బ్యాంకులో నకిలీ నోటు
Published Fri, Sep 13 2013 2:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్ డే అండ్ నైట్ బ్రాంచిలో విత్ డ్రా చేసిన నగదులో నకిలీ నోటు వచ్చిందని కింతలి మిల్లుకు చెందిన సీహెచ్ అప్పలస్వామి ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రా బ్యాంక్‌లో విత్ డ్రా చేసి తీసుకురావాలని రూ. 1,37,800ల చెక్కును తన స్నేహితుడు కె.ఎర్రయ్యకు అప్పలస్వామి ఇచ్చాడు.
ఎర్రయ్య నగదు విత్ డ్రా చేసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి స్టేట్ బ్యాంక్‌లో ఆ నగదు డిపాజిట్ చేశారు. అందులో ఒక వెయ్యి రూపాయల నోటు నకిలీదిగా బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారిద్దరూ ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లి ఇప్పుడే నగదు విత్‌డ్రా చేశామని, అందులో ఒక వెయ్యి రూపాయల నోటు నకిలీది ఇచ్చారని బ్యాంకు మేనేజరుకు తెలిపారు.
దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ముందుగానే చూసుకోవాలని బీఎం చెప్పారని, బ్యాంకులోనే నకిలీ నోట్లు ఇచ్చారంటూ బాధితులు ఆరోపించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎ.మదన్‌మోహన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, అసలేం జరిగిందో ఎవరికీ తెలియదని, బ్యాంక్‌లో నగదును విత్ డ్రా చేసి తీసుకువెళ్లేటప్పుడు ముందుగానే పరిశీలించుకుని వెళ్లాలన్నది రిజర్వు బ్యాంక్ నిబంధన అని తెలిపారు. బ్యాంక్ దాటి వెళ్లిన తర్వాత ఆ నగదుకు, బ్యాంకుకు ఏ సంబంధం ఉండదని తెలిపారు. బ్యాంకులో ఉన్నపుడు అది నకిలీదని రుజువైతే సంబంధిత క్యాషియర్‌ను ప్రశ్నించవచ్చునని చెప్పారు.
Advertisement