సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ సమీక్ష | YS Jagan Mohan Reddy Review Over Comprehensive Land Survey | Sakshi
Sakshi News home page

సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, Apr 22 2021 8:55 PM | Last Updated on Fri, Apr 23 2021 9:49 AM

YS Jagan Mohan Reddy Review Over Comprehensive Land Survey - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు.

ఎస్‌ఓపీ ఖరారు
రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల ఏరియా రాష్ట్రంలో 17,460 గ్రామాలు. 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్‌)కు సంబంధించిన సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్‌ఓపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు.

జూలై నాటికి 51 గ్రామాల్లో..
తొలి దశలో ప్రతి జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు 1 గ్రామం చొప్పున 51 గ్రామాలు. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఇందులో ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూరై్తందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి, జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇంకా 650 గ్రామాలకు గానూ, ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేశామని, ఆ మేరకు ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని అధికారులు వివరించారు.

ఏప్రిల్‌ 2023 నాటికి..
ఆ తర్వాత ఈ దశలోనే రెండో విడతగా మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని, ఇక రెండో దశ సర్వేను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో మొదలు పెట్టి 2022 అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మూడో దశ వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి ఏప్రిల్‌ 23 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు, సర్వే సిబ్బందికి కూడా సంప్రదాయ సర్వే, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘‘అవినీతిరహితంగా కార్యక్రమం నిర్వహించాలి. సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి. ఎందుకంటే ఎక్కడ, ఎవ్వరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయండి. ప్రతి చోటా చెకింగ్‌ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు’’ అని అధికారులకు సూచించారు. 

సంస్కరణలకు శ్రీకారం..
‘‘మొత్తం భూరికార్డులు, డేటాను అప్‌డేట్‌ చేస్తున్నాం కాబట్టి, కేంద్రం నుంచి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఆమోదం పొందేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వారమవుతాము. సర్వే ప్రక్రియకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలి. సర్వే తర్వాత అన్నింటికి పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూరై్తన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్‌ క్లియరెన్స్‌ కింద వాటన్నింటినీ తొలగించి, చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతండి. ఆ విధంగా రైతుల ప్రమేయం కూడా ఉండాలి’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

హోర్డింగ్‌లు..
‘సర్వే వేగంగా పూర్తవుతున్నందువల్ల రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటులో రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు, వార్డులలో ఒక హోర్డింగ్‌ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పూర్తి వివరాలు ఉండాలి. ఇదే కాకుండా ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేయండి’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు..
‘సమగ్ర సర్వే పూరై్తన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్‌డేషన్, సర్వే రాళ్లు పాతడం వంటివి పూర్తయ్యే నాటికి ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. అంటే ఈ ఏడాది జూలై నాటికి 51 గ్రామ సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ కోసం తగిన ఏర్పాట్లు చూడండి’ అని ఆదేశించారు.

ఎప్పటికప్పుడు సమీక్ష..
‘‘సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు కావాలి. వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఈ ప్రక్రియలో భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ది కీలకపాత్ర’’.. అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం, మైన్స్‌ డీఎంజీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement