Lingampeta
-
డ్రైవర్ గంగవ్వ!
పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చదువుకుంటూనే డ్రైవర్‌గా! సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది. గ్రామ పంచాయితీ పనుల్లో... గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది. రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయ పనులు గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నచ్చిన పనిని ఎంచుకున్నా! ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను. – గంగవ్వ, సజ్జన్పల్లి, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
పెళ్లికి నిరాకరణ.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
లింగంపేట (ఎల్లారెడ్డి): ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన దివ్య అలియాస్ బ్యాగరి మాధవి (17), నీరడి రాజు (23) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇంటి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గత నెల 30న గ్రామ శివారులోని పంట చేనుకు వెళ్లి గడ్డి మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇరువురిని చికిత్స నిమిత్తం హైదరాబాలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మాధవి మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. మాధవి 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. రాజు 10వ తరగతి పూర్తి కాగానే దుబాయి వెళ్లాడు. అక్కడ రెండేళ్లు ఉన్న అనంతరం కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ
ఇది 13 కుటుంబాల వ్యథ. ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ. 30 ఏళ్లుగా పుట్టిపెరిగిన గడ్డతో పేదల అనుబంధాన్ని తెంచేస్తున్న వైనం. మూడు దశాబ్దాల కిందట ఆ ఊరు వెలిసింది. అప్పట్లో పూరిళ్లు నిర్మించుకున్నారు. తరువాత పక్కా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడెవరో వచ్చారు. ఇది మా భూమి అంటున్నారు. మీరు ఇళ్లు కట్టుకున్న భూమిని మేం కొనుగోలు చేశాం. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే జేసీబీలతో ఇళ్లను కూలుస్తాం. మీరు ఇబ్బంది పడతారు... అంటూ దబాయిస్తుండటంతో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, కామారెడ్డి/ లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ‘బూరుగిద్ద’ఊరు ఇప్పుడు అంగడి సరుకైంది. చర్చి ఫాదర్ ఉదారతతో వెలిసిన ఈ గ్రామం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1972లో లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామారెడ్డి– ఎల్లారెడ్డి (కేకేవై రోడ్డు) రాష్ట్ర రహదారి పక్కన ఓ ఫాదర్ చర్చిని నిర్మించారు. నల్లగొండ జిల్లా నుంచి మూడు దశాబ్దాల కిందట 13 కుటుంబాలు వచ్చి చర్చి పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగించాయి. అప్పట్లో చర్చి ఆలనాపాలనా చూసే మారయ్య అనే ఫాదర్ ఈ నిరుపేదలకు ఇళ్లు కట్టించాలని భావించారు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాశయ్య నుంచి చర్చి పక్కన గల సర్వే నెం.311లో 29 గుంటల భూమిని కొన్నారు. రూ.1,000కి కొనుగోలు చేసి తెల్లకాగితం (సాదా బైనామా)పై రాసుకున్నారు. ఆ భూమిలో 1987లో 13 కుటుంబాలకు పెంకుటిళ్లు కట్టించారు. అప్పటి నుంచి వీరు గ్రామ పంచాయతీలో ఇంటి ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. జోసఫ్ ఫాదర్ క్రిస్టియన్ మిషన్ నుంచి రూ.45 వేలు, హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.18 వేల చొప్పున రుణం తీసుకొని ఈ 13 కుటుంబాలకు 1998లో ఆర్సీసీ భవనాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం బూరుగిద్ద హామ్లెట్... ఎల్లమ్మతండా గ్రామం పరిధిలో ఉంది. చర్చికి సమీపంలోనే సర్వే నెం.336లో ఓ వ్యక్తికి 14 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం 13 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని బతుకుతున్న సర్వే నెం.311లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని స్థానికులను దబాయిస్తున్నాడు. లేదంటే జేసీబీతో కూల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. లింగంపేట తహసీల్దార్ నారాయణకు గ్రామస్తులు విషయాన్ని వివరించగా, సదరు 29 గుంటల భూమిలో ఊరు, ఇళ్లు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. తమ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉందని చెప్పారు. పాత పట్టాదారు వారసులు అమ్మకున్నా 29 గుంటల భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారని గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉంది రెవెన్యూ రికార్డుల ప్రకారం లింగంపల్లి శివారులోని సర్వే నెం.311లో 29 గుంటలు పట్టాభూమిగా ఉంది. పది రోజుల కిందటే కొండి ప్రసాద్ అనే వ్యక్తి మీసేవలో స్లాట్ బుక్ చేసుకోగా, మేము రిజిస్ట్రేషన్ చేశాం. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం... మీరెలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించడంతో సర్వే నెం.311లో 29 గుంటలు సాగు భూమిగా పట్టా ఉన్నట్లు రికార్డులు చూపించాం. ఇంతకు మించి మా పరిధిలో ఏమీ లేదు. సివిల్ సూట్ వేసుకుంటే కోర్టు ఆదేశాలతో పట్టాను నిలిపి వేయవచ్చు. – నారాయణ, తహసీల్దార్, లింగంపేట గ్రామాన్నే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 40 ఏళ్లుగా పుట్టి పెరిగిన గ్రామాన్ని మాకు తెలియకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మా బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలియదని చెబుతున్నారు. అసలు మీ గ్రామం రెవెన్యూ రికార్డుల్లోనే లేదంటున్నారు. ఏళ్లుగా ఇళ్ల ట్యాక్సులు, నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మా పిల్లల స్కూల్ రికార్డుల్లో బూరుగిద్ద అని ఉంటుంది. అధికారులేమో ఊరేలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. మా సమస్యకు అధికారులే పరిష్కారం చూపాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – అంటోని, బూరుగిద్ద పిల్లాపాపలతో రోడ్డున పడాలా? ఉన్నఫళంగా ఇల్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేసి మా బతుకులను చీకటి చేస్తారా? ఇల్లు, భూమి వదిలేసి ఎక్కడికి పోవాలే. పిల్లాపాపలను తీసుకొని రోడ్డు మీద బతకాలా? పక్కా ఇల్లు కట్టుకొని నలభై ఏళ్లుగా ఉంటున్నాం. ఉన్న ఇళ్లను ఎలా లాక్కుంటారు? అధికారులు ఎలా పట్టా చేస్తారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలం. – బందనాధం ఇన్నయ్య, బూరుగిద్ద రికార్డుల్లో బూరుగిద్ద గ్రామం ఉంది నూతనంగా ఏర్పడిన ఎల్లమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగిద్ద గ్రామం ఉన్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. 13 కుటుంబాల వారు ప్రతీ సంవత్సరం ఇళ్ల ట్యాక్సులు, నెలనెలా నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. పిట్ల కాశయ్య పేరుపై సర్వే నెం.311లో 29 గుంటల భూమి ఉంది. ఆయన చనిపోయాక, వారసులు ఇప్పటివరకు సదరు భూమిని ఎవ్వరికీ అమ్మలేదు. వారసులకు తెలియకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు. – దేవసోత్ వస్త్రాం, సర్పంచ్, ఎల్లమ్మతండా -
తల్లిదండ్రులకు భారం కాకూడదని..
సాక్షి, లింగంపేట(నిజామాబాద్) : తన పెళ్లి కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి మనస్తాపానికి గురైన ఓ యువతి శనివారం గడ్డి మందు తాగింది. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటన లింగంపేట మండలం అయిలాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై సుఖేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పైడాకుల మహేశ్వరి(18)కి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆగస్టు 9న వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం కోసం ఆమె తల్లిదండ్రులు బాలయ్య, గంగమణి అప్పులు చేస్తున్నారు. దీంతో తన కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని మనస్తాపానికి గురైన మహేశ్వరి శనివారం గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా ఆదివారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలి తల్లి గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ కంకర కష్టాలు
లింగంపేట : ‘దేవుడు వరమిచ్చినా–పూజారి కనికరించడం లేదు’ అన్నట్లుగా మారింది భవానిపేట–కంచుమల్ రోడ్డు దుస్థితి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, తండాల రోడ్లకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గుత్తేదారుల అలసత్వం ప్రజలకు శాపంగా మారుతోంది. బంగారు తెలంగాణలో భాగంగా గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా లింగంపేట మండలంలోని భవానిపేట నుంచి కంచుమల్ మీదుగా గాంధారి మండలం గండివేట్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి రూ.2.20 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా మరమత్తులకు నోచుకోని రోడ్డు బీటీ రోడ్డుగా మారుస్తున్నారని పలు గ్రామాలు, తండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ గుత్తేదారు నిర్లక్ష్యంతో ఏడాది దాటినా పనులు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్ రోడ్డును తవ్వించి దానిపై కంకర వేసి మరిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు లింగంపేట మండల పరిదిలోని భవానిపేట నుంచి గండివేట్ వరకు బీటీ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి. భవానిపేట, జల్దిపల్లి, రాంపూర్, మంబోజిపేట, కంచుమల్, కొండాపూర్, గాంధారి మండలం సీతాయిపల్లి, గండివేట్తో పాటు పలు తండాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంట సుమారు 12 కీలోమీటర్లు ప్రతి రోజు లింగంపేట మండల కేంద్రానికి, ఎల్లారెడ్డికి వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు పనులను ప్రారంభించారు. సంవత్సరం గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన కంకర అక్కడే ఉండడంతో ప్రతి రోజు వాహనాలు అదుపు తప్పి పడిపోయి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో పలు గ్రామాలు, తండాలకు చెందిన గర్భిణులు ప్రతి నెల చెకప్ కోసం అసుపత్రులకు వెళ్లాలంటే, రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తిరిగే ద్విచక్ర వాహనాలు, ఆటోలు వారం రోజులకే చెడిపోతున్నాయని వాహన దారులు వాపోతున్నారు. రోడ్డు పనులు బాగు చేయాలని అధికారులను, నాయకులను పలుమార్లు కోరినా విసిగించుకుంటున్నారే తప్పా పనులు ప్రారంభించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. -
చేతుల్లోనే చివరి శ్వాస..
అతిసారంతో విద్యార్థి మృతి లింగంపేట: మూడు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు.. అందరూ చూస్తుండగానే చేతుల్లోనే ప్రాణాలొదిలాడు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సురాయిపల్లి తుల్జానాయక్ తండాకు చెందిన రమావత్ మహేశ్ (8) వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా డు. శుక్రవారం సాయంత్రం కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు వసురాం, సక్రీ 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. కానీ, ఆ వాహనం వచ్చేలోపే.. అందరూ చూస్తుండగానే వారి చేతుల్లోనే ఆ బాలుడు మృతి చెందాడు. తండాలో మరికొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హైదరాబాద్, కామారెడ్డి, లింగంపేటల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
4 ఏటీఎంలలో భారీ చోరీ
-
చక్రాలూడిన ఆర్టీసీ బస్సు
అదుపు తప్పిన బస్సు- డ్రైవర్‌కు గాయాలు లింగంపేట : మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగిబస్సు అదుపుతప్పింది. ఏపీ25 వి8065 నంబర్‌గల ఆర్టీసీ హైర్(అద్దె) బస్సు కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వెళ్తుండగా ముస్తాపూర్ గ్రామ శివారులో ముందు చక్రాల రాడ్ విరిగి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాపర్తి సాయిలుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక 108 సిబ్బంది డ్రైవర్‌ను వైద్య చికిత్సల నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెల్సుకున్న స్థానిక ఎస్సై పల్లె రాకేశ్, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. -
వాట్ ఎన్ ఐడియా!
పాఠశాలలో కంప్యూటర్లు చోరీ ‘ఆధార్’ వెలిముద్ర లతో పట్టుకుంటామని దండోరా భయంతో కంప్యూటర్లను పాఠశాలలో ఉంచిన దొంగలు లింగంపేట : దొంగిలించిన కంప్యూటర్లను ఎలా రప్పించాలనీ ఆలోచించారు మండలంలోని మెంగారం గ్రామస్తులు. ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా వేలిముద్రలనుసేకరించి దొంగతనాన్ని బయట పె డతామనీ పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కుంటరాజు దండోరా వేయించడంతో భయపడ్డ దొం గలు తాము దొంగిలించిన కంప్యూటర్లను తిరిగి పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లిన ఘటన గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తరగతి గది తాళం పగుల గొట్టి నాలుగు కంప్యూటర్లను, ఒక సీపీఎస్‌ను, స్పీకర్బాక్స్లను దొంగిలించారు. 4వ తేదీన పాఠశాల తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పాఠశాలలో కంప్యూటర్లు చోరీకి గురైన విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఎస్ఎంసీ చైర్మన్‌తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అంతటితో ఆగకుండా చైర్మన్ రాజు గ్రామస్తులతో చర్చిం చారు. దొంగతనం జరిగినందున తలుపులు,కంప్యూటర్ డెస్క్‌లపై గల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. మరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా గ్రామస్తులందరి వేలిముద్రలను సేకరిస్తామనీ, దాంతో కంప్యూటర్లు దొంగిలించిన వ్యక్తులను ఈజీ గా పట్టుకోవచ్చని భావించి ఈనెల 6న రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. దాంతో భయాం దోళనకు గురై కంప్యూటర్ల చోరీకి పాల్పడిన వారు వాటిని పాఠశాల ఆవరణలో పెట్టివెళ్లిపోయారు. నాలుగు కంప్యూటర్లు చోరీకి గురికాగా దొంగలు మూడు కంప్యూటర్లను మాత్రమే పాఠశాలలో పెట్టారు. మరో కంప్యూటర్, సీపీఎస్,స్పీకర్ బాక్స్‌లు దొంగల వద్దనే ఉన్నాయి. పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నట్లు గమనించిన ఓ రైతు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నా రు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విండో సిబ్బందిపై చర్యలు తీసుకోండి
లింగంపేట : గతంలో రుణమాఫీ అయినట్లు పత్రాలు చూపిన సింగిల్ విండో సిబ్బంది.. ఇప్పుడు మాఫీ కాలేదని, అప్పు ఉందని పేర్కొంటున్నారని రైతులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ముందుగా రైతులు నల్లమడుగు విండో కార్యాలయానికి చేరుకుని విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో, కార్యాలయ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. నల్లమడుగు సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రుణ మాఫీ పథకాన్ని అమలు చేశారు. నల్లమడుగు సింగిల్ విండో పరిధిలో 540 మంది రైతులకు రుణమాఫీ కాగా సకాలంలో రుణాలను చెల్లిస్తూ వచ్చిన 1,042 మందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. కాగా డబ్బులకు కక్కుర్తి పడ్డ విండో సిబ్బంది కొందరు.. రైతులకు రుణమాఫీ అయినట్లు ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. తిరిగి రుణాలు ఇచ్చినట్లుగా పత్రాలను తయారు చేసి పాత రుణాన్నీ అందులో కలిపారు. ఈ విషయాన్ని రైతులకు చెప్పలేదు. రుణాలు చెల్లించిన వారికి ఇచ్చిన ప్రోత్సాహకాన్నీ నొక్కేశారు. తెలంగాణ సర్కార్ రుణమాఫీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి రుణాలు ఉన్న రైతుల పేర్లు చదివారు. దీంతో అసలు విషయం బయటపడింది. గతంలో రుణ మాఫీ అయ్యిందని చెప్పిన 170 మంది రైతుల పేర్లు ఆ జాబితాలో ఉండడంతో వారు ఆందోళన చెందారు. ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్‌ను కలిసి సమస్యను వివరించారు. సింగిల్‌విండో పరిధిలోని బానాపూర్, కొర్పోల్, మోతె గ్రామాలకు చెందిన యాభై మంది రైతులు బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. రుణమాఫీ చేయకుండానే, రుణం చెల్లించి తిరిగి రుణం పొందినట్లుగా పత్రాలు సృష్టించి, ప్రోత్సాహకాన్ని నొక్కేశారని ఆరోపించారు. ఎస్సై పల్లె రాకేశ్ కామారెడ్డి డీఎల్సీఓ గంగాధర్‌తో మాట్లాడారు. విచారణ జరిపి ఫిర్యాదు చేస్తామని ఆయన ఎస్సైతో పేర్కొన్నారు. రైతులు అనంతరం ఎల్లారెడ్డి సీఐ వద్దకు వెళ్లారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ నల్లమడుగు సింగిల్ విండోలో రుణమాఫీ అయినట్లుగా పత్రాలు అందించిన విండో సిబ్బంది ప్రస్తుతం మాఫీ కాలేదంటూ రికార్డులు చూపుతున్నారని, మాకు న్యాయం చేయాలని ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ తహశీల్దార్ అలెగ్జాండర్‌ను ఆదేశించారు. కానీ 15 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేదని రైతులు పేర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన విండో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆందోళనలో విండో వైస్ చైర్మన్ రాయిని సాయిలు, బానాపూర్‌కు చెందిన విఠల్‌రెడ్డి, సుభాష్, లింగాగౌడ్, బండి నర్సింలు, ఈశ్వర్, రాము వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరెన్సీ’ యంత్రాలకు భలే గిరాకీ
లింగంపేట,న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో నకిలీనోట్లను గుర్తించే, నోట్ల లెక్కింపు యంత్రాల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండల కేంద్రంలో తరచూ రూ ఐదువందల నకిలీనోట్లు చలామణీ కావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కే సులు పెట్టి జైలుకు పంపడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు, బ్యాంకర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యంషాపు, పెట్రోల్‌బంక్‌ల నిర్వాహకులు నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. పదమూడేళ్లుగా లింగంపేటలో రూ ఐదువం దల నకిలీనోట్ల చలామణి కొనసాగుతోం ది. గత నెలలో కూడా మండల కేంద్రంలో రూ ఐదువందల నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఆకుల సత్యం అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి పోలీ సులు రూ లక్ష విలువైన నకిలీ ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ నోటంటేనే మండల ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో పలువురు వ్యాపారులు, ఫైనాన్స్ యజమానులు, కిరాణ వర్తకులు, ఎరువులు, విత్తనాల దుకాణాల యజమానులు నకిలీనోట్లను గుర్తించే మిషన్లను కొంటున్నారు. మండల కేంద్రంలో ఇప్పటి వరకు సుమారు 50 మిషన్లను కొనుగోలు చేశారు. ఒక్కో యం త్రానికి రూ 8 వేలనుంచి రూ 10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నకిలీ నోట్ల బారిన పడకూడదంటే మిషిన్ కొనాల్సిందే అంటున్నారు. -
దొంగనోట్ల నిందితులకు రిమాండ్
లింగంపేట,న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ ఐదు వందల రూపాయల చలామణి కేసులో ఐదుగురు నిందితులను గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం... లింగంపేట గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ అలియాస్ సత్యం స్థానిక మద్యం దుకాణంలో రూ.ఐదు వందల నకిలీ నోటును చలామణి చేస్తూ మద్యం షాపు నిర్వాహకుడు మొకిరె బైరయ్యకు చిక్కాడు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఎస్సై పల్లెరాకేశ్, ఎల్లారెడ్డి సీఐ ఎంజీఎస్ రామకృష్ణ ఆకుల సత్యంను అదుపులోకి తీసుకుని విచారించారు. సత్యం ఇచ్చిన సమాచారం మేరకు లింగంపేట గ్రామానికి చెందిన పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ, చింతలరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన పచ్చిపులుసు కామేశ్వర్రావు,సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. వీరిలో పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ నుంచి రూ.41,500లు, ఆకుల సత్యనారాయణ నుంచి రూ.28,500లు, కామేశ్వర్రావు నుంచి రూ.16,000లు, సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్ నుంచి రూ.17,000లు,చింతల రాజు నుంచి రూ.1000ల నకిలీ నోట్లతో పాటు శ్రీనివాస్ నుంచి రూ.1.02 లక్షల ఒరిజినల్ నోట్లను, డ్రైవింగ్ లెసైన్స్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల కేసులో ముఖ్య సూత్రదారి వంశీయేనని, అతనిపై పశ్చిమగోదావరి జిల్లాలో కూడా చీటింగ్ కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. దొంగనోట్లను సరఫరా చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారని, మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.5 వందల నకిలీ నోట్లు బంగ్లాదేశ్‌లో తయారైనట్లు విచారణలో తేలింది. 2009లో ఎల్లారెడ్డిలో దొరికిన నకిలీ రూ.5 వందల నోట్ల కేసులో ఆకుల సత్యనారాయణ , వంశీలు నేరస్తులని చెప్పారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, లింగంపేట ఎస్సై పల్లె రాకేశ్‌కు రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్సై కుమార్‌రాజా,హెడ్ కానిస్టేబుళ్లు కొండల్‌రెడ్డి,పర్వేజ్ మోహినొద్దిన్, రైటర్ ప్రసాద్, కానిస్టేబుళ్లు బశెట్టి, రాము, హోంగార్డులు మహేశ్,హమీద్ పాల్గొన్నారు.