పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్‌పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు.
ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
చదువుకుంటూనే డ్రైవర్‌గా!
సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది.
గ్రామ పంచాయితీ పనుల్లో...
గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది.
రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.
వ్యవసాయ పనులు
గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి.
నచ్చిన పనిని ఎంచుకున్నా!
ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను.
– గంగవ్వ, సజ్జన్‌పల్లి,
లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా
– ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment