ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ | Man Sale Village kamareddy District Lingampet | Sakshi
Sakshi News home page

ఊరినే అమ్మేశారు!

Published Mon, Dec 21 2020 1:46 AM | Last Updated on Mon, Dec 21 2020 10:32 AM

Man Sale Village kamareddy District Lingampet - Sakshi

ఇది 13 కుటుంబాల వ్యథ. ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ. 30 ఏళ్లుగా పుట్టిపెరిగిన గడ్డతో పేదల అనుబంధాన్ని తెంచేస్తున్న వైనం. మూడు దశాబ్దాల కిందట ఆ ఊరు వెలిసింది. అప్పట్లో పూరిళ్లు నిర్మించుకున్నారు. తరువాత పక్కా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడెవరో వచ్చారు. ఇది మా భూమి అంటున్నారు. మీరు ఇళ్లు కట్టుకున్న భూమిని మేం కొనుగోలు చేశాం. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే జేసీబీలతో ఇళ్లను కూలుస్తాం. మీరు ఇబ్బంది పడతారు... అంటూ దబాయిస్తుండటంతో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, కామారెడ్డి/ లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ‘బూరుగిద్ద’ఊరు ఇప్పుడు అంగడి సరుకైంది. చర్చి ఫాదర్‌ ఉదారతతో వెలిసిన ఈ గ్రామం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1972లో లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామారెడ్డి– ఎల్లారెడ్డి (కేకేవై రోడ్డు) రాష్ట్ర రహదారి పక్కన ఓ ఫాదర్‌ చర్చిని నిర్మించారు. నల్లగొండ జిల్లా నుంచి మూడు దశాబ్దాల కిందట 13 కుటుంబాలు వచ్చి చర్చి పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగించాయి. అప్పట్లో చర్చి ఆలనాపాలనా చూసే మారయ్య అనే ఫాదర్‌ ఈ నిరుపేదలకు ఇళ్లు కట్టించాలని భావించారు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాశయ్య నుంచి చర్చి పక్కన గల సర్వే నెం.311లో 29 గుంటల భూమిని కొన్నారు. రూ.1,000కి కొనుగోలు చేసి తెల్లకాగితం (సాదా బైనామా)పై రాసుకున్నారు. ఆ భూమిలో 1987లో 13 కుటుంబాలకు పెంకుటిళ్లు కట్టించారు. అప్పటి నుంచి వీరు గ్రామ పంచాయతీలో ఇంటి ట్యాక్స్‌ కడుతూనే ఉన్నారు. జోసఫ్‌ ఫాదర్‌ క్రిస్టియన్‌ మిషన్‌ నుంచి రూ.45 వేలు, హౌజింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.18 వేల చొప్పున రుణం తీసుకొని ఈ 13 కుటుంబాలకు 1998లో ఆర్‌సీసీ భవనాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం బూరుగిద్ద హామ్లెట్‌... ఎల్లమ్మతండా గ్రామం పరిధిలో ఉంది.

చర్చికి సమీపంలోనే సర్వే నెం.336లో ఓ వ్యక్తికి 14 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం 13 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని బతుకుతున్న సర్వే నెం.311లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని స్థానికులను దబాయిస్తున్నాడు. లేదంటే జేసీబీతో కూల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. లింగంపేట తహసీల్దార్‌ నారాయణకు గ్రామస్తులు విషయాన్ని వివరించగా, సదరు 29 గుంటల భూమిలో ఊరు, ఇళ్లు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. తమ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉందని చెప్పారు. పాత పట్టాదారు వారసులు అమ్మకున్నా 29 గుంటల భూమిని ఎవరు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారని గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉంది
రెవెన్యూ రికార్డుల ప్రకారం లింగంపల్లి శివారులోని సర్వే నెం.311లో 29 గుంటలు పట్టాభూమిగా ఉంది. పది రోజుల కిందటే కొండి ప్రసాద్‌ అనే వ్యక్తి మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోగా, మేము రిజిస్ట్రేషన్‌ చేశాం. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం... మీరెలా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రశ్నించడంతో సర్వే నెం.311లో 29 గుంటలు సాగు భూమిగా పట్టా ఉన్నట్లు రికార్డులు చూపించాం. ఇంతకు మించి మా పరిధిలో ఏమీ లేదు. సివిల్‌ సూట్‌ వేసుకుంటే కోర్టు ఆదేశాలతో పట్టాను నిలిపి వేయవచ్చు.   – నారాయణ, తహసీల్దార్, లింగంపేట

గ్రామాన్నే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు
40 ఏళ్లుగా పుట్టి పెరిగిన గ్రామాన్ని మాకు తెలియకుండా కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో మా బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలియదని చెబుతున్నారు. అసలు మీ గ్రామం రెవెన్యూ రికార్డుల్లోనే లేదంటున్నారు. ఏళ్లుగా ఇళ్ల ట్యాక్సులు, నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మా పిల్లల స్కూల్‌ రికార్డుల్లో బూరుగిద్ద అని ఉంటుంది. అధికారులేమో ఊరేలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. మా సమస్యకు అధికారులే పరిష్కారం చూపాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – అంటోని, బూరుగిద్ద

పిల్లాపాపలతో రోడ్డున పడాలా?
ఉన్నఫళంగా ఇల్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేసి మా బతుకులను చీకటి చేస్తారా? 
ఇల్లు, భూమి వదిలేసి ఎక్కడికి పోవాలే. పిల్లాపాపలను తీసుకొని రోడ్డు మీద బతకాలా? పక్కా ఇల్లు కట్టుకొని నలభై ఏళ్లుగా ఉంటున్నాం. ఉన్న ఇళ్లను ఎలా లాక్కుంటారు? అధికారులు ఎలా పట్టా చేస్తారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలం.  – బందనాధం ఇన్నయ్య, బూరుగిద్ద

రికార్డుల్లో బూరుగిద్ద గ్రామం ఉంది
నూతనంగా ఏర్పడిన ఎల్లమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగిద్ద గ్రామం ఉన్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. 13 కుటుంబాల వారు ప్రతీ సంవత్సరం ఇళ్ల ట్యాక్సులు, నెలనెలా నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. పిట్ల కాశయ్య పేరుపై సర్వే నెం.311లో 29 గుంటల భూమి ఉంది. ఆయన చనిపోయాక, వారసులు ఇప్పటివరకు సదరు భూమిని ఎవ్వరికీ అమ్మలేదు. వారసులకు తెలియకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారు. – దేవసోత్‌ వస్త్రాం, సర్పంచ్, ఎల్లమ్మతండా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement