దొంగనోట్ల నిందితులకు రిమాండ్
Published Fri, Oct 18 2013 2:09 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
లింగంపేట,న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ ఐదు వందల రూపాయల చలామణి కేసులో ఐదుగురు నిందితులను గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం... లింగంపేట గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ అలియాస్ సత్యం స్థానిక మద్యం దుకాణంలో రూ.ఐదు వందల నకిలీ నోటును చలామణి చేస్తూ మద్యం షాపు నిర్వాహకుడు మొకిరె బైరయ్యకు చిక్కాడు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఎస్సై పల్లెరాకేశ్, ఎల్లారెడ్డి సీఐ ఎంజీఎస్ రామకృష్ణ ఆకుల సత్యంను అదుపులోకి తీసుకుని విచారించారు. సత్యం ఇచ్చిన సమాచారం మేరకు లింగంపేట గ్రామానికి చెందిన పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ, చింతలరాజును అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన పచ్చిపులుసు కామేశ్వర్‌రావు,సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. వీరిలో పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ నుంచి రూ.41,500లు, ఆకుల సత్యనారాయణ నుంచి రూ.28,500లు, కామేశ్వర్‌రావు నుంచి రూ.16,000లు, సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్ నుంచి రూ.17,000లు,చింతల రాజు నుంచి రూ.1000ల నకిలీ నోట్లతో పాటు శ్రీనివాస్ నుంచి రూ.1.02 లక్షల ఒరిజినల్ నోట్లను, డ్రైవింగ్ లెసైన్స్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల కేసులో ముఖ్య సూత్రదారి వంశీయేనని, అతనిపై పశ్చిమగోదావరి జిల్లాలో కూడా చీటింగ్ కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు.
దొంగనోట్లను సరఫరా చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారని, మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.5 వందల నకిలీ నోట్లు బంగ్లాదేశ్‌లో తయారైనట్లు విచారణలో తేలింది. 2009లో ఎల్లారెడ్డిలో దొరికిన నకిలీ రూ.5 వందల నోట్ల కేసులో ఆకుల సత్యనారాయణ , వంశీలు నేరస్తులని చెప్పారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, లింగంపేట ఎస్సై పల్లె రాకేశ్‌కు రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్సై కుమార్‌రాజా,హెడ్ కానిస్టేబుళ్లు కొండల్‌రెడ్డి,పర్వేజ్ మోహినొద్దిన్, రైటర్ ప్రసాద్, కానిస్టేబుళ్లు బశెట్టి, రాము, హోంగార్డులు మహేశ్,హమీద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement