breaking news
sada bainama
-
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్‌తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్‌లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్‌లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్‌లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
సాదా బైనామాకు లైన్‌క్లియర్..
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020, అక్టోబర్ 12న జారీ చేసిన జీఓ నంబర్ 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా లింబా కె.కుంటాలకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో అదే ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని ప్రభుత్వాన్ని 2020లోనే ఆదేశించింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్త చట్టం రాక ముందు (2020, అక్టోబర్ 29) వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, ఆ తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం కోర్టుకు తెలపగా, గడువుకు ముందు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం.. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం విధించిన గడువులోగా 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి (భూమిపై హక్కుల రికార్డు) చట్టం 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిల్ చెల్లదని వాదించారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014, జూన్ 2 ముందు 12 ఏళ్లపాటు భూమి తమ అ«దీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. 2020, అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చినందున 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. స్టే ఎత్తివేస్తే 6,74,201 దరఖాస్తుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని విన్నవించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పాత చట్టానికి బదులుగా కొత్త చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, వాదనలకు అనుమతించాలని కోరారు. ఈ విజ్ఞప్తిని సీజే తోసిపుచ్చారు. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవాలని, అలాగే పలుమార్లు వాయిదా కోరడం సరికాదని సూచించారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా పాత దరఖాస్తులనే అనుమతిస్తున్నారని, కొత్త వాటిని స్వీకరించడం లేదని.. ఇది వివక్షేనని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనికి అంగీకరించని సీజే.. కొత్త చట్టంతో సన్న, చిన్నకారు రైతులు సాదా బైనామాలను క్రమబదీ్ధకరించుకనే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 2020లో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. -
సాదా బైనామాల 'రాత మారలేదు'.. కోర్టు చెప్పినా పట్టించుకోని రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిగిన గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు హక్కులు కల్పించే అంశం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సాదా బైనామా దరఖాస్తుదారులను ఊరిస్తోందే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. వీటి విషయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయమూ తీసుకోవడం లేదు. దీంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న 9.24 లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. సాదా బైనామాల అంశం ఇప్పటికే కోర్టులో ఉండగా, కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2.24 లక్షల దరఖాస్తులకు కోర్టు ఓకే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల (రిజిష్ట్రేషన్ లేకుండా కేవలం కాగితాలపై రాసుకోవడం) ద్వారా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే ఇలా అమ్మిన, కొన్న భూములపై క్షేత్రస్థాయిలో హక్కులే తప్ప చట్టబద్ధమైన హక్కులు లభించవు. ఈ చట్టబద్ధమైన హక్కుల కల్పన (క్రమబద్ధీకరణ) కోసం 2020లో ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే 2020 అక్టోబర్ 30 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినందున దరఖాస్తు ప్రక్రియను ఆ ఏడాది నవంబర్ 10 వరకు పొడిగించింది. అయితే అక్టోబర్ 29లోపు 2.24 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు అంటే 12 రోజుల్లో మరో 7 లక్షల దరఖాస్తుల వరకు వచ్చాయి. కానీ ఈ దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు.. అంటే 2020 అక్టోబర్ 29 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రం పరిశీలించి హక్కులు కల్పించవచ్చని తెలిపింది. అయితే కోర్టు తీసుకునే తుది నిర్ణయం మేరకు వాటి పరిష్కారం పూర్తవుతుందంటూ స్పష్టం చేసింది. 