fake note
-
అనకాపల్లె.. అయిదు వందల నోటు.. అమ్మో.. ఏంటా కథ?
నక్కపల్లి, అనకాపల్లి: మండల కేంద్రం నక్కపల్లి పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు రూ.500 నోటు అంటేనే హడలిపోతున్నారు. కొద్ది రోజులుగా పరిసర ప్రాంతాల్లో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంకులను కేంద్రంగా చేసుకుని ముఠా సభ్యులు రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్నారు. మరికొందరు పశువుల మార్కెట్లలో మేకలు,గొర్రెలు, పశువులను కొనుగోలు చేసినప్పుడు దొంగనోట్లు ఇస్తున్నారు. తాజాగా ఆదివారం నక్కపల్లిలో పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పోలీసు వెల్ఫేర్ పెట్రోల్‌బంకులో సుమారు 8 నకిలీ రూ.500 కరెన్సీ నోట్లతో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్/డీజిల్ కొనుగోలు చేశారు. ఇక్కడ పెట్రోల్‌పంపుల వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నకిలీ నోట్లను గుర్తు పట్టే సామర్థ్యం లేకపోవడం, అవసరమైన తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మోసపోతున్నారు. పెట్రోల్‌బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి నగదు అప్పగించేటప్పుడు నకిలీ నోట్లు బయటపడడంతో బిక్కముఖం వేస్తున్నారు. ఈ నష్టం మీరే భరించాలని బంకు యాజమాన్యం చెబుతుండడంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. నక్కపల్లి పోలీసు పెట్రోల్‌బంకులో ఒక యువకుడికి ఏకంగా రూ.500 నోట్లు 6, మరొకరికి 2 నకిలీ నోట్లు వచ్చాయి. మండలంలో చినదొడ్డిగల్లు, వేంపాడు, దేవవరం పెట్రోల్‌బంకుల్లో కూడా ఒక ముఠా గుట్టుచప్పుడు గాకుండా దొంగ నోట్లు చలామణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం, బుధవారాల్లో నక్కపల్లిలో జరిగే వారపుసంతలు,పశువుల మార్కెట్లలో లావాదేవీలు జరిగినప్పుడు అసలైన రూ.500 నోట్ల మధ్య నకిలీ నోట్లను పెట్టి అమాయకులైన వారికి ఇచ్చి మోసగిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లినప్పుడు కట్టలో నకిలీ నోట్లు ఉన్నాయని తెలుసుకున్న పశువుల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. -
పాత రూ.500 నోటు ఇస్తే రూ.50 వేలు..
సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్‌కు ముందు అమలులో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే రూ.50 వేలు వస్తాయంటూ నమ్మబలికిన ముఠా రూ.12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా ఫిర్యాదు అందినప్పటికీ సైదాబాద్ పోలీసులు 48 గంటల్లో కేసు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేష్, మలక్‌పేట ఏసీపీ ఎం.సుదర్శన్‌లతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన రాజ్‌కుమార్ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్‌మహల్ రోడ్లో శ్రీ సంతోషి ఫిల్లింగ్ స్టేషన్ పేరుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రకాష్‌నగర్‌కు చెందిన సంబరం రాజేష్ పని చేస్తున్నాడు. బండ్లగూడకు చెందిన ఏఎం మెటల్ స్టోర్ నిర్వాహకుడు అబేద్ మొహియుద్దీన్, తలాబ్‌కట్టకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి షేక్ అబ్దుల్ బాసిత్ రాజేష్‌కు స్నేహితులు. తన యజమాని బగాడియాకు ఆశ ఎక్కువని, గతంలోనూ అనేక చిన్న చిన్న వ్యవహారాలు నడిపాడని అతడి ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వారిద్దరూ రాజేష్‌తో కలిసి వెళ్లి బగాడియాను పరిచయం చేసుకున్నారు. అదును చూసుకుని బగాడియా వీక్నెస్పై కొట్టాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ త్రయం ఇటీవల బగాడియాను కలిసి తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం ఉందని చెప్పింది. 2002లో ముద్రితమైన పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చిందని, ఆ కరెన్సీ దొరికితే ఒక్కో నోటుకు రూ.50 వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు బగాడియాతో చెప్పారు. తేలిగ్గా డబ్బు వస్తుందనడంతో ఆశపడిన అతను అందుకు అంగీకరించాడు. అయితే ఇప్పుడు పాత నోట్లు ఎక్కడ దొరుకుతాయంటూ ప్రశ్నించగా, సైదాబాద్‌లోని ఓ వ్యక్తి వద్ద రూ.2 కోట్ల పాత కరెన్సీ ఉందని చెప్పారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం ఇస్తే ఆ నోట్లు ఇచ్చేస్తాడని, వాటిలో తమకు కావాల్సిన సిరీస్ పాత నోట్లు ఎంచుకుని మిగిలినవి తిరిగి ఇచ్చేదామని గత శనివారం చెప్పారు. దీంతో ఆదివారానికి రూ.12 లక్షలు సిద్ధం చేసిన బగాడియా ఆ మొత్తం తీసుకుని అబేద్, బాసిత్‌లతో కలిసి బయలుదేరాడు. ఇతడిని సైదాబాద్‌లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వరకు తీసుకువెళ్లిన నిందితులు అక్కడ దృష్టి మళ్ళించారు. సదరు వ్యక్తి అందరినీ ఇంట్లోకి రానీయడని, ముందు తాము వెళ్ళి డబ్బు చూపిస్తామని, ఆపై నమ్మకం కలిగి మిమ్మల్నీ లోపలకు అనుమతిస్తాడని చెప్పారు. అందకు అంగీకరించిన బగాడియా రూ.12 లక్షలు ఇచ్చి వారిని పంపాడు. కొద్దిదూరం వెళ్లిన ఇరువురూ ఆ మొత్తం తీసుకుని ఉడాయించారు. కాస్సేపు అక్కడే వేచి చూసిన బగాడియా తిరిగి తన బంకుకు వచ్చేసి ఆ ఇద్దరి విషయం రాజేష్‌ను అడిగాడు. ఎంత ప్రయత్నించినా తనకూ వారి ఫోన్ నెంబర్లు కలవట్లేదని చెప్పిన అతగాడు బహుశా పోలీసులు పట్టుకుని ఉంటారని, ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారని చెప్పాడు. రెండు రోజులు వేచి చూసిన బగాడియా తాను మోసపోయినట్లు గుర్తించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కస్తూరి శ్రీనివాస్ నేతృత్వంలో రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని రూ.12 లక్షలు రికవరీ చేశారు. ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మూడింతలు చేస్తానని ముంచేశాడు..ఓ డ్రైవర్‌కు నకిలీబాబా బురిడీ బంజారాహిల్స్: యంత్ర తంత్రాలు, పూజలతో మూడింతల డబ్బును చేస్తానంటూ నగరానికి చెందిన ఓ డ్రైవర్‌ను మహారాష్ట్ర బురిడీ బాబా నిండా ముంచాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఎన్ నగర్‌కు చెందిన బండారు రత్నయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు జాఫర్ కోసం అతను తరచూ మంచిర్యాల వెళ్లేవాడు. ఇటీవల మంచిర్యాలకు వెళ్ళినప్పుడు జాఫర్, ప్రభాకర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. జాఫర్, ప్రభాకర్ ఇద్దరూ కలిసి తమకు మహారాష్ట్రలో మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ అనే బాబా తెలుసని రూ. లక్ష ఇస్తే మంత్రాలు, పూజలు చేసి రూ. మూడు లక్షలు చేస్తాడని నమ్మించాడు.రూ. 12 లక్షలు సర్ధితే ’ 36 లక్షలు తీసుకోవచ్చని చెప్పడంతో రత్నయ్య ఈ ఏడాది మే 2న విడతల వారిగా వారికి డబ్బులు ఇచ్చాడు. గత మే నెలలో ఎల్ఎన్ నగర్‌లోని రత్నయ్య ఇంటికి బాబా మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ వచ్చాడు. డబ్బును ఓ బ్యాగులో పెట్టి పూజల అనంతరం రూ. 50 లక్షలు అయ్యిందంటూ ఓ బ్యాగును రత్నయ్యకు ఇచ్చి 15 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం బ్యాగ్‌ను తెరవాలని చెప్పి వెళ్లిపోయాడు. బాబా చెప్పినట్లుగానే రత్నయ్య, జయ దంపతులు పూజలు నిర్వహించి బ్యాగు తెరిచి చూడగా అందులో తెలుపు, నలుపు పేపర్ల బండిళ్లు కనిపించాయి. వెంటనే బాబాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా, పూజల్లో ఏదో లోపం జరిగిందని వెంటనే ఆ బ్యాగు తీసుకొని మహారాష్ట్రకు రావాలని సూచించాడు. దీంతో భార్యతో కలిసి కారులో అక్కడికి వెళ్ళాడు. ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి రూ. 60 వేలు వసూలు చేశాడు. తాను కొద్దిసేపట్లో వస్తానని ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా బాబా రాకపోవడంతో రత్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. జాఫర్, ప్రభాకర్, బాబా ఇర్ఫాన్ ముగ్గురూ కలిసి తనను మోసం చేశారని తెలుసుకొని నిలదీయగా, బాబా వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ బాబాతో పాటు జాఫర్, ప్రభాకర్‌లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీపురుపల్లిలో నకిలీనోట్ల కలకలం...
విజయనగరం, చీపురుపల్లి: చీపురుపల్లి కేంద్రంగా మరోసారి నకిలీనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. చాలా కాలం కిందట ఎన్నోసార్లు నకిలీనోట్లు చలామణి జరిగిన నేపథ్యంలో మరోసారి పట్టణంలో దొంగనోట్లు బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భోగీ సంతలో రూ.200 నోటు ఓ కూరగాయల వ్యాపారి తిరిగి వినియోగదారునికి ఇచ్చే సమయంలో అది నకిలీ నోటుగా గుర్తించారు. దీంతో అటు కూరగాయల వ్యాపారి, ఇటు వినియోగదారుడు అవాక్కయ్యారు. ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని రూ.200 దొంగనోటు చలామణిలోకి వచ్చింది. అయితే రూ.200 నోట్లు కొద్ది కాలం కిందటే అధికారికంగా చలామణిలోకి వచ్చాయి. ఇంతలోనే నకిలీనోట్లు చలామణిలోకి రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా భోగీ రోజున చీపురుపల్లిలో సంత నిర్వహిస్తుంటారు. ఈ సంతకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఇదే అదునుగా నకిలీనోట్లను మార్చేయవచ్చని భావించిన ముఠా వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు జనం చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే సోమవారం మధ్యాహ్నం ఓ కూరగాయల వ్యాపారి తన దగ్గర కూరగాయలు కొనుగోలు చేసిన వ్యక్తికి చిల్లరలో భాగంగా రూ. 200 నోటు ఇవ్వడంతో అది నకిలీదిగా వినియోగదారుడు గుర్తించాడు. దాదాపు జిరాక్స్ నోటుగా కనిపించడంతో పాటు నోటు మధ్యలో ఉండే సిల్వర్ రంగు త్రెడ్ భాగంలో చెమ్కీ పూసినట్లు కనిపించింది. దీంతో ఆ వ్యాపారి తనకు ఆ నోటు ఎవరిచ్చారో తెలియక లబోదిబోమన్నాడు. గతంలోనూ చలామని.. చీపురుపల్లిలో నకిలీనోట్లు చలామణి ఇదేం కొత్తకాదు. మెయిన్రోడ్లో కిరాణా దుకాణాలు, టీ దుకాణాల వద్ద నకిలీనోట్లు బయటపడ్డాయి. ఐదారు సంవత్సరాల కిందట సాక్షాత్తూ ఓ టీ దుకాణదారుడి వద్ద నకిలీనోటు లభ్యమవడంతో పోలీస్ కేస్ కూడా నమోదైంది. రెండేళ్ల కిందట కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సమయంలో భారీ ఎత్తున రూ.లక్షల్లో నకిలీనోట్లతో నిందితులు చీపురుపల్లిలో పోలీసు బృందాలకు దొరికినప్పటికీ పైస్థాయి ఒత్తిడి మేరకు విషయం బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యాల నడుమ మరోసారి నకిలీనోటు కలకలం రేపడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళనలో పడ్డారు. -
ఏటీఎం నుంచి రూ 2000 నకిలీ నోటు
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం వెలువడి ఏడాది అవుతున్నా జనానికి కరెన్సీ కష్టాలు తొలగలేదు. దేశ రాజధానిలో సోమవారం ఏకంగా ఏటీఎం నుంచే ఓ వ్యక్తికి రూ 2000 నకిలీ నోటు వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని ఓ ఏటీఎంలో మహ్మద్ సదాబ్ అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం డీసీబీ బ్యాంక్ ఏటీఎంలో రూ 10,000 డ్రా చేశారు. వీటిలో ఓ 2000 నోటు ఒక వైపు తెల్లకాగితం ఉండటంతో అవాక్కై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యస్ బ్యాంక్‌లో ఖాతా కలిగిన సదాబ్ తొలుత నకిలీ నోటుపై తన బ్యాంక్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, నగదు నింపిన సిబ్బందిని, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. గతంలోనూ ఢిల్లీలోని పలు ఏటీఎంల్లో నకిలీ రూ 2000 నోట్లు వచ్చాయి. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న నకిలీ నోట్లు సంగం విహార్, అమర్ కాలనీ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి కస్టమర్లకు వచ్చాయి. -
మద్యం తాగి.. నకిలీ నోటిచ్చి దొరికాడు
షాద్‌నగర్ క్రైం: పూటుగా మద్యం తాగారు.. రాత్రి సమయం కావడంతో బార్ నిర్వాహకుడ్ని బిల్లు విషయంలో బోల్తా కొట్టించాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా తమ వద్ద ఉన్న పిల్లలు ఆడుకునే నోట్లను బిల్లు కట్టేందుకు ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని జైభవాని బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించేందుకు సోలీపూర్ తండాకు చెందిన పొర్ర శంకర్ తన మిత్రుడైన కొత్తూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తోట యాదగిరితో కలిసి వచ్చాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు పూటుగా మద్యం సేవించారు. రాత్రి సమయం కావడంతో నకిలీ నోట్లు ఇచ్చి బయట పడదామని నిర్ణయించుకుని పిల్లలు ఆడుకునే నకిలీ రూ. 2వేల నోట్లను రెండింటిని నిర్వాహకుడికి ఇచ్చారు. అనుమానం వచ్చిన బార్ నిర్వాహకుడు పరిశీలించి చూడగా నకిలీ నోట్లని తేలడంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తోట యాదగిరి అక్కడి నుండి పారిపోవడంతో పొర్ర శంకర్‌ను పట్టుకుని బార్ నిర్వాహకులు పోలీసులకు అప్పజెప్పారు. బార్ నిర్వాహకుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీనివాస చారి తెలిపారు. -
ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు!
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏటీఎంలో ఫుల్ ఆఫ్ ఫన్ పేరుతో రూ.500 నోటు రావడం కలకలం సృష్టించింది. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న లైన్‌మన్ అంపావల్లి చిన్నారావు కరూర్ వైశ్య బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారు. దానిలోంచి నకిలీ రూ.500 నోటు వచ్చింది. ఫన్‌తో పాటు దానిపై మనోరంజన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉంది. నోటు మీద ఉండే నంబర్లన్నీ సున్నాలుగానే ఉన్నాయి. నకిలీ నోట్లు, చిన్నారులు ఆడుకునే నోట్లు కూడా బ్యాంకు ఏటీఎంల నుంచి వస్తుండడంతో అందరూ విస్తుపోతున్నారు. -
నకిలీ నోటుతో మద్యం షాపుకెళ్లి..
-
ఆత్మకూరులో రూ. 2వేల దొంగనోట్లు
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో రూ. 2 వేల దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఆర్టీసీ కండెక్టర్‌ను దొంగ నోటుతో ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కండెక్టర్ శివుడు వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. శ్రీశైలానికి వెళ్లి వచ్చామని, కర్నూలు వెళ్లేందుకు రూ. 2వేలకు చిల్లర ఇవ్వాలని నకిలీనోటు ఇచ్చి చిల్లర తీసుకుని జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కండెక్టర్ కలెక్షన్‌ను చెల్లించేందుకు క్యాష్ కౌంటర్‌కు వెళ్లాడు. కంట్రోలర్ నోట్లను చెక్ చేస్తుండగా రూ.2వేల నకిలీ నోటు బయటపడింది. ఈ నకిలీ నోటు నంబర్ 9బీఎం 608080. తనకు దొంగనోటు ఇచ్చిన వ్యక్తి కోసం బస్టాండ్‌తో పాటు చక్రం హోటల్, ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు గుర్తించేందుకు గాలించినా ఎక్కడా కనిపించలేదు. దీంతో కండెక్టర్ తన సొంత డబ్బును కౌంటర్లో చెల్లించాల్సి వచ్చింది. -
నకిలీ నోట్లతో ఖంగుతింటున్న ప్రజలు
తణుకు టౌన్: కేంద్రప్రభుత్వం తీసుకున్న రూ. 500లు, వెయ్యి నోట్ల రద్దుతో పాత నోట్లను మార్పి సమయంలో బ్యాంక్‌ల వద్ద నకిలీ నోట్లుగా గుర్తించడంతో ప్రజలు ఖంగుతింటున్నారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు నకిలీ నోట్లని బ్యాంక్ అధికారులు చెప్పడంతో నోట్లను కలిగిన వారు గత మూడు రోజులుగా బ్యాంక్‌లు వద్ద గుమిగూడుతున్న జన ంలో కొంతమంది తీసుకుకొచ్చిన నోట్లలో కొన్ని నకిలీ కావడంతో పెద్ద నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రద్దుకు ముందే వివిద మార్గాలల్లో వచ్చిన నోట్లను ఇప్పుడు మార్పిడీ చేసే సమయంలో నకిలీవని తేలడం చాలా బాదగా వుందని పేర్కొంటున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి బ్యాంక్ ఏటియంల నుంచి నగదు తీసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు పట్టణంలో మాత్రం ఇంకా ఏటీయం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పాత నోట్లను వివిద ప్రభుత్వ పన్నులు, బిల్లులు చెల్లించవచ్చని ప్రభుత్వ ఆదేశాలున్నా అమలులో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా విద్యుత్ బిల్లులు, కుళాయి పన్నులు, ఇంటి పన్నుల వంటి చెల్లింపులలో రూ. 500,1000లను రౌండ్ ఫిగర్ల మొత్తాలనే తీసుకుంటున్నారు. రూ. 200, 300, 1200లు వున్న బిల్లులకు 500, 1000 తీసుకుని మిగిలిన మొత్తాను వచ్చేలకు అడ్వాన్సులు చూపిస్తున్నారని, చిల్లర అడిగితే బిల్లుల తీసుకోకుండా మీరే చిల్లర తెచ్చుకోండి తిరస్కరిస్తున్నారు. దీనితో తమకు మిగిలిన ఖర్చులకు డబ్బులు ఎలా? ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నోట్లు రద్దు చేసేముందు అందుకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వారానికి రూ. 4 వేలు విత్ డ్రా చేసుకుని ఎలా బ్రతకాలని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం అమ్మితే వచ్చిన నోట్లే అయినా.. నెల క్రితం పొలం అమ్మగా వచ్చిన రూ వెయ్యి నోట్లలో మిగిలిన నోట్ల మార్చుకునేందుకు బ్యాంక్ వెళ్లే అందులో ఒకటి నకిలీదన్నారు. దీనితో ఏమీ చేయాలో తెలియడంలేదు. ఈసొమ్ము ఇప్పుడు తీసుకున్నది కాదు. పొలం అమ్మిన సొమ్మును ముగ్గురం పంచుకున్నాం. నాకు వాటాకు అన్ని రూ. 1000 నోట్లే వచ్చాయి. అందులో ఒక నోటు నకిలీదంటుందన్నారు. ఈనోటును బ్యాంక్ వారు తీసుకోమంటున్నారు. తణుకు పెద సత్యం, తణుకు. కొత్తనోటకూ చిల్లర కరువే ప్రభుత్వం ప్రవేశపెటì ్టన రూ. 2000, 500ల నోట్లకు మార్కెట్లో చిల్లర దొరకడం కష్టంగా వుంది. నోట్ల పెద్ద రద్దు చేసినప్పుడు మార్కెట్లో తగినంత చిల్లర వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రద్దు చేయడం ఎంత నష్టమో పెద్ద నోట్లను మార్కెట్లో విడుదల చేసే ముందు కూడా చిల్లరను విడుదల చేయడం అవసరం. కానీ ఈరెండు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎంఎస్ రామారావు, పెన్షన్ దారుడు, తణుకు. -
ఆ నోటు ఇచ్చి నటికి టోపీ పెట్టాడు!
నకిలీ కరెన్సీ బెడద ఇప్పటికీ దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. నకిలీ నోట్లను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎన్నో చర్యలను తీసుకుంటున్నది. అయినా, అసలైన నోటు ఏదో నకిలీ నోటు ఏదో గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. నకిలీ కరెన్సీ మాఫియా అచ్చం ఒరిజినల్ కరెన్సీ తరహాలోనే ఫేక్ కరెన్సీని దేశంలోకి ప్రవేశపెడుతున్నది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి జనాలది. అయితే, ఇటీవల ఓ టీవీ నటికి వందరూపాయల నోటు ఇచ్చి ఆటోడ్రైవర్ తెలివిగా బోల్తా కొట్టించాడట. నిజానికి అతడు ఆమెకు ఇచ్చింది నకిలీ నోటు కాదు. పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారు కదా డూప్లికేట్ నోట్లు. రాత్రి సమయంలో అలాంటి వందరూపాయల నోటు ఆమె చేతిలో పెట్టి అతను తుర్రుమన్నాడట. తీరా వెలుగులోకి వచ్చి చూస్తే అచ్చం వందరూపాయల నోటులాగే ఉన్నా.. దానిపై వందరూపాయల కూపన్ అంటూ తెలుగు, హిందీ భాషల్లో స్పష్టంగా రాసి ఉంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది. 'సాలా కమీనాగాడు. గతరాత్రి ముంబైలో ఓ ఆటోవాలా నన్ను ఫూల్ చేశాడు. అతను ఇచ్చిన నోటులో మరీ దారుణంగా 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ఉంది' అంటూ హిందీ టీవీ సీరియళ్లలో నటించే మేఘా చక్రబర్తి తన ఫేస్బుక్లో గోడు వెళ్లబోసుకుంది. మరీ కామెడీగా ఇలా మోసపోవడమేమిటంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఆమె పెట్టిన నకిలీ వందనోటు ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. 'ఖ్వాబోంకి జమీన్ పర్' వంటి సీరియళ్లలో నటించిన ఆమె పోస్టును ఇప్పటికే 1500కుపైగా షేర్ చేసుకున్నారు. -
కల్తీ కల్లు తాగి ఒకరి మృతి
కల్తీ కల్లు, కల్లెం పుష్పమ్మ, మరో ఐదుగురి పరిస్థితి విషమం నల్లగొండ(భువనగిరి): నల్లగొండ జిల్లా భువనగిరి మండల బాలంపల్లిలో మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగి ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన దూడల పెద్దమల్లయ్యగౌడ్ వద్ద కాశపాక మల్లేశ్, కాశపాక స్వామి, కాశపాక ఉపేంద్ర, కల్లెం పుష్పమ్మ కల్లెం కళమ్మ, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ కల్లు తాగారు. అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో వీరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాశపాక మల్లేశ్(42) మృతిచెందాడు. మిగిలిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కల్లెం పుష్పమ్మ పరిస్థితి విషమంగా ఉంది. -
దొంగనోట్ల నిందితులకు రిమాండ్
లింగంపేట,న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ ఐదు వందల రూపాయల చలామణి కేసులో ఐదుగురు నిందితులను గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం... లింగంపేట గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ అలియాస్ సత్యం స్థానిక మద్యం దుకాణంలో రూ.ఐదు వందల నకిలీ నోటును చలామణి చేస్తూ మద్యం షాపు నిర్వాహకుడు మొకిరె బైరయ్యకు చిక్కాడు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఎస్సై పల్లెరాకేశ్, ఎల్లారెడ్డి సీఐ ఎంజీఎస్ రామకృష్ణ ఆకుల సత్యంను అదుపులోకి తీసుకుని విచారించారు. సత్యం ఇచ్చిన సమాచారం మేరకు లింగంపేట గ్రామానికి చెందిన పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ, చింతలరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన పచ్చిపులుసు కామేశ్వర్రావు,సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. వీరిలో పోతాయిపల్లి సాయిలు అలియాస్ వంశీ నుంచి రూ.41,500లు, ఆకుల సత్యనారాయణ నుంచి రూ.28,500లు, కామేశ్వర్రావు నుంచి రూ.16,000లు, సుగ్గు వెంకటపద్మనాభ శ్రీనివాస్ నుంచి రూ.17,000లు,చింతల రాజు నుంచి రూ.1000ల నకిలీ నోట్లతో పాటు శ్రీనివాస్ నుంచి రూ.1.02 లక్షల ఒరిజినల్ నోట్లను, డ్రైవింగ్ లెసైన్స్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల కేసులో ముఖ్య సూత్రదారి వంశీయేనని, అతనిపై పశ్చిమగోదావరి జిల్లాలో కూడా చీటింగ్ కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. దొంగనోట్లను సరఫరా చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారని, మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.5 వందల నకిలీ నోట్లు బంగ్లాదేశ్‌లో తయారైనట్లు విచారణలో తేలింది. 2009లో ఎల్లారెడ్డిలో దొరికిన నకిలీ రూ.5 వందల నోట్ల కేసులో ఆకుల సత్యనారాయణ , వంశీలు నేరస్తులని చెప్పారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, లింగంపేట ఎస్సై పల్లె రాకేశ్‌కు రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్సై కుమార్‌రాజా,హెడ్ కానిస్టేబుళ్లు కొండల్‌రెడ్డి,పర్వేజ్ మోహినొద్దిన్, రైటర్ ప్రసాద్, కానిస్టేబుళ్లు బశెట్టి, రాము, హోంగార్డులు మహేశ్,హమీద్ పాల్గొన్నారు. -
బ్యాంకులో నకిలీ నోటు
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్ డే అండ్ నైట్ బ్రాంచిలో విత్ డ్రా చేసిన నగదులో నకిలీ నోటు వచ్చిందని కింతలి మిల్లుకు చెందిన సీహెచ్ అప్పలస్వామి ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రా బ్యాంక్‌లో విత్ డ్రా చేసి తీసుకురావాలని రూ. 1,37,800ల చెక్కును తన స్నేహితుడు కె.ఎర్రయ్యకు అప్పలస్వామి ఇచ్చాడు. ఎర్రయ్య నగదు విత్ డ్రా చేసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి స్టేట్ బ్యాంక్‌లో ఆ నగదు డిపాజిట్ చేశారు. అందులో ఒక వెయ్యి రూపాయల నోటు నకిలీదిగా బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారిద్దరూ ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లి ఇప్పుడే నగదు విత్‌డ్రా చేశామని, అందులో ఒక వెయ్యి రూపాయల నోటు నకిలీది ఇచ్చారని బ్యాంకు మేనేజరుకు తెలిపారు. దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ముందుగానే చూసుకోవాలని బీఎం చెప్పారని, బ్యాంకులోనే నకిలీ నోట్లు ఇచ్చారంటూ బాధితులు ఆరోపించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎ.మదన్మోహన్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, అసలేం జరిగిందో ఎవరికీ తెలియదని, బ్యాంక్‌లో నగదును విత్ డ్రా చేసి తీసుకువెళ్లేటప్పుడు ముందుగానే పరిశీలించుకుని వెళ్లాలన్నది రిజర్వు బ్యాంక్ నిబంధన అని తెలిపారు. బ్యాంక్ దాటి వెళ్లిన తర్వాత ఆ నగదుకు, బ్యాంకుకు ఏ సంబంధం ఉండదని తెలిపారు. బ్యాంకులో ఉన్నపుడు అది నకిలీదని రుజువైతే సంబంధిత క్యాషియర్‌ను ప్రశ్నించవచ్చునని చెప్పారు.