాన్ని మాన్యువల్‌గా తయారు చేయాలి. ఆ మాన్యువల్ రికార్డు ఆధారంగానే ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ► భూవివాదాల పరిష్కారానికి డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక అథారిటీలుండాలి. రెవెన్యూ కోర్టులా లేక ఇంకేదైనా పేరు పెట్టినా కనీసం జిల్లా స్థాయిలో అయినా ఈ వ్యవస్థ ఉండాల్సిందే. ► భాగ పంపకాలు లేదా భూయాజమాన్య హక్కుల వివాదాలను మాత్రమే సివిల్ కోర్టులకు పంపాలి. మిగిలిన అన్ని అంశాలను రెవెన్యూ వర్గాలు లేదా రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసే కోర్టులే పరిష్కరించాలి. ► సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి గాను కొత్త ఆర్వోఆర్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఈ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్దత లేదు. 9లక్షలకు పైగా ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆ అధికారం తహశీల్దార్లకు ఇచ్చి ఆజమాయిషీని కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చట్టాన్ని సవరించాలి. ► ధరణి పోర్టల్‌లో కనిపించే నిషేధిత భూముల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాలేదు. తహశీల్దార్ దగ్గర, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ల వద్ద ఉండే నిషేధిత జాబితాల్లో తేడాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తుది జాబితాను మళ్లీ ప్రచురించాలి. కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు భూముల రికార్డులన్నింటినీ కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు. కంప్యూటర్ రికార్డులు సరిగా ఉండాలంటే మానవ ప్రమేయంతో కూడిన కాగితం రికార్డులు ఉండాల్సిందే. తప్పులున్న రికార్డులను కంప్యూటర్లో పెట్టి ఇప్పుడు సరిచేసుకుంటూ పోతామంటే ఎలా సాధ్యమవుతుంది? సరిచేసిన రికార్డులను కంప్యూటర్లో పెట్టకపోతే వాటిని అది సరిచేయదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సరిచేసిన మంచి భూరికార్డును కంప్యూటర్లో పెట్టాలి. భూసమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం చేసేందుకు పారాలీగల్ వ్యవస్థను పునరుద్ధరించాలి. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు చదవండి: బతుకమ్మ వేడుల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి: సీఎం జగన్
-
సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఎస్ఓపీ ఖరారు రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల ఏరియా రాష్ట్రంలో 17,460 గ్రామాలు. 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్)కు సంబంధించిన సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్ఓపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. జూలై నాటికి 51 గ్రామాల్లో.. తొలి దశలో ప్రతి జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు 1 గ్రామం చొప్పున 51 గ్రామాలు. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఇందులో ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూరై్తందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి, జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇంకా 650 గ్రామాలకు గానూ, ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేశామని, ఆ మేరకు ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని అధికారులు వివరించారు. ఏప్రిల్ 2023 నాటికి.. ఆ తర్వాత ఈ దశలోనే రెండో విడతగా మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని, ఇక రెండో దశ సర్వేను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో మొదలు పెట్టి 2022 అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మూడో దశ వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు, సర్వే సిబ్బందికి కూడా సంప్రదాయ సర్వే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘‘అవినీతిరహితంగా కార్యక్రమం నిర్వహించాలి. సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి. ఎందుకంటే ఎక్కడ, ఎవ్వరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రతి చోటా చెకింగ్ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు’’ అని అధికారులకు సూచించారు. సంస్కరణలకు శ్రీకారం.. ‘‘మొత్తం భూరికార్డులు, డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి, కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం పొందేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వారమవుతాము. సర్వే ప్రక్రియకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలి. సర్వే తర్వాత అన్నింటికి పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూరై్తన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించి, చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతండి. ఆ విధంగా రైతుల ప్రమేయం కూడా ఉండాలి’’ అని సీఎం జగన్ తెలిపారు. హోర్డింగ్‌లు.. ‘సర్వే వేగంగా పూర్తవుతున్నందువల్ల రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటులో రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు, వార్డులలో ఒక హోర్డింగ్ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పూర్తి వివరాలు ఉండాలి. ఇదే కాకుండా ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేయండి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు.. ‘సమగ్ర సర్వే పూరై్తన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్డేషన్, సర్వే రాళ్లు పాతడం వంటివి పూర్తయ్యే నాటికి ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. అంటే ఈ ఏడాది జూలై నాటికి 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం తగిన ఏర్పాట్లు చూడండి’ అని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్ష.. ‘‘సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కావాలి. వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఈ ప్రక్రియలో భూపరిపాలన చీఫ్ కమిషనర్‌ది కీలకపాత్ర’’.. అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం, మైన్స్ డీఎంజీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
భూవివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక, ధరణి పోర్టల్ వచ్చాక 99.9 శాతం సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసిన అంశాలపై ఆయన శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ముందుకు సాగుతామని తెలిపారు. చట్టంలో అన్నీ తీసేయడం లేదని, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి, అవినీతికి ఆస్కారం ఉన్న వాటి తొలగింపుతోనే సంస్కరణలు ప్రారంభించామని వివరించారు. కంక్లూజివ్ టైటిల్ దిశగా వెళ్లడానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఈ చట్టంతో కొన్నింటికి తక్షణమే సమాధానం దొరుకుతుందని, మరికొన్నింటికి టైం పడుతుందన్నారు. ‘1,45,58,000 ఎకరాలకు సంబం« దించి 57.95 లక్షల రైతులకు 48 గంటల్లోనే రైతుబంధు కింద రూ.7,279 కోట్లు వెళ్లింది. వాటి విషయంలో సమస్య రాలేదు. అంటే వివాదం తక్కువగా ఉన్నట్లే. అయితే కొందరి పేరున భూమి తక్కువ, ఎక్కువ వంటి అంశాలతో సమస్యలు రావచ్చు. సమగ్ర సర్వే, డిజిటలైజ్ చేస్తే గొడవలు ఉండవు’ అని సీఎం పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే.. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం స్పష్టం చేశారు. ఆ పనులు చేసేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. నిబంధనల్లో సీలింగ్ క్లాజ్, ట్రబుల్ షూటర్ అనేవి పెడతామన్నారు. డిఫికల్టీ అనేది పెడతామని, తద్వారా సమస్యలు రావన్నారు. సీఎస్ సమీక్ష తర్వాత చట్టాల్లోని మరికొన్నింటిని రాబోయే రోజుల్లో తీసివేస్తామన్నారు. భూములకు సంబంధించి రెండుమూడు అంశాల్లో ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందన్నారు. అసైన్డ్ భూముల పంపిణీ అశాస్త్రీయంగా జరిగిందన్నారు. మెదక్ జిల్లా శివంపేట్‌లో 200 ఎకరాలుంటే ఆరేడు వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే చేశారని, తాను పుట్టిన ఊళ్లోనే 91 ఎకరాల పోరంబోకు భూమి ఉంటే.. 136 మందికి 120 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. గెట్టు, బాట చూపించలేదన్నారు. ఓట్లు వస్తున్నాయంటే సర్టిఫికెట్లు పంచారన్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో అవే తగాదాలు ఉన్నాయన్నారు. రాజకీయ పరమైన అసైన్ మెంట్లు చాలా జరిగాయన్నారు. ఎరవెల్లి పక్కన 356 ఎకరాలు దళితుల భూమి ఉందని, అందులో ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదయన్నారు. ఇలాంటి వాటి పరిష్కారానికి సర్వేనే సరైన జవాబని స్పష్టం చేశారు. భూపంపిణీ విషయంలో తాము గత పాలకుల్లా చేయబోమన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడానికి భూములే లేవని, దళితులకు 3 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు. కౌలుదారు కాదు.. రైతులే ముఖ్యం.. రాష్ట్రంలో కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని, రైతులకు అండగా ఉండటమే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒకప్పుడు 100 సర్వే నంబర్లుంటే ఇపుడు 1,400 అయ్యాయని.. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. 25 ఎకరాలకు పైన భూమి ఉన్నోళ్లు కేవలం 0.28 శాతం మంది మాత్రమేనని అన్నారు. ఒకనాడు జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు(కౌలుదారు) వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పాస్‌బుక్‌లో అనుభవదారు కాలమ్‌తో అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. తమకు రైతుల ప్రయోజనాలనే ప్రధాన మన్నారు. కౌలు అనేది రైతుకు, కౌలుదారుకు సంబంధించిన అంశమన్నారు. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్.. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ లను శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. 1962 నుంచి 1973 వరకు 12 ఏళ్లు సర్వే చేసి.. 1982 నుంచి 2003 వరకు 62 గెజిట్లు ఇస్తూనే పోయారన్నారు. అలాంటప్పుడు వక్ప్ భూములు ఉంటాయా?. 77,538.3 ఎకరాల వక్ఫ్ భూముల్లో 57,423.91 ఆక్రమణలో ఉందన్నారు. 6,938 మంది ఆక్రమణదారులు ఉండగా 6,074 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 2,186 మందిపై కేసులు పెట్టారని, 967 మందిపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. ఇక దేవాదాయ శాఖ భూములు 87,235 ఎకరాలు ఉంటే 21 వేల ఎకరాలు లీజ్‌లో ఉన్నాయన్నారు. అర్చకుల చేతిలో 23 వేలు ఎకరాలు ఉండగా, 22,545 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, అన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ లో 19 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఇకపై గజం కూడా కబ్జా కాకుండా కాపాడేందుకు మున్సిపల్, గ్రామపంచాయతీ పర్మిషన్ అనుమతులు, ఎన్ వోసీ జారీ, రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేస్తామన్నారు. సెక్షన్ 22 ఏ కింద బ్యాన్ చేసే అధికారం ఉందని, శనివారమే ఫైల్ తెప్పించుకొని సంతకం చేస్తానన్నారు. వీటితోపాటు అటవీ భూములను కూడా ఆటోలాక్ చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో ఆర్వోఎఫ్ఆర్ నమోదు.. ఆర్వోఎఫ్ఆర్ల్లో కూడా రాజకీయ దందా చేశారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఇచ్చినవి ఆర్వోఎఫ్ఆర్ పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనన్నారు. ఆ భూములు పొందిన వారు ఫలసాయంతో బతకాలే తప్ప ఓనర్లు కాదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అయితే, ఆర్వోఎఫ్ఆర్ ఉన్న వాటిని కూడా ధరణి వె»Œ సైట్లో ప్రత్యేకంగా పొందుపరుస్తామన్నారు. ఇవి ఉన్న 81 వేల మందికి రైతుబంధు ఇచ్చామన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాలని అడుగుతున్నారని, సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రైతులకు వచ్చినట్లే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ‘పోడు’కు పరిష్కారం.. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం అన్నారు. ఇప్పటికి దున్నుకుంటున్న వారు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. ఒక దర్బార్ పెట్టి ఇప్పుడున్న వరకు పోడు భూమలకు పట్టాలు ఇమ్మని చెప్పి క్లోజ్ చేస్తామన్నారు. భవిష్యత్‌లో అవకాశం ఇవ్వబోమని, దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతోందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటోందన్నారు. అందుకే అడవుల పునరుజ్జీవాన్ని హరితహారంలో భాగంగా చేస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. సాదా బైనామాలకు మరో అవకాశం.. సాదాబైనామాల క్రమబద్దీకరణకు 11,19,000 ఎకరాలకు దరఖాస్తులు వస్తే.. 6,18,000 ఎకరాలను ఒక్క రూపాయి లేకుండా క్రమబద్దీకరించామని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే మూడు సార్లు పొడిగించామని, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నారన్నారు. దీనిపై ఆలోచిస్తామని, అవసరమైమే 15 రోజుల టైంపెట్టి వన్ టైం చాన్ ్సగా అవకాశం ఇస్తామన్నారు. దీనిపై సీఎస్, ఇతర అధికారులు, కేబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ.. జీవో 58, 59 ప్రకారం.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు మరోసారి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆయా స్థలాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారంతా పేదలే కాబట్టి 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఓనర్లను చేశామన్నారు. మరొక అవకాశం ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటికి ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత ఏదైనా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ తోనే చేస్తామన్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్ రేట్లు ప్రకటన.. ఇకపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు తమకు కేటాయించిన పనులే చేస్తాయన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేసారి ప్రకటిస్తుందన్నారు. వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుతుతాయని, విచక్షణాధికారం అనేది ఉండదన్నారు. సర్కార్ ఆధ్వర్యంలోనే ధరణి.. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఎస్టీఎస్కు ఈ బాధ్యత అప్పగిస్తామన్నారు. ఈ పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. భూ రికార్డులను వెబ్సైట్ (పోర్టల్), డిజిటల్(సీడీల రూపంలో), డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేస్తున్నామన్నారు. ధరణి వెబ్సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌లను ఇస్తామని, ఇతర భూములన్నింటికి మెరూన్ కలర్ పాస్‌బుక్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటన్నింటిని ధరణి పోర్టల్‌లో పెడతామన్నారు. అధికారులు తప్పులు చేస్తే రిమూవల్/డిస్మిషన్ ఫ్రమ్ సర్వీసు అనే నిబంధనను చట్టంలో పెట్టామన్నారు. అంతా తప్పులు చేయరని పేర్కొన్నారు. వీఆర్ఓలు ఎక్కువ బాధలు పెట్టారు కాబట్టి రద్దు చేశామన్నారు. సభ్యుల పేర్లు నమోదుకు 2 నెలల సమయం.. వివాదాల పరిష్కారం సివిల్ కోర్టుల్లో చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కావాలని ఒకరికి అన్యాయం చేసే పరిస్థితి ఉంటే సదరు వ్యక్తి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి పరిష్కరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు రైతులందరికి 2 నెలల సమయం ఇచ్చి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అందరి పేర్లతో పట్టాలు ఇచ్చేలా చర్యలు ఉంటాయని, దీంతో వివాదాలు తగ్గిపోతాయన్నారు. కాగా, బండ్లగూడలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఎవరూ మార్చలేరు.. సమగ్ర సర్వేను ప్రభుత్వ, ప్రైవేటు వారిలో ఎవరు చేసినా తేడా రాదని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి కాబట్టి వాటిని ఎవరి మార్పు చేయలేరన్నారు. ఈ పనులను ప్రభుత్వ సారథ్యంలో ప్రైవేటు సంస్థలు చేస్తాయన్నారు. టాంపర్ చేయడానికి అవకాశం లేదని, ప్రతి సర్వే నంబర్‌కు కోఆర్డినేట్స్ ఇస్తారన్నారు. కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకున్నా ముందుకు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 9 వేల కోట్లే ఇవ్వడం లేదని, ఇక ధరణికి ఏం ఇస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరిపై పోరాటం చేయాలని ఎంపీలకు చెప్పానన్నారు. జీడీపీ క్రాష్ అయిందని, 24 శాతం మైనస్‌లోకి పోయి 31 శాతం పడిపోయిందన్నారు. అందులోంచి బయట పడితే కదా రాష్ట్రానికి ఇచ్చేదని విమర్శించారు. వారు ఇచ్చినా ఇవ్వకున్నా ముందుకు పోతామన్నారు. టపాసులు కాల్చుకుంటున్నారు... భూమి శిస్తు రద్దయిపోయి ప్రభుత్వమే రైతుబంధు ఇస్తున్నప్పుడు, అది వసూలు చేసే అధికారులు ఎందుకని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి ఆరోపణలు, అనేక లోపాలు ఉన్నందునే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామన్నారు. దీంతో ప్రజలు తమకు పీడ విరగడైంది అని టపాసులు కాల్చుకుంటున్నారన్నారు. ఈ చట్టం అమలు సమయంలో కొంత కఠినంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. బలహీన వర్గాలు కోరుకున్నట్లుగానే.. అసైన్ ్డ భూములను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించినా సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. దీంతో వాటిల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. అందుకే దళిత, గిరిజన సంఘాలతో మాట్లాడి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోమని ఆ ఎమ్మెల్యేకు చెప్పానన్నారు. ఆ బాధ్యతను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. కాగా, ట్రిబ్యునల్‌లో మెంబర్స్‌గా రిటైర్డ్, ఉద్యోగంలో ఉన్న ఐఏఎస్ అధికారులను నియమిస్తామన్నారు. వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం.. పే స్కేల్ అమలులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వీఆర్ఏలే ఉద్యోగం తీసుకోవచ్చని, లేదంటే కుటుంబంలోని వారసుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తామన్నారు. వారంతా ఇన్నేళ్ల నుంచి చాలా తక్కువ జీతంతో పనిచేశారన్నారు. రూ. 200 కాలం నుంచి పని చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 వేలు చేస్తే.. తాము రూ.10 వేలు చేశామన్నారు. వారికి వయోపరిమితి లేనందున 70 ఏళ్లు వచ్చినా వీఆర్ఏలుగా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుంటే ఇస్తామన్నారు. గిరిజనేతరులకు రైతుబంధు ఇచ్చేందుకు ఆలోచన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. వారికి ఎలా ఇవ్వాలో ఆలోచించి చర్యలు చేపట్టాలని సీఎస్‌కు చెబుతానన్నారు. చట్టపరంగా ఇబ్బంది లేకపోతే వారికి ఇస్తామన్నారు. నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు–2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్– 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం–2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
పడావు భూములకు రైతు‘బందు’?
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతుబంధు పథకంలో అన్ని భూములకు కాకుండా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రైతు సమగ్ర సర్వేలో పడావు భూములను ప్రత్యేకంగా గుర్తిస్తుండ డమే ఇందుకు కారణం.. దీంతో పడావు భూములకు పెట్టుబడి సాయం అందకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రైతు సమగ్ర సర్వేలో ప్రత్యేక కాలం చేర్చడమే ఈ ప్రచారానికి బలం చేకూర్చు తోంది. పెట్టుబడి సాయం పేర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు ఒక సీజన్లో రూ. 4 వేల చొప్పున ఇంత వరకు రెండు సీజన్లకుగాను ఏడాదిలో రూ. 8వేల చొప్పున రైతులకు అందించారు. ఈ ఖరీఫ్ సీజన్‌నుంచి పెట్టుబడి సాయం పెంచుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సీజన్‌కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10వేలు అందిస్తామని తెలిపింది. పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు.. సమగ్ర సర్వేలో పొందుపరిచిన అంశం నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడి సాయంలో కోతలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొత్తగా పడావు భూముల వివరాలు సేకరిస్తుండడంతో.. ఆ భూములకు రైతుబంధు ఇవ్వరేమోనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో రైతుబంధు వివరాలు సేకరించినప్పుడు పడావు భూముల వివరాలు లేవు. భూమి ఉంటే చాలు సాగులో ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా రైతుబంధు పథకం వర్తింపజేశారు. ఇప్పుడు పడావు భూముల అంశం చేర్చడంతో ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు ఒక సీజన్లో రూ. వెయ్యి చొప్పున పెంచిన భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే పడావు భూముల అంశం తీసుకువచ్చిందని రైతులు అనుమానిస్తున్నారు. -
సర్వే షురూ..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే మొదలైంది. వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మే 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వ్యవసాయ అభివృద్ధి, రైతు పథకాల అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నారు. ఏఈఓలు గత సంవత్సరం రైతులు ఏ పంట వేశారు, నేల స్వభా వం, మార్కెటింగ్ విధానం, పంట రుణాలు, పనిముట్లు, రైతుల బ్యాంక్ ఖాతా, పట్టాదారు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. 39 కాలమ్స్‌తో కూడిన ప్రణాళికను తయారు చేసి రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో 101 క్లస్టర్లు ఉన్నాయి. 95 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు పనిచేస్తున్నారు. అదేవిధంగా 1లక్ష 18వేల 863 మంది రైతుల వివరాలను సేకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఏఈఓలు ఉదయం, సాయంత్రం వేళల్లో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ప్రారంభించలేదని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి జిల్లాలో సర్వే ప్రారంభమైందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఏఈఓలు ఏ,బీ పార్ట్ ప్రకారం రైతుల సమాచారం సేకరించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. పార్ట్–ఏలో రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు పేరు, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సర్వే నంబర్ వివరాలు, ఆధార్‌కార్డులో ఉన్నవిధంగా రైతు పేరు, తండ్రి లేదా భర్త పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ సంవత్సరం నమోదై ఉంటే జూలై 1ని పుట్టిన తేదీగా పేర్కొంటున్నారు. అదేవిధంగా రైతుబంధు పథకంలో తీసుకున్న సెల్‌ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకుంటున్నారు. బ్యాంక్‌ఖాతా, ఐఎఫ్‌సీ కోడ్ వివరాలను రైతు బీమాలో పేర్కొన్న ఎల్ఐసీ ఐడీ నంబర్ నమోదు చేసుకుంటున్నారు. పార్ట్–బీలో రైతు విద్య వివరాలు, భూమి సాగుకు యోగ్యమైన వివరాలు, సాగునీటి వసతి, సూక్ష్మ సేద్యం వివరాలు, నేల స్వభావం, భూసారం వివరాలు, ఏయే పంటలకు భూమి అనువుగా ఉంది, వ్యవసాయం యంత్రాల వివరాలు, ఎంత రుణం తీసుకున్నారు, ఏయే సంఘాల్లో సభ్యులు ఉన్నారు, పశుసంపద, సేంద్రియ వ్యవసాయం తదితర వివరాలు సేకరిస్తున్నారు. మే 20 వరకు ప్రక్రియ.. జిల్లాలోని 18 మండలాల్లో 101 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ ఒక ఏఈఓతో సర్వే చేయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన 95 మంది ఏఈఓలు ఉండగా, మిగతా వారిని ఆత్మ, హార్టికల్చర్ ఉద్యోగుల ద్వారా సర్వే చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మే 20 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుకు ఈ సర్వే ఎంతగానో దోహదపడనుంది. వ్యవసాయ యాంత్రీకరణ, రైతుబంధు, రైతుబీమా, సూక్ష్మసేద్యం, పంట రుణాలు, మద్దతు ధర, ఎరువులకు సబ్సిడీ వంటి పథకాల అమలులో సర్వే కీలకం కానుంది. సమగ్ర సర్వే ఆధారంగానే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు దోహదపడే అవకాశం ఉంది. రైతు పథకాలకు నిధుల కేటాయింపులో ప్రామాణికం కానుంది. లక్ష 18 వేల మంది రైతులు జిల్లాలో 1,18,863 మంది రైతులు ఉన్నారు. 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. దాదాపు లక్ష 10వేల హెక్టార్ల వరకు పత్తి, 40వేల ఎకరాల్లో సోయా, మిగితా కందులు, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే నెలరోజుల్లో సర్వే పూర్తి కావడం అనుమానంగా ఉంది. ఓవైపు ఎండలు ముదురుతుండటం, మరోవైపు ఏఈఓలకు ఎన్నికల విధులు కేటాయించడంతో పని ఒత్తిడి కారణంగా సర్వేకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సకాలంలో సర్వే పూర్తి చేస్తే రైతులకు మేలు జరగనుంది. సర్వే ప్రారంభమైంది జిల్లాలో రైతు సమగ్ర సర్వేను ప్రారంభించాం. 101 క్లస్టర్లలో లక్ష 18వేల మంది రైతుల వివరాలు ఏఈఓలు సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం. – ఆశాకుమారి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
సర్వే.. సవాలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకురావడం.. ఇంకా స్వల్ప సమయమే మిగిలి ఉండటంతో సర్వే సకాలంలో పూర్తవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో రైతుల సమగ్ర వివరాలు రాబట్టడం వ్యవసాయ సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. ఉద్దేశమిదీ.. రైతులకు అన్ని ప్రయోజనాలు చేకూరేందుకు వీలుగా వారి సమగ్ర వివరాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి రైతును కలిసి అన్ని వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. పంట కాలనీల ఏర్పాటు, భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ వివరాలు కీలకంగా మారుతాయని సర్కారు భావించింది. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. వివరాల సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తీర్ణాధికారుల(ఏఈఓ)కు అప్పగించింది. సాధ్యమేనా..? వాస్తవంగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే జిల్లాలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఆ వెంటనే నోటిఫికేషన్ వెలువడటంతో సర్వే నిలిచిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నికల విధులు కేటాయించడంతో ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో.. ఈనెల 15 నుంచి సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో 2.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరి నుంచి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లాలోని 80 మంది ఏఈఓలది. ప్రభుత్వ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని వివరాలు తీసుకోవడానికి వీరు ప్రతి రైతును విధిగా కలవాల్సిందే. ఒక్కో రైతు నుంచి వివరాలు సేకరించడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఈ లెక్కన ఒక్కో ఏఈఓ రోజుకు సగటున 25 నుంచి 30 మంది రైతులను మాత్రమే కలవగలుగుతున్నారు. అంటే జిల్లా అంతట కలుపుకుంటే రోజుకు 2,400 మంది వివరాలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. వచ్చేనెల 15లోపు సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం గడువు తేదీ వరకు 60 వేల మంది రైతుల వివరాలు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. వేగం మరింత పెంచినా... ఈ సంఖ్య లక్ష దాటదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఈ బాధ్యతలు కూడా.. రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించే బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. ఇప్పటికే సర్వే పనిభారంతో సతమతమవుతున్న ఏఈఓలకు.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ తదితర వాటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొను గోలుకేంద్రాల వద్ద కూడా వీరు విధులు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. కొందరు ఎన్నికల శిక్షణకు కూడా హాజరవుతున్నారు. దీంతో వీరికి పనిభారం పెరిగింది. 39 కాదు.. 44 అంశాలపై వివరాలు రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. తాజాగా ఈ జాబితాలో మరో 5 అంశాలను చేర్చి 44కు పెంచడంతో ఏఈ ఓలు రైతుల వివరాల సేకరణ కోసం మరికొంత సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది కూడా జాప్యానికి కొంత కారణమవుతోంది. ఠారెత్తిస్తున్న భానుడు ఎండలు మండిపోతున్నాయి. పగలు సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం పదిన్నర గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలోపు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాతే రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద రోజుకు ఏడు గంటలపాటు ఏఈఓలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివ రాలు సేకరిస్తున్నారు. ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితులు చుట్టుముడుతుండటంతో సర్వే సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గడువులోగా పూర్తిచేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి ఏఈఓలను మినహాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతున్నాం. ఈ విధులను సడలిస్తే కొంత ఊరట కలుగుతుంది. ఇలా దాదాపు ఐదు రోజులు మాకు కలిసివస్తాయి. సకాలంలో రైతుల సమగ్ర సర్వే పూర్తి చేయడంలో ఇవి కీలకంగా మారుతాయి. సాధ్యమైనంత వరకు గడువులోపు రైతులందరి వివరాలు సేకరిస్తాం. అవసరమైతే ఏఈఓలకు సహాయకులుగా మరికొంత మంది సిబ్బంది సేవలను తీసుకోవాలని యోచిస్తున్నాం. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సేకరిస్తున్న వివరాలు ఇవీ.. రైతు భూమి విస్తీర్ణం, విద్యార్హతలు, సాగునీటి వసతి, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల స్వభావం, సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, ఖరీఫ్–యాసంగి సీజన్లలో వేసిన పంటలు, తదుపరి సాగుచేయాలనుకుంటున్న పంట, తోటల సాగు, పంటరుణం, రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్న పంటలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఫోన్ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా? కిసాన్ పోర్టల్ నుంచి సలహాలు అందుతున్నాయా? తదితర అంశాలకు çసంబంధించి వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు. -
ఇక పంటల సర్వే
సంగెం: రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన చేసిన విధంగానే మరో సమగ్ర సర్వేకు సిద్ధమవుతోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో వారు సాగు చేస్తున్న పంటల వివరాలు, సాగునీటి వసతి, భూ వివరాల వంటివి మొత్తం 30 అంశాలకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి సేకరించనున్నారు. ఈనెల మొదటివారంలో ప్రారంభం కానున్న ఈ సమగ్ర సర్వేలో రైతుల వివరాలను సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లలన్నింటిని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పంటకాలనీలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలుసుకునేందుకు ఈ సర్వేను ప్రభుత్వం చేపట్టనుంది. దీని ఆధారంగా ఏ గ్రామంలో పంటకాలనీలు నెలకొల్పాలి, ఏ పంటలు పండించాలనేది నిర్ధారించనున్నారు. దీంతో పాటు స్థానికంగా పండిన పంటలతో ఆహారశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లాలో 1,88,890 మంది రైతులు.. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం 3,87,629 ఎకరాల భూమి ఉండగా వ్యవసాయ యోగ్యమైన భూమి 1,72,463 ఎకరాలు ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల కంటే తక్కువగా ఉన్న రైతులు 1,38,108 మందికి 1,39,457 ఎకరాలు, ఐదెకరాల లోపు 35,510 మందికి 1,21, 365 ఎకరాలు, 10 ఎకరాల వరకు ఉన్న రైతులు 12,035 మందికి 78,009 ఎకరాలు, 25 ఎకరాల వరకు ఉన్న రైతులు 3,027 మందికి 40,437 ఎకరాలు, 25 ఎకరాలకు పైబడిన రైతులు 210 మందికి 8,360 ఎకరాల భూమి ఉన్నది. జిల్లాలో ముఖ్యమైన పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, జొన్న, కందులు, పెసర్లు, మిర్చి వంటి పంటలు అధికంగా పండిస్తారు. మెరుగు పడనున్న ఉపాధి అవకాశాలు.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభించనున్న ఈ సర్వే మార్చి వరకు కొనసాగనుంది. ఈ సర్వేలో రైతుల నుంచి పలు అంశాలపైన అధికారులు వివరాలను సేకరించి ప్రింటెడ్ ఫార్మాట్లో నమో దు చేసుకుంటారు. ఈ సర్వే ఆధారంగా చేసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రజలకు, వారి అవసరాలను తీర్చే పంటలనే స్థానికంగా పండించాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పంట కాలనీలు నెలకొల్పి రైతుకు వ్యవసాయంపైన నిత్యం అవగాహన కల్పిస్తూ పంటలకు సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఆహారశుద్ది కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసి, అధిక ధరలకు విక్రయించేలా చర్యలు చేపట్టనున్నారు. దీని ద్వారా రైతులకు ఆదాయంలో అభివృద్ధి, నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సర్వేలో సేకరించనున్న అంశాలు ఇవే.. పంటకాలనీల ఏర్పాటుకు సంబంధించి రైతుల నుంచి అధికారులు పలు వివకాలను సేకరించనున్నారు. రైతు పట్టాదారు పాసు పుస్తకం నంబర్, రైతు పేరు, తండ్రి పేరు, పురుషుడు, లేదా స్త్రీ, అనే వివరాలు, ధరణి పోర్టర్లో ఆధార్ నంబర్‌తో లింక్ చేశారా అనే వివరాలు, పుట్టిన తేది, సెల్ ఫోన్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్, సామాజిక స్థితి వివరాలు, రైతుకు ఉన్న మొత్తం భూమి, సర్వే నంబర్ల వివరాలు పార్ట్ ఏ మొదటి పేజీలో నమోదు చేయనున్నారు. భూమి వ్యవసాయానికి అనువుగా ఉందా లేదా అనే వివరాలు, సాగు చేయడానికి నీటికి దేనిపైన ఆధారపడుతున్నారనే వివరాలు సేకరించనున్నారు. సాగుచేయడానికి బోర్లు, బావి, కాల్వ, చెరువు, వర్షాధారంగా పంటలను సాగుచేస్తున్నారా అనే విషయాలను తెలుసుకోనున్నారు. రైతులు సహకరించాలి.. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర పంటల సర్వేకు జిల్లాలోని రైతులంతా సహకరించాలి. ప్రభుత్వం పంట కాలనీల ఏర్పాటులో భాగంగా పంటల సమ గ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి సర్వేను ప్రారంభి స్తాం. ఇప్పటికే ఒక ఫార్మట్‌ను అందించారు. దాని ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేయాలని సూచించాం. ఇంకా మార్పులు చేర్పులపైన చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు అధికారులతో సహకరించి సర్వేలో పాల్గొని తమ భూములకు సంబంధించి సమగ్రంగా సమాచారం అందించాలి. దీని ద్వారా ప్రభుత్వం పంట కాలనీల ఏర్పాటు, ఆహారశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తోంది. రైతులు పథకాలను వినియోగించుకోవాలి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయశాఖాధికారి -
మునగపాక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
విశాఖ: విశాఖ జిల్లాలోని మునగపాక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునగపాక టీచర్స్ కాలనీ 138, 139 సర్వే నెంబర్లలోని ఖాళీ భూములను రీసర్వే చేయాలంటూ స్థానికులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహశీల్దార్ కార్యాలయం భవనం పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. సదరు యువకుడ్ని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో స్థానికులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.