13–బీ సర్టిఫికెట్ జారీకి ఇబ్బందులు కోర్టు తీర్పు వచ్చేసరికి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో సాదా బైనామాల పరిష్కారం ఓ ప్రహసనంగా మారిపోయింది. వాస్తవానికి సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి హక్కులు కల్పించడం కోసం 13–బీ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం పాత రెవెన్యూ చట్టం ప్రకారం తహశీల్దార్లకు ఉండేది. కానీ కొత్త చట్టంలో.. జిల్లాల కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి పరిశీలించి వాటి పరిష్కారానికి సిఫారసు చేస్తేనే తహశీల్దార్లు 13–బీ సర్టిఫికెట్ జారీ చేయాలనే నిబంధన చేర్చారు. కానీ జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి కారణంగా గ్రామాలకు వెళ్లి సాదా బైనామాలను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెవెన్యూ శాఖ ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అయితే సాదా బైనామాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదని, 5 ఎకరాల లోపు లావాదేవీలకు కనీసం స్టాంపు డ్యూటీ కూడా వసూలు చేయవద్దని పేర్కొంటూ కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేసినందునే ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. పరిష్కారానికి రెండు మార్గాలు! సాదా బైనామాల అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రంలోని 9.24 లక్షల మంది దరఖాస్తుదారులు కోరుతున్న నేపథ్యంలో.. ఇందుకు రెండు మార్గాలున్నాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్ 29లోపు వచ్చిన 2.4 లక్షల దరఖాస్తులను పరిష్కరించవచ్చని హైకోర్టు చెప్పినందున, పాత చట్టం ప్రకారం ఫీజు కట్టించుకుని తహశీల్దార్ల ద్వారా క్రమబద్ధీకరణ కోసం 13–బీ సర్టిఫికెట్ జారీ చేయించవచ్చని అంటున్నారు. ఇక అక్టోబర్ 29 తర్వాత వచ్చిన 7 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలంటే మాత్రం కొత్త చట్టంలోని కలెక్టర్ల సిఫారసు నిబంధనను మార్చాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ లేదంటే అసెంబ్లీలో చట్ట సవరణ తేవాలని చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సాదా బైనామాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ కోణంలో ఆలోచించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. -
ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ
ఇది 13 కుటుంబాల వ్యథ. ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ. 30 ఏళ్లుగా పుట్టిపెరిగిన గడ్డతో పేదల అనుబంధాన్ని తెంచేస్తున్న వైనం. మూడు దశాబ్దాల కిందట ఆ ఊరు వెలిసింది. అప్పట్లో పూరిళ్లు నిర్మించుకున్నారు. తరువాత పక్కా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడెవరో వచ్చారు. ఇది మా భూమి అంటున్నారు. మీరు ఇళ్లు కట్టుకున్న భూమిని మేం కొనుగోలు చేశాం. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే జేసీబీలతో ఇళ్లను కూలుస్తాం. మీరు ఇబ్బంది పడతారు... అంటూ దబాయిస్తుండటంతో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, కామారెడ్డి/ లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ‘బూరుగిద్ద’ఊరు ఇప్పుడు అంగడి సరుకైంది. చర్చి ఫాదర్ ఉదారతతో వెలిసిన ఈ గ్రామం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1972లో లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామారెడ్డి– ఎల్లారెడ్డి (కేకేవై రోడ్డు) రాష్ట్ర రహదారి పక్కన ఓ ఫాదర్ చర్చిని నిర్మించారు. నల్లగొండ జిల్లా నుంచి మూడు దశాబ్దాల కిందట 13 కుటుంబాలు వచ్చి చర్చి పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగించాయి. అప్పట్లో చర్చి ఆలనాపాలనా చూసే మారయ్య అనే ఫాదర్ ఈ నిరుపేదలకు ఇళ్లు కట్టించాలని భావించారు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాశయ్య నుంచి చర్చి పక్కన గల సర్వే నెం.311లో 29 గుంటల భూమిని కొన్నారు. రూ.1,000కి కొనుగోలు చేసి తెల్లకాగితం (సాదా బైనామా)పై రాసుకున్నారు. ఆ భూమిలో 1987లో 13 కుటుంబాలకు పెంకుటిళ్లు కట్టించారు. అప్పటి నుంచి వీరు గ్రామ పంచాయతీలో ఇంటి ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. జోసఫ్ ఫాదర్ క్రిస్టియన్ మిషన్ నుంచి రూ.45 వేలు, హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.18 వేల చొప్పున రుణం తీసుకొని ఈ 13 కుటుంబాలకు 1998లో ఆర్సీసీ భవనాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం బూరుగిద్ద హామ్లెట్... ఎల్లమ్మతండా గ్రామం పరిధిలో ఉంది. చర్చికి సమీపంలోనే సర్వే నెం.336లో ఓ వ్యక్తికి 14 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం 13 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని బతుకుతున్న సర్వే నెం.311లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని స్థానికులను దబాయిస్తున్నాడు. లేదంటే జేసీబీతో కూల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. లింగంపేట తహసీల్దార్ నారాయణకు గ్రామస్తులు విషయాన్ని వివరించగా, సదరు 29 గుంటల భూమిలో ఊరు, ఇళ్లు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. తమ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉందని చెప్పారు. పాత పట్టాదారు వారసులు అమ్మకున్నా 29 గుంటల భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారని గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉంది రెవెన్యూ రికార్డుల ప్రకారం లింగంపల్లి శివారులోని సర్వే నెం.311లో 29 గుంటలు పట్టాభూమిగా ఉంది. పది రోజుల కిందటే కొండి ప్రసాద్ అనే వ్యక్తి మీసేవలో స్లాట్ బుక్ చేసుకోగా, మేము రిజిస్ట్రేషన్ చేశాం. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం... మీరెలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించడంతో సర్వే నెం.311లో 29 గుంటలు సాగు భూమిగా పట్టా ఉన్నట్లు రికార్డులు చూపించాం. ఇంతకు మించి మా పరిధిలో ఏమీ లేదు. సివిల్ సూట్ వేసుకుంటే కోర్టు ఆదేశాలతో పట్టాను నిలిపి వేయవచ్చు. – నారాయణ, తహసీల్దార్, లింగంపేట గ్రామాన్నే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 40 ఏళ్లుగా పుట్టి పెరిగిన గ్రామాన్ని మాకు తెలియకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మా బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలియదని చెబుతున్నారు. అసలు మీ గ్రామం రెవెన్యూ రికార్డుల్లోనే లేదంటున్నారు. ఏళ్లుగా ఇళ్ల ట్యాక్సులు, నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మా పిల్లల స్కూల్ రికార్డుల్లో బూరుగిద్ద అని ఉంటుంది. అధికారులేమో ఊరేలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. మా సమస్యకు అధికారులే పరిష్కారం చూపాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – అంటోని, బూరుగిద్ద పిల్లాపాపలతో రోడ్డున పడాలా? ఉన్నఫళంగా ఇల్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేసి మా బతుకులను చీకటి చేస్తారా? ఇల్లు, భూమి వదిలేసి ఎక్కడికి పోవాలే. పిల్లాపాపలను తీసుకొని రోడ్డు మీద బతకాలా? పక్కా ఇల్లు కట్టుకొని నలభై ఏళ్లుగా ఉంటున్నాం. ఉన్న ఇళ్లను ఎలా లాక్కుంటారు? అధికారులు ఎలా పట్టా చేస్తారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలం. – బందనాధం ఇన్నయ్య, బూరుగిద్ద రికార్డుల్లో బూరుగిద్ద గ్రామం ఉంది నూతనంగా ఏర్పడిన ఎల్లమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగిద్ద గ్రామం ఉన్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. 13 కుటుంబాల వారు ప్రతీ సంవత్సరం ఇళ్ల ట్యాక్సులు, నెలనెలా నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. పిట్ల కాశయ్య పేరుపై సర్వే నెం.311లో 29 గుంటల భూమి ఉంది. ఆయన చనిపోయాక, వారసులు ఇప్పటివరకు సదరు భూమిని ఎవ్వరికీ అమ్మలేదు. వారసులకు తెలియకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు. – దేవసోత్ వస్త్రాం, సర్పంచ్, ఎల్లమ్మతండా -
సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవచ్చని తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అక్టోబరు 29 నుంచి మంగళవారం వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టు దృష్టి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది. -
విలీన గ్రామాల్లో ఉచితంగా క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 10 వరకు పొడిగించింది. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్‌ను ఈ అంశంపై ప్రజా ప్రతినిధులు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
భూవివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక, ధరణి పోర్టల్ వచ్చాక 99.9 శాతం సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసిన అంశాలపై ఆయన శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ముందుకు సాగుతామని తెలిపారు. చట్టంలో అన్నీ తీసేయడం లేదని, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి, అవినీతికి ఆస్కారం ఉన్న వాటి తొలగింపుతోనే సంస్కరణలు ప్రారంభించామని వివరించారు. కంక్లూజివ్ టైటిల్ దిశగా వెళ్లడానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఈ చట్టంతో కొన్నింటికి తక్షణమే సమాధానం దొరుకుతుందని, మరికొన్నింటికి టైం పడుతుందన్నారు. ‘1,45,58,000 ఎకరాలకు సంబం« దించి 57.95 లక్షల రైతులకు 48 గంటల్లోనే రైతుబంధు కింద రూ.7,279 కోట్లు వెళ్లింది. వాటి విషయంలో సమస్య రాలేదు. అంటే వివాదం తక్కువగా ఉన్నట్లే. అయితే కొందరి పేరున భూమి తక్కువ, ఎక్కువ వంటి అంశాలతో సమస్యలు రావచ్చు. సమగ్ర సర్వే, డిజిటలైజ్ చేస్తే గొడవలు ఉండవు’ అని సీఎం పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే.. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం స్పష్టం చేశారు. ఆ పనులు చేసేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. నిబంధనల్లో సీలింగ్ క్లాజ్, ట్రబుల్ షూటర్ అనేవి పెడతామన్నారు. డిఫికల్టీ అనేది పెడతామని, తద్వారా సమస్యలు రావన్నారు. సీఎస్ సమీక్ష తర్వాత చట్టాల్లోని మరికొన్నింటిని రాబోయే రోజుల్లో తీసివేస్తామన్నారు. భూములకు సంబంధించి రెండుమూడు అంశాల్లో ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందన్నారు. అసైన్డ్ భూముల పంపిణీ అశాస్త్రీయంగా జరిగిందన్నారు. మెదక్ జిల్లా శివంపేట్‌లో 200 ఎకరాలుంటే ఆరేడు వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే చేశారని, తాను పుట్టిన ఊళ్లోనే 91 ఎకరాల పోరంబోకు భూమి ఉంటే.. 136 మందికి 120 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. గెట్టు, బాట చూపించలేదన్నారు. ఓట్లు వస్తున్నాయంటే సర్టిఫికెట్లు పంచారన్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో అవే తగాదాలు ఉన్నాయన్నారు. రాజకీయ పరమైన అసైన్ మెంట్లు చాలా జరిగాయన్నారు. ఎరవెల్లి పక్కన 356 ఎకరాలు దళితుల భూమి ఉందని, అందులో ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదయన్నారు. ఇలాంటి వాటి పరిష్కారానికి సర్వేనే సరైన జవాబని స్పష్టం చేశారు. భూపంపిణీ విషయంలో తాము గత పాలకుల్లా చేయబోమన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడానికి భూములే లేవని, దళితులకు 3 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు. కౌలుదారు కాదు.. రైతులే ముఖ్యం.. రాష్ట్రంలో కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని, రైతులకు అండగా ఉండటమే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒకప్పుడు 100 సర్వే నంబర్లుంటే ఇపుడు 1,400 అయ్యాయని.. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. 25 ఎకరాలకు పైన భూమి ఉన్నోళ్లు కేవలం 0.28 శాతం మంది మాత్రమేనని అన్నారు. ఒకనాడు జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు(కౌలుదారు) వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పాస్‌బుక్‌లో అనుభవదారు కాలమ్‌తో అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. తమకు రైతుల ప్రయోజనాలనే ప్రధాన మన్నారు. కౌలు అనేది రైతుకు, కౌలుదారుకు సంబంధించిన అంశమన్నారు. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్.. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ లను శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. 1962 నుంచి 1973 వరకు 12 ఏళ్లు సర్వే చేసి.. 1982 నుంచి 2003 వరకు 62 గెజిట్లు ఇస్తూనే పోయారన్నారు. అలాంటప్పుడు వక్ప్ భూములు ఉంటాయా?. 77,538.3 ఎకరాల వక్ఫ్ భూముల్లో 57,423.91 ఆక్రమణలో ఉందన్నారు. 6,938 మంది ఆక్రమణదారులు ఉండగా 6,074 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 2,186 మందిపై కేసులు పెట్టారని, 967 మందిపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. ఇక దేవాదాయ శాఖ భూములు 87,235 ఎకరాలు ఉంటే 21 వేల ఎకరాలు లీజ్‌లో ఉన్నాయన్నారు. అర్చకుల చేతిలో 23 వేలు ఎకరాలు ఉండగా, 22,545 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, అన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ లో 19 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఇకపై గజం కూడా కబ్జా కాకుండా కాపాడేందుకు మున్సిపల్, గ్రామపంచాయతీ పర్మిషన్ అనుమతులు, ఎన్ వోసీ జారీ, రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేస్తామన్నారు. సెక్షన్ 22 ఏ కింద బ్యాన్ చేసే అధికారం ఉందని, శనివారమే ఫైల్ తెప్పించుకొని సంతకం చేస్తానన్నారు. వీటితోపాటు అటవీ భూములను కూడా ఆటోలాక్ చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో ఆర్వోఎఫ్ఆర్ నమోదు.. ఆర్వోఎఫ్ఆర్ల్లో కూడా రాజకీయ దందా చేశారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఇచ్చినవి ఆర్వోఎఫ్ఆర్ పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనన్నారు. ఆ భూములు పొందిన వారు ఫలసాయంతో బతకాలే తప్ప ఓనర్లు కాదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అయితే, ఆర్వోఎఫ్ఆర్ ఉన్న వాటిని కూడా ధరణి వె»Œ సైట్లో ప్రత్యేకంగా పొందుపరుస్తామన్నారు. ఇవి ఉన్న 81 వేల మందికి రైతుబంధు ఇచ్చామన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాలని అడుగుతున్నారని, సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రైతులకు వచ్చినట్లే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ‘పోడు’కు పరిష్కారం.. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం అన్నారు. ఇప్పటికి దున్నుకుంటున్న వారు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. ఒక దర్బార్ పెట్టి ఇప్పుడున్న వరకు పోడు భూమలకు పట్టాలు ఇమ్మని చెప్పి క్లోజ్ చేస్తామన్నారు. భవిష్యత్‌లో అవకాశం ఇవ్వబోమని, దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతోందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటోందన్నారు. అందుకే అడవుల పునరుజ్జీవాన్ని హరితహారంలో భాగంగా చేస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. సాదా బైనామాలకు మరో అవకాశం.. సాదాబైనామాల క్రమబద్దీకరణకు 11,19,000 ఎకరాలకు దరఖాస్తులు వస్తే.. 6,18,000 ఎకరాలను ఒక్క రూపాయి లేకుండా క్రమబద్దీకరించామని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే మూడు సార్లు పొడిగించామని, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నారన్నారు. దీనిపై ఆలోచిస్తామని, అవసరమైమే 15 రోజుల టైంపెట్టి వన్ టైం చాన్ ్సగా అవకాశం ఇస్తామన్నారు. దీనిపై సీఎస్, ఇతర అధికారులు, కేబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ.. జీవో 58, 59 ప్రకారం.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు మరోసారి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆయా స్థలాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారంతా పేదలే కాబట్టి 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఓనర్లను చేశామన్నారు. మరొక అవకాశం ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటికి ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత ఏదైనా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ తోనే చేస్తామన్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్ రేట్లు ప్రకటన.. ఇకపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు తమకు కేటాయించిన పనులే చేస్తాయన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేసారి ప్రకటిస్తుందన్నారు. వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుతుతాయని, విచక్షణాధికారం అనేది ఉండదన్నారు. సర్కార్ ఆధ్వర్యంలోనే ధరణి.. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఎస్టీఎస్కు ఈ బాధ్యత అప్పగిస్తామన్నారు. ఈ పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. భూ రికార్డులను వెబ్సైట్ (పోర్టల్), డిజిటల్(సీడీల రూపంలో), డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేస్తున్నామన్నారు. ధరణి వెబ్సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌లను ఇస్తామని, ఇతర భూములన్నింటికి మెరూన్ కలర్ పాస్‌బుక్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటన్నింటిని ధరణి పోర్టల్‌లో పెడతామన్నారు. అధికారులు తప్పులు చేస్తే రిమూవల్/డిస్మిషన్ ఫ్రమ్ సర్వీసు అనే నిబంధనను చట్టంలో పెట్టామన్నారు. అంతా తప్పులు చేయరని పేర్కొన్నారు. వీఆర్ఓలు ఎక్కువ బాధలు పెట్టారు కాబట్టి రద్దు చేశామన్నారు. సభ్యుల పేర్లు నమోదుకు 2 నెలల సమయం.. వివాదాల పరిష్కారం సివిల్ కోర్టుల్లో చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కావాలని ఒకరికి అన్యాయం చేసే పరిస్థితి ఉంటే సదరు వ్యక్తి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి పరిష్కరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు రైతులందరికి 2 నెలల సమయం ఇచ్చి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అందరి పేర్లతో పట్టాలు ఇచ్చేలా చర్యలు ఉంటాయని, దీంతో వివాదాలు తగ్గిపోతాయన్నారు. కాగా, బండ్లగూడలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఎవరూ మార్చలేరు.. సమగ్ర సర్వేను ప్రభుత్వ, ప్రైవేటు వారిలో ఎవరు చేసినా తేడా రాదని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి కాబట్టి వాటిని ఎవరి మార్పు చేయలేరన్నారు. ఈ పనులను ప్రభుత్వ సారథ్యంలో ప్రైవేటు సంస్థలు చేస్తాయన్నారు. టాంపర్ చేయడానికి అవకాశం లేదని, ప్రతి సర్వే నంబర్‌కు కోఆర్డినేట్స్ ఇస్తారన్నారు. కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకున్నా ముందుకు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 9 వేల కోట్లే ఇవ్వడం లేదని, ఇక ధరణికి ఏం ఇస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరిపై పోరాటం చేయాలని ఎంపీలకు చెప్పానన్నారు. జీడీపీ క్రాష్ అయిందని, 24 శాతం మైనస్‌లోకి పోయి 31 శాతం పడిపోయిందన్నారు. అందులోంచి బయట పడితే కదా రాష్ట్రానికి ఇచ్చేదని విమర్శించారు. వారు ఇచ్చినా ఇవ్వకున్నా ముందుకు పోతామన్నారు. టపాసులు కాల్చుకుంటున్నారు... భూమి శిస్తు రద్దయిపోయి ప్రభుత్వమే రైతుబంధు ఇస్తున్నప్పుడు, అది వసూలు చేసే అధికారులు ఎందుకని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి ఆరోపణలు, అనేక లోపాలు ఉన్నందునే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామన్నారు. దీంతో ప్రజలు తమకు పీడ విరగడైంది అని టపాసులు కాల్చుకుంటున్నారన్నారు. ఈ చట్టం అమలు సమయంలో కొంత కఠినంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. బలహీన వర్గాలు కోరుకున్నట్లుగానే.. అసైన్ ్డ భూములను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించినా సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. దీంతో వాటిల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. అందుకే దళిత, గిరిజన సంఘాలతో మాట్లాడి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోమని ఆ ఎమ్మెల్యేకు చెప్పానన్నారు. ఆ బాధ్యతను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. కాగా, ట్రిబ్యునల్‌లో మెంబర్స్‌గా రిటైర్డ్, ఉద్యోగంలో ఉన్న ఐఏఎస్ అధికారులను నియమిస్తామన్నారు. వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం.. పే స్కేల్ అమలులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వీఆర్ఏలే ఉద్యోగం తీసుకోవచ్చని, లేదంటే కుటుంబంలోని వారసుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తామన్నారు. వారంతా ఇన్నేళ్ల నుంచి చాలా తక్కువ జీతంతో పనిచేశారన్నారు. రూ. 200 కాలం నుంచి పని చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 వేలు చేస్తే.. తాము రూ.10 వేలు చేశామన్నారు. వారికి వయోపరిమితి లేనందున 70 ఏళ్లు వచ్చినా వీఆర్ఏలుగా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుంటే ఇస్తామన్నారు. గిరిజనేతరులకు రైతుబంధు ఇచ్చేందుకు ఆలోచన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. వారికి ఎలా ఇవ్వాలో ఆలోచించి చర్యలు చేపట్టాలని సీఎస్‌కు చెబుతానన్నారు. చట్టపరంగా ఇబ్బంది లేకపోతే వారికి ఇస్తామన్నారు. నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు–2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్– 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం–2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
అక్కడ సాదా బైనామాకు నో
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. 2011, 2012లో సమీప నగరాలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెల్ల కాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టంలోని 22(2) సెక్షన్ మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ 2016 జూన్ 3న ఉత్తర్వులిచ్చింది. 2014లోపు రాసుకున్న సాదా బైనామాలను క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. దరఖాస్తుల ఆమోదం అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదని స్పష్టం చేసింది. సాదా బైనామా ఉత్తర్వుల సమయంలో రాష్ట్రంలో ఆరు నగరపాలక సంస్థలు, 58 మున్సిపాలిటీలు ఉండేవి. అయితే 2011లో పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సమీపంలోని వందల గ్రామాలను వాటిలో విలీనం చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థలో ఏకంగా 42 గ్రామాలు విలీనమయ్యాయి. ఇలాంటి గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతించాలని డిమాండ్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ దశలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది కానీ తర్వాత పక్కనబెట్టింది. ఇటీవల పలు వర్గాల నుంచి దీనిపై విజ్ఞప్తులు వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వద్ద జరిగిన రెవెన్యూ శాఖ సమావేశంలోనూ విలీన గ్రామాల్లో సాదా బైనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అనుమతిస్తే భూముల విషయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రభుత్వానికి ఆదాయ పరంగా నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా నష్టం జరుగుతుందని అధికారులు సూచించడంతో విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ ఉండదని స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటిదాకా 6 లక్షలు పూర్తి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 15.68 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూములున్నాయి. రెవెన్యూ శాఖ ఒక సర్వే నంబర్‌ను ఒక కేసుగా పరిగణించి ఈ ప్రక్రియను నిర్వహించింది. 6.18 లక్షల సర్వే నంబర్ల పరిధిలో దరఖాస్తులను ఆమోదించారు. 9.49 లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. కబ్జాలో లేకపోవడం, విక్రయ లావాదేవీ జరిగినా వారసులు అంగీకరించకపోవడం, కొన్ని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు ఉండటం, కోర్టుల్లో కేసుల పెండింగ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను తిరస్కరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేని దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. -
ఒకే స్థలం రెండు సంస్థలకు!
సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ శ్రీ దేవసేన మండలపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ సుధాకర్‌ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని సూచించారు. నెలాఖరులోగా అందరికీ పాస్‌పుస్తకాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ పట్టాపాస్‌పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపాçరు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్‌లాండ్‌తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్సైట్ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్లైన్లో నమో దు చేసి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ద్వారా రైతులకు అందిస్తాన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–ఏ, బీ నమోదు చేశామని పార్ట్–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయ ని డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్‌పూర్ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. -
రెవెన్యూలో పదోన్నతులు వాయిదా
‘సాదాబైనామా’ పరిశీలన ఉన్నందున జేసీ నిర్ణయం హన్మకొండ అర్బన్ : సుమారు నెలరోజులుగా ఇదుగో అదిగో... అంటూ ఊరిస్తున్న రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు బ్రేక్ పడింది. దీని ఫలితంగా పదోన్నతులు పొంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. ప్రస్తుతం గ్రామస్థాయిలో సాదాబైనామాల ప్రక్రియ కొనసాగుతున్నందున వీఆర్వోల బదిలీ, పదోన్నతులు ఆగస్టు మొదటి వారంలో పరిశీలిద్దామంటూ జేసీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సుమారు 20రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్లో పడిగాపులు వస్తూ వచ్చిన వీఆర్వోలు ఉస్సూరుమంటూ వెళ్లారు. ఆర్ఐ పోస్టుల కోసం వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు కొద్దినెలల క్రితమే పేర్లతో సహా ఫైల్ సిద్ధమైంది. ఇంతలో కొందరు వీఆర్వోలు తమకు నగరం చుట్టుపక్కల ఆర్ఐ పోస్టింగ్‌లూ కావాలని పట్టుబట్టి ఢిల్లీ స్థాయి నుంచి ఫోన్లు చేయించగా అధికారులు ఆగ్రహించినట్లు సమాచారం. కాగా పదోన్నతి పొందిన వారికి సీనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇస్తామని డీఆర్వో ఇప్పటికే చెప్పినా వారు ఆర్ఐ పోస్టు... అది కూడా తాము కోరుకున్న చోటే కావాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి రాడంతో అధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 80 పోస్టులు ఖాళీ.. ప్రస్తుతం జిల్లాలో మొత్తంగా 60కిపైగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 20కిపైగా ఏఆర్ఐ, ఎంఆర్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే మండలానికి ఒక ఆర్ఐ పోస్టు సరిపోతుందని భావించిన అధికారులు ప్రసుతం సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని భావించారు. ఇదే ఉద్దేశంతో ఇటీవల కొందరు సీనియర్ అసిస్టెంట్లను ఆర్ఐ పోస్టుల్లోకి బదిలీ చేశారు. ఈక్రమంలో అధికారులపై ఆర్ఐ పోస్టుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్ఐలను బదిలీ చేసి మరీ తమకు ఆ పోస్టింగ్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లాలోని ఒక మంత్రి, రాష్ట్రం నుంచి ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడే కాకుండా కొందరు ఆర్డీవోల నుంచి పోస్టింగ్‌ల కోసం చెప్పిస్తున్నట్లు సమాచారం. అయితే, మొత్తం ప్రక్రియ వాయిదా పడగా... ఆగస్టు మొదటి వారంలో ఎవరి పంతం నెగ్గుతుందో తేలనుంది. -
వెరీ స్లో
‘సాదాబైనామా’ పరిశీలన మందగింపు హరితహారంలో నిమగ్నమైన అధికారులు 5602 దరఖాస్తుల తిరస్కరణ మరో నెలన్నర పట్టే అవకాశం ముకరంపుర : జిల్లాలో సాదాబైనామాల భూముల క్రమబద్దీరణకై వచ్చిన «lధరఖాస్తుల పరిశీలన మందకొడిగా సాగుతోంది. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేకదష్టి సారించినా హరితహారం ప్రభావంతో పరిశీలనలో వేగం తగ్గింది. గతనెల 22 వరకు మీ సేవ ద్వారా సాదాబైనామాల క్రమబద్దీకరణకు ధరఖాస్తులు స్వీకరించారు. పలుమార్లు గడువు పొడగించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 2,47,538 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను మండలాలు, గ్రామాల వారీగా విభజించి పరిశీలన ప్రారంభించారు. ఇప్పటివరకు 29,058 మందికి నోటీసులు జారీ చేసారు. ప్రాథమిక విచారణలో 5,602 ధరఖాస్తులను తిరస్కరించారు. హరితహారంలో అధికారులు బిజీగా ఉండటంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. సగానికి పైగా మండలాల్లో రోజు వారీగా 5, 6 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన వాటిలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండడం, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ, అర్బన్ పరిధిలోని భూములు, దరఖాస్తులను సాదాబైనామాలకు జోడించకపోవడం, కొనుగోలు దారులు, విక్రయించిన వారు చనిపోవడం వంటి కారణాలే కనిపిస్తున్నాయి. విక్రయించిన వారి వారసుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతుండడంతో సంది«గ్ధం నెలకొంది. పరిశీలన ప్రక్రియకే మరో నెలన్నర కాలం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మంథనిలోనే అత్యధికంగా తిరస్కరణ. జిల్లాలో 3,14,161 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 90,231 మాత్రమే పరిశీలించారు. అందులో 29,058 మందికి నోటీసులు జారీ చేసారు. 5,602 ధరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1,89,270 «ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సాదాబైనామాల ధరఖాస్తుల పరిశీలనలో అత్యధికంగా మంథని డివిజన్లో తిరస్కరణకు గురయ్యాయి. 19,249 ధరఖాస్తులు రాగా 3,394 ధరఖాస్తులను తిరస్కరించారు. తక్కవగా సిరిసిల్ల డివిజన్లో 56 తిరస్కరించారు. పెద్దపల్లిలో 241, కరీంనగర్లో 1,835, జగిత్యాలలో 76 ధరఖాస్తులు తిరస్కరించారు. -
సాదాబైనామాల గడువు పెంపుకు ఆందోళన
కమలాపురం : సాదాబైనామల రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కమలాపురం పట్టణంలోని హుజూరాబాద్ - పరకాల ప్రధాన రహదారిలో బుధవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. రైతులు రహదారిలో ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చించారు. ప్రభుత్వం గడువు పొడిగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని రైతులు భీష్మించారు. -
సాదా బైనామా పేదలకు మాత్రమే..
* రియల్ఎస్టేట్ వ్యాపారానికి కాదు * జేసీ దివ్య అశ్వారావుపేట: ప్రభుత్వం సాదా బైనామా అవకాశం కేవలం పేదవారికి మాత్రమే కల్పించిందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదని జేసీ దివ్య స్పష్టం చేశారు. సాదా బైనామాపై సోమవారం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టా భూములను సాగుచేసుకుంటున్న నిరుపేదలకు భూమి హక్కు కల్పించేందుకే సాదా బైనామా కార్యక్రమం అని వివరించారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా దరఖాస్తు ఆన్లైన్లో ఉండటంతోపాటు తహసీల్దార్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పరిశీలించేందుకు వీలుంటుందన్నారు. మీసేవ సర్వర్ వేగంగా లేదన్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఆపరేటర్లు చిన్న తప్పు కూడా లేకుండా జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలని, రైతులు తమ దరఖాస్తులను పరిశీలించుకోవలన్నారు. వారసత్వ పట్టాల్లో ఇంటి పెద్ద పేరుతో గతంలో భూమి పత్రాలుండేవని.. అలాంటి వాటిని కూడా హ క్కుదారులంతా వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ఎక్కడయినా ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటే తిరిగి తీసుకుంటామన్నారు. పేరాయిగూడెంలో 1228 సర్వే నంబరులో 2,600 ఎకరాల భూమి ఉందని.. డీజీపీఎస్ సర్వే ద్వారా హద్దులను నిర్ణయించి వివాదాలు లేకుండా చూస్తామన్నారు. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేని భూముల లావాదేవీలకు మాత్రామే సాదాబైనామా ద్వారా హక్కు కల్పిస్తామన్నారు. వివాదాలుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 2014కు ముందు భూమి సాగులో ఉండాలని.. కనీసం తెల్లకాగితంపైనైనా రాసుకున్న ఒప్పంద పత్రం ఉండాలన్నారు. దీనికోసం నోటరీ, స్టాంప్ పేపర్లకు నగదు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్నింటికంటే ముందు భూమిలో సాగు చేస్తూ ఉండటం ముఖ్యమైన అంశమన్నారు. దళారులు, ఇతరుల మాటలు నమ్మి సొమ్ము వృథా చేసుకోవద్దన్నారు. మండల కేంద్రంలోని దొంతికుంట చెరువు ఆక్రమణ విషయం ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఐబీ అధికారులతో సంప్రదించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. మండలంలోని వెంకమ్మ చెరువులో చేపల చెరువు వ్యర్థాలను కలుపుతున్న విషమాన్ని ప్రస్థావించగా సీఆర్పీసీ 133 సెక్షన్‌ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు.