లింగంపేట : గతంలో రుణమాఫీ అయినట్లు పత్రాలు చూపిన సింగిల్ విండో సిబ్బంది.. ఇప్పుడు మాఫీ కాలేదని, అప్పు ఉందని పేర్కొంటున్నారని రైతులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ముందుగా రైతులు నల్లమడుగు విండో కార్యాలయానికి చేరుకుని విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో, కార్యాలయ సిబ్బందితో ఘర్షణ పడ్డారు.
నల్లమడుగు సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రుణ మాఫీ పథకాన్ని అమలు చేశారు. నల్లమడుగు సింగిల్ విండో పరిధిలో 540 మంది రైతులకు రుణమాఫీ కాగా సకాలంలో రుణాలను చెల్లిస్తూ వచ్చిన 1,042 మందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. కాగా డబ్బులకు కక్కుర్తి పడ్డ విండో సిబ్బంది కొందరు.. రైతులకు రుణమాఫీ అయినట్లు ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. తిరిగి రుణాలు ఇచ్చినట్లుగా పత్రాలను తయారు చేసి పాత రుణాన్నీ అందులో కలిపారు.
ఈ విషయాన్ని రైతులకు చెప్పలేదు. రుణాలు చెల్లించిన వారికి ఇచ్చిన ప్రోత్సాహకాన్నీ నొక్కేశారు. తెలంగాణ సర్కార్ రుణమాఫీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి రుణాలు ఉన్న రైతుల పేర్లు చదివారు. దీంతో అసలు విషయం బయటపడింది. గతంలో రుణ మాఫీ అయ్యిందని చెప్పిన 170 మంది రైతుల పేర్లు ఆ జాబితాలో ఉండడంతో వారు ఆందోళన చెందారు. ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్‌ను కలిసి సమస్యను వివరించారు.
సింగిల్‌విండో పరిధిలోని బానాపూర్, కొర్పోల్, మోతె గ్రామాలకు చెందిన యాభై మంది రైతులు బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. రుణమాఫీ చేయకుండానే, రుణం చెల్లించి తిరిగి రుణం పొందినట్లుగా పత్రాలు సృష్టించి, ప్రోత్సాహకాన్ని నొక్కేశారని ఆరోపించారు. ఎస్సై పల్లె రాకేశ్ కామారెడ్డి డీఎల్‌సీఓ గంగాధర్‌తో మాట్లాడారు. విచారణ జరిపి ఫిర్యాదు చేస్తామని ఆయన ఎస్సైతో పేర్కొన్నారు. రైతులు అనంతరం ఎల్లారెడ్డి సీఐ వద్దకు వెళ్లారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
నల్లమడుగు సింగిల్ విండోలో రుణమాఫీ అయినట్లుగా పత్రాలు అందించిన విండో సిబ్బంది ప్రస్తుతం మాఫీ కాలేదంటూ రికార్డులు చూపుతున్నారని, మాకు న్యాయం చేయాలని ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ తహశీల్దార్ అలెగ్జాండర్‌ను ఆదేశించారు.
కానీ 15 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేదని రైతులు పేర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన విండో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆందోళనలో విండో వైస్ చైర్మన్ రాయిని సాయిలు, బానాపూర్‌కు చెందిన విఠల్‌రెడ్డి, సుభాష్, లింగాగౌడ్, బండి నర్సింలు, ఈశ్వర్, రాము వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
విండో సిబ్బందిపై చర్యలు తీసుకోండి
Published Thu, Sep 25 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement