భూవివాదాలకు చెక్‌  | CM KCR Says We Will Conduct Scientific Land Survey Soon | Sakshi
Sakshi News home page

భూవివాదాలకు చెక్‌ 

Published Sat, Sep 12 2020 2:46 AM | Last Updated on Sat, Sep 12 2020 8:05 AM

CM KCR Says We Will Conduct Scientific Land Survey Soon - Sakshi

శుక్రవారం సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక, ధరణి పోర్టల్‌ వచ్చాక 99.9 శాతం సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసిన అంశాలపై ఆయన శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ముందుకు సాగుతామని తెలిపారు. చట్టంలో అన్నీ తీసేయడం లేదని, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి, అవినీతికి ఆస్కారం ఉన్న వాటి తొలగింపుతోనే సంస్కరణలు ప్రారంభించామని వివరించారు. కంక్లూజివ్‌ టైటిల్‌ దిశగా వెళ్లడానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఈ చట్టంతో కొన్నింటికి తక్షణమే సమాధానం దొరుకుతుందని, మరికొన్నింటికి టైం పడుతుందన్నారు. ‘1,45,58,000 ఎకరాలకు సంబం« దించి 57.95 లక్షల రైతులకు 48 గంటల్లోనే రైతుబంధు కింద రూ.7,279 కోట్లు వెళ్లింది. వాటి విషయంలో సమస్య రాలేదు. అంటే వివాదం తక్కువగా ఉన్నట్లే. అయితే కొందరి పేరున భూమి తక్కువ, ఎక్కువ వంటి అంశాలతో సమస్యలు రావచ్చు. సమగ్ర సర్వే, డిజిటలైజ్‌ చేస్తే గొడవలు ఉండవు’ అని సీఎం పేర్కొన్నారు. 

వీలైనంత త్వరగా సమగ్ర సర్వే.. 
వీలైనంత త్వరగా సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం స్పష్టం చేశారు. ఆ పనులు చేసేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. నిబంధనల్లో సీలింగ్‌ క్లాజ్, ట్రబుల్‌ షూటర్‌ అనేవి పెడతామన్నారు. డిఫికల్టీ అనేది పెడతామని, తద్వారా సమస్యలు రావన్నారు. సీఎస్‌ సమీక్ష తర్వాత చట్టాల్లోని మరికొన్నింటిని రాబోయే రోజుల్లో తీసివేస్తామన్నారు. భూములకు సంబంధించి రెండుమూడు అంశాల్లో ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందన్నారు. అసైన్డ్‌ భూముల పంపిణీ అశాస్త్రీయంగా జరిగిందన్నారు. మెదక్‌ జిల్లా శివంపేట్‌లో 200 ఎకరాలుంటే ఆరేడు వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే చేశారని, తాను పుట్టిన ఊళ్లోనే 91 ఎకరాల పోరంబోకు భూమి ఉంటే.. 136 మందికి 120 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. గెట్టు, బాట చూపించలేదన్నారు. ఓట్లు వస్తున్నాయంటే సర్టిఫికెట్లు పంచారన్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో అవే తగాదాలు ఉన్నాయన్నారు. రాజకీయ పరమైన అసైన్‌ మెంట్లు చాలా జరిగాయన్నారు. ఎరవెల్లి పక్కన 356 ఎకరాలు దళితుల భూమి ఉందని, అందులో ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదయన్నారు. ఇలాంటి వాటి పరిష్కారానికి సర్వేనే సరైన జవాబని స్పష్టం చేశారు. భూపంపిణీ విషయంలో తాము గత పాలకుల్లా చేయబోమన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడానికి భూములే లేవని, దళితులకు 3 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు.  

కౌలుదారు కాదు.. రైతులే ముఖ్యం..  
రాష్ట్రంలో కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని, రైతులకు అండగా ఉండటమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒకప్పుడు 100 సర్వే నంబర్లుంటే ఇపుడు 1,400 అయ్యాయని.. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. 25 ఎకరాలకు పైన భూమి ఉన్నోళ్లు కేవలం 0.28 శాతం మంది మాత్రమేనని అన్నారు. ఒకనాడు జాగీర్‌దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు(కౌలుదారు) వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పాస్‌బుక్‌లో అనుభవదారు కాలమ్‌తో అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. తమకు రైతుల ప్రయోజనాలనే ప్రధాన మన్నారు. కౌలు అనేది రైతుకు, కౌలుదారుకు సంబంధించిన అంశమన్నారు.  

దేవాదాయ, వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్‌  బంద్‌.. 
దేవాదాయ, వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ లను శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్‌ చేస్తామన్నారు. 1962 నుంచి 1973 వరకు 12 ఏళ్లు సర్వే చేసి.. 1982 నుంచి 2003 వరకు 62 గెజిట్లు ఇస్తూనే పోయారన్నారు. అలాంటప్పుడు వక్ప్‌ భూములు ఉంటాయా?. 77,538.3 ఎకరాల వక్ఫ్‌ భూముల్లో 57,423.91 ఆక్రమణలో ఉందన్నారు. 6,938 మంది ఆక్రమణదారులు ఉండగా 6,074 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 2,186 మందిపై కేసులు పెట్టారని, 967 మందిపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. ఇక దేవాదాయ శాఖ భూములు 87,235 ఎకరాలు ఉంటే 21 వేల ఎకరాలు లీజ్‌లో ఉన్నాయన్నారు. అర్చకుల చేతిలో 23 వేలు ఎకరాలు ఉండగా, 22,545 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, అన్‌ ఫిట్‌ ఫర్‌ కల్టివేషన్‌ లో 19 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఇకపై గజం కూడా కబ్జా కాకుండా కాపాడేందుకు మున్సిపల్,  గ్రామపంచాయతీ పర్మిషన్‌  అనుమతులు, ఎన్‌ వోసీ జారీ, రిజిస్ట్రేషన్‌  అన్నీ రద్దు చేస్తామన్నారు. సెక్షన్‌  22 ఏ కింద బ్యాన్‌  చేసే అధికారం ఉందని, శనివారమే ఫైల్‌ తెప్పించుకొని సంతకం చేస్తానన్నారు. వీటితోపాటు అటవీ భూములను కూడా ఆటోలాక్‌ చేస్తామన్నారు. 

ధరణి పోర్టల్‌లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ నమోదు.. 
ఆర్‌వోఎఫ్‌ఆర్‌ల్లో కూడా రాజకీయ దందా చేశారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ఇచ్చినవి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనన్నారు. ఆ భూములు పొందిన వారు ఫలసాయంతో బతకాలే తప్ప ఓనర్లు కాదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అయితే, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ ఉన్న వాటిని కూడా ధరణి వె»Œ సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరుస్తామన్నారు. ఇవి ఉన్న 81 వేల మందికి రైతుబంధు ఇచ్చామన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాలని అడుగుతున్నారని, సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రైతులకు వచ్చినట్లే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కల్పిస్తామన్నారు.  

‘పోడు’కు పరిష్కారం.. 
పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం అన్నారు. ఇప్పటికి దున్నుకుంటున్న వారు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. ఒక దర్బార్‌ పెట్టి ఇప్పుడున్న వరకు పోడు భూమలకు పట్టాలు ఇమ్మని చెప్పి క్లోజ్‌ చేస్తామన్నారు.  భవిష్యత్‌లో అవకాశం ఇవ్వబోమని, దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతోందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటోందన్నారు. అందుకే అడవుల పునరుజ్జీవాన్ని హరితహారంలో భాగంగా చేస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. 

సాదా బైనామాలకు మరో అవకాశం.. 
సాదాబైనామాల క్రమబద్దీకరణకు 11,19,000 ఎకరాలకు దరఖాస్తులు వస్తే.. 6,18,000 ఎకరాలను ఒక్క రూపాయి లేకుండా క్రమబద్దీకరించామని కేసీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే మూడు సార్లు పొడిగించామని, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నారన్నారు. దీనిపై ఆలోచిస్తామని, అవసరమైమే 15 రోజుల టైంపెట్టి వన్‌ టైం చాన్‌ ్సగా అవకాశం ఇస్తామన్నారు. దీనిపై సీఎస్, ఇతర అధికారులు, కేబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.  

మరోసారి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ.. 
జీవో 58, 59 ప్రకారం.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు మరోసారి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆయా స్థలాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారంతా పేదలే కాబట్టి 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఓనర్లను చేశామన్నారు. మరొక అవకాశం ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటికి ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత ఏదైనా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ తోనే చేస్తామన్నారు.  

ఒకేసారి రిజిస్ట్రేషన్‌  రేట్లు ప్రకటన.. 
ఇకపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌  శాఖలు తమకు కేటాయించిన పనులే చేస్తాయన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్‌ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుందన్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌  శాఖ రిజిస్ట్రేషన్‌  రేట్లను ఒకేసారి ప్రకటిస్తుందన్నారు. వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుతుతాయని, విచక్షణాధికారం అనేది ఉండదన్నారు.  

సర్కార్‌ ఆధ్వర్యంలోనే ధరణి..  
ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీఎస్‌టీఎస్‌కు ఈ బాధ్యత అప్పగిస్తామన్నారు. ఈ పోర్టల్‌ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. భూ రికార్డులను వెబ్‌సైట్‌ (పోర్టల్‌), డిజిటల్‌(సీడీల రూపంలో), డాక్యుమెంట్‌ రూపంలో స్టోర్‌ చేస్తున్నామన్నారు. ధరణి వెబ్‌సైట్‌ ఒకే సర్వర్‌ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌లను ఇస్తామని, ఇతర భూములన్నింటికి మెరూన్‌  కలర్‌ పాస్‌బుక్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వాటన్నింటిని ధరణి పోర్టల్‌లో పెడతామన్నారు. అధికారులు తప్పులు చేస్తే రిమూవల్‌/డిస్మిషన్‌  ఫ్రమ్‌ సర్వీసు అనే నిబంధనను చట్టంలో పెట్టామన్నారు. అంతా తప్పులు చేయరని పేర్కొన్నారు. వీఆర్‌ఓలు ఎక్కువ బాధలు పెట్టారు కాబట్టి రద్దు చేశామన్నారు.  

సభ్యుల పేర్లు నమోదుకు 2 నెలల సమయం.. 
వివాదాల పరిష్కారం సివిల్‌ కోర్టుల్లో చేసుకోవాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కావాలని ఒకరికి అన్యాయం చేసే పరిస్థితి ఉంటే సదరు వ్యక్తి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి పరిష్కరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు రైతులందరికి 2 నెలల సమయం ఇచ్చి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అందరి పేర్లతో పట్టాలు ఇచ్చేలా చర్యలు ఉంటాయని, దీంతో వివాదాలు తగ్గిపోతాయన్నారు.  కాగా, బండ్లగూడలో రిజిస్ట్రేషన్‌  కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 

అక్షాంశాలు, రేఖాంశాలు ఎవరూ మార్చలేరు.. 
సమగ్ర సర్వేను ప్రభుత్వ, ప్రైవేటు వారిలో ఎవరు చేసినా తేడా రాదని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్‌ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి కాబట్టి వాటిని ఎవరి మార్పు చేయలేరన్నారు. ఈ పనులను ప్రభుత్వ సారథ్యంలో ప్రైవేటు సంస్థలు చేస్తాయన్నారు. టాంపర్‌ చేయడానికి అవకాశం లేదని, ప్రతి సర్వే నంబర్‌కు కోఆర్డినేట్స్‌ ఇస్తారన్నారు. 

కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకున్నా ముందుకు.. 
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 9 వేల కోట్లే ఇవ్వడం లేదని, ఇక ధరణికి ఏం ఇస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరిపై పోరాటం చేయాలని ఎంపీలకు చెప్పానన్నారు. జీడీపీ క్రాష్‌ అయిందని, 24 శాతం మైనస్‌లోకి పోయి 31 శాతం పడిపోయిందన్నారు. అందులోంచి బయట పడితే కదా రాష్ట్రానికి ఇచ్చేదని విమర్శించారు. వారు ఇచ్చినా ఇవ్వకున్నా ముందుకు పోతామన్నారు.  

టపాసులు కాల్చుకుంటున్నారు... 
భూమి శిస్తు రద్దయిపోయి ప్రభుత్వమే రైతుబంధు ఇస్తున్నప్పుడు, అది వసూలు చేసే అధికారులు ఎందుకని ముఖ్యమంత్రి అన్నారు.  అవినీతి ఆరోపణలు, అనేక లోపాలు ఉన్నందునే వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేశామన్నారు. దీంతో ప్రజలు తమకు పీడ విరగడైంది అని టపాసులు కాల్చుకుంటున్నారన్నారు. ఈ చట్టం అమలు సమయంలో కొంత కఠినంగా అనిపిస్తుందని పేర్కొన్నారు.  

బలహీన వర్గాలు కోరుకున్నట్లుగానే.. 
అసైన్‌ ్డ భూములను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించినా సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. దీంతో వాటిల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. అందుకే దళిత, గిరిజన సంఘాలతో మాట్లాడి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోమని ఆ ఎమ్మెల్యేకు చెప్పానన్నారు. ఆ బాధ్యతను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. కాగా, ట్రిబ్యునల్‌లో మెంబర్స్‌గా రిటైర్డ్, ఉద్యోగంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులను నియమిస్తామన్నారు. 

వీఆర్‌ఏల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం.. 
పే స్కేల్‌ అమలులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వీఆర్‌ఏలే ఉద్యోగం తీసుకోవచ్చని, లేదంటే కుటుంబంలోని వారసుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తామన్నారు. వారంతా ఇన్నేళ్ల నుంచి చాలా తక్కువ జీతంతో పనిచేశారన్నారు. రూ. 200 కాలం నుంచి పని చేస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.5 వేలు చేస్తే.. తాము రూ.10 వేలు చేశామన్నారు. వారికి వయోపరిమితి లేనందున 70 ఏళ్లు వచ్చినా వీఆర్‌ఏలుగా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుంటే ఇస్తామన్నారు.  

గిరిజనేతరులకు రైతుబంధు ఇచ్చేందుకు ఆలోచన 
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. వారికి ఎలా ఇవ్వాలో ఆలోచించి చర్యలు చేపట్టాలని సీఎస్‌కు చెబుతానన్నారు. చట్టపరంగా ఇబ్బంది లేకపోతే వారికి ఇస్తామన్నారు.  

నాలుగు బిల్లులకు సభ ఆమోదం 
తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు–2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్‌– 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం–2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement