సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకురావడం.. ఇంకా స్వల్ప సమయమే మిగిలి ఉండటంతో సర్వే సకాలంలో పూర్తవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో రైతుల సమగ్ర వివరాలు రాబట్టడం వ్యవసాయ సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది.
ఉద్దేశమిదీ.. రైతులకు అన్ని ప్రయోజనాలు చేకూరేందుకు వీలుగా వారి సమగ్ర వివరాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి రైతును కలిసి అన్ని వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. పంట కాలనీల ఏర్పాటు, భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ వివరాలు కీలకంగా మారుతాయని సర్కారు భావించింది. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. వివరాల సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తీర్ణాధికారుల(ఏఈఓ)కు అప్పగించింది.
సాధ్యమేనా..?
వాస్తవంగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే జిల్లాలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఆ వెంటనే నోటిఫికేషన్ వెలువడటంతో సర్వే నిలిచిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నికల విధులు కేటాయించడంతో ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో.. ఈనెల 15 నుంచి సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో 2.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరి నుంచి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లాలోని 80 మంది ఏఈఓలది. ప్రభుత్వ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని వివరాలు తీసుకోవడానికి వీరు ప్రతి రైతును విధిగా కలవాల్సిందే. ఒక్కో రైతు నుంచి వివరాలు సేకరించడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది.
ఈ లెక్కన ఒక్కో ఏఈఓ రోజుకు సగటున 25 నుంచి 30 మంది రైతులను మాత్రమే కలవగలుగుతున్నారు. అంటే జిల్లా అంతట కలుపుకుంటే రోజుకు 2,400 మంది వివరాలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. వచ్చేనెల 15లోపు సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం గడువు తేదీ వరకు 60 వేల మంది రైతుల వివరాలు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. వేగం మరింత పెంచినా... ఈ సంఖ్య లక్ష దాటదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
ఈ బాధ్యతలు కూడా..
రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించే బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. ఇప్పటికే సర్వే పనిభారంతో సతమతమవుతున్న ఏఈఓలకు.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ తదితర వాటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొను గోలుకేంద్రాల వద్ద కూడా వీరు విధులు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. కొందరు ఎన్నికల శిక్షణకు కూడా హాజరవుతున్నారు. దీంతో వీరికి పనిభారం పెరిగింది.
39 కాదు.. 44 అంశాలపై వివరాలు
రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. తాజాగా ఈ జాబితాలో మరో 5 అంశాలను చేర్చి 44కు పెంచడంతో ఏఈ ఓలు రైతుల వివరాల సేకరణ కోసం మరికొంత సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది కూడా జాప్యానికి కొంత కారణమవుతోంది.
ఠారెత్తిస్తున్న భానుడు
ఎండలు మండిపోతున్నాయి. పగలు సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం పదిన్నర గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలోపు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాతే రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద రోజుకు ఏడు గంటలపాటు ఏఈఓలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివ రాలు సేకరిస్తున్నారు. ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితులు చుట్టుముడుతుండటంతో సర్వే సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
గడువులోగా పూర్తిచేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి ఏఈఓలను మినహాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతున్నాం. ఈ విధులను సడలిస్తే కొంత ఊరట కలుగుతుంది. ఇలా దాదాపు ఐదు రోజులు మాకు కలిసివస్తాయి. సకాలంలో రైతుల సమగ్ర సర్వే పూర్తి చేయడంలో ఇవి కీలకంగా మారుతాయి. సాధ్యమైనంత వరకు గడువులోపు రైతులందరి వివరాలు సేకరిస్తాం. అవసరమైతే ఏఈఓలకు సహాయకులుగా మరికొంత మంది సిబ్బంది సేవలను తీసుకోవాలని యోచిస్తున్నాం. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి
సేకరిస్తున్న వివరాలు ఇవీ..
రైతు భూమి విస్తీర్ణం, విద్యార్హతలు, సాగునీటి వసతి, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల స్వభావం, సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, ఖరీఫ్–యాసంగి సీజన్లలో వేసిన పంటలు, తదుపరి సాగుచేయాలనుకుంటున్న పంట, తోటల సాగు, పంటరుణం, రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్న పంటలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఫోన్ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా? కిసాన్ పోర్టల్ నుంచి సలహాలు అందుతున్నాయా? తదితర అంశాలకు çసంబంధించి వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment