ఆ నోటు ఇచ్చి నటికి టోపీ పెట్టాడు!
నకిలీ కరెన్సీ బెడద ఇప్పటికీ దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. నకిలీ నోట్లను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎన్నో చర్యలను తీసుకుంటున్నది. అయినా, అసలైన నోటు ఏదో నకిలీ నోటు ఏదో గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. నకిలీ కరెన్సీ మాఫియా అచ్చం ఒరిజినల్ కరెన్సీ తరహాలోనే ఫేక్ కరెన్సీని దేశంలోకి ప్రవేశపెడుతున్నది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి జనాలది.
అయితే, ఇటీవల ఓ టీవీ నటికి వందరూపాయల నోటు ఇచ్చి ఆటోడ్రైవర్ తెలివిగా బోల్తా కొట్టించాడట. నిజానికి అతడు ఆమెకు ఇచ్చింది నకిలీ నోటు కాదు. పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారు కదా డూప్లికేట్ నోట్లు. రాత్రి సమయంలో అలాంటి వందరూపాయల నోటు ఆమె చేతిలో పెట్టి అతను తుర్రుమన్నాడట. తీరా వెలుగులోకి వచ్చి చూస్తే అచ్చం వందరూపాయల నోటులాగే ఉన్నా.. దానిపై వందరూపాయల కూపన్ అంటూ తెలుగు, హిందీ భాషల్లో స్పష్టంగా రాసి ఉంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది.
'సాలా కమీనాగాడు. గతరాత్రి ముంబైలో ఓ ఆటోవాలా నన్ను ఫూల్ చేశాడు. అతను ఇచ్చిన నోటులో మరీ దారుణంగా 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ఉంది' అంటూ హిందీ టీవీ సీరియళ్లలో నటించే మేఘా చక్రబర్తి తన ఫేస్‌బుక్‌లో గోడు వెళ్లబోసుకుంది. మరీ కామెడీగా ఇలా మోసపోవడమేమిటంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఆమె పెట్టిన నకిలీ వందనోటు ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. 'ఖ్వాబోంకి జమీన్ పర్' వంటి సీరియళ్లలో నటించిన ఆమె పోస్టును ఇప్పటికే 1500కుపైగా షేర్ చేసుకున్నారు